క్లిష్ట పరిస్థితులను అధిగమించి అత్యంత వేగంగా ధాన్యం కొనుగోళ్లు: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్

  • లాక్ డౌన్లో రోజుకు రెండు లక్షల మెట్రిక్ టన్నులు
  • యాసంగిలో 50 లక్షల మెట్రిక్ టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
  • పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా, లాక్ డౌన్, అకాల వర్షాల ప్రభావం రైతాంగంపై ఏమాత్రం పడకుండా పకడ్బందిగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం నాడు పౌరసరఫరాల భవన్లో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర చెల్లింపులు తదితర వివరాలను ఎప్పటి కప్పుడు తెలుసుకునేలా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాష్ బోర్డులో ఛైర్మన్ ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.

కరోనా, లాక్ డౌన్, అకాల వర్షాలు వంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించి పౌరసరఫరాల సంస్థ రికార్డుస్థాయిలో గడిచిన 21 రోజుల్లో అత్యంత వేగవంతంగా ధాన్యం కొనుగోలు జరిపిందన్నారు. మే నెలలో కేవలం 21 రోజుల్లో 40.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించిందన్నారు. ఈ నెల12న లాక్ డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కేవలం 10 రోజుల్లో 21.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఇంతవేగంగా ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల శాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఇతర అధికారులు, క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు, సిబ్బంది, ధాన్యం కొనుగోళ్లకు సంబందం ఉన్న వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, సహకార, తదితర విభాగాల అధికారుల కృషి, సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసే వరకు ఇదే వేగాన్ని కొనసాగించాలని అధికారులందరికి పేరు పేరున విజ్ఞప్తి  చేశారు.

వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం యాసంగిలో ధాన్యం దిగుబడి 1 కోటి 30 లక్షలు మెట్రిక్ టన్నులు కాగా స్థానిక అవసరాలు, సీడు తదితర అవసరాలకు పోను మిగిలిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోందన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని ఇంతకంటే ఎక్కువ ధాన్యం వచ్చిన కోనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఇప్పటి వరకు 6892 కొనుగోలు కేంద్రాల ద్వారా 7.45 లక్షల మంది రైతుల నుండి రూ. 9,886 కోట్ల విలువ చేసే 52.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 48.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించడం జరిగిందన్నారు.

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో కొనుగోళ్లు కేంద్రాలను మూసివేయడం జరుగుతోందని ఇప్పటి వరకు 7 జిల్లాల్లో 308 కేంద్రాలను మూసివేయడం జరిగిందన్నారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.92, నల్గొండ 5.92, సూర్యాపేట 4.50, జగిత్యాల 3.33, కామారెడ్డి 3.24, కరీంనగర్ 3.33, ఖమ్మం 2.48, పెద్దపల్లి 2.51, యాదాద్రి 2.35, సిద్దిపేట 2.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించారు.

రైతు కష్టసుఖాలు తెలిసిన రైతుభాందవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా సమయంలో రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడకూడదని గత ఏడాది యాసంగి, ఈ ఏడాది వానాకాలం మరియు యాసంగి మొత్తం మూడు సీజన్లలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆ రాష్ట్రంలో పండిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు.

దేశంలో ఎవరికి సాధ్యం కాని విధంగా ఎంత ఆర్థిక భారమైనా కూడా రైతాంగ సంక్షేమాన్ని కాంక్షించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతాంగ సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యలు ఎన్ని జన్మలెత్తినా ఆయన ఋణం తీర్చుకోలేనిది.

కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్లుకు ధాన్యం తరలించడానికి జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా రవాణా కంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. అయితే ఈ టెండర్లు దక్కించుకున్న రవాణా కాంట్రాక్టర్లు డిమాండ్ కు అనుగుణంగా వాహనాలను సమకూర్చలేకపోయారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానికంగా రవాణా అధికారులతో మాట్లాడి అందుబాటులో ఉన్న ప్రతి వాహనాన్ని వినియోగించుకోవడం వల్ల రవాణా సమస్యను కూడా అధిగమించాం. అయితే రైస్ మిల్లుల్లో హమాలీల కొరత వల్ల ధాన్యం దించుకోవడంలో కొంత జాప్యం జరుగుతుందన్నారు.

కొన్ని జిల్లాల్లో మద్దతు ధర చెల్లింపులు ఆలస్యంగా జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్ అధికారులకు ప్రత్యేక భాద్యతలను అప్పగించడం జరిగిందన్నారు.

More Press News