హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి మరో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్కులు!

  • ద‌మ్మాయిగూడ‌, మేడిప‌ల్లిలో అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను ప్రారంభించిన మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మ‌ల్లారెడ్డి

హైదరాబాద్ వాసులకు మరో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడ‌లో ఆరోగ్యవ‌నం, మేడిప‌ల్లిలో జ‌టాయువు అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల‌ను శుక్ర‌వారం అట‌వీ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ లు దోహదం చేస్తాయన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయింద‌ని, ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కు న‌లువైపులా ‘అర్బన్ లంగ్ స్పేస్’ పేరుతో రిజర్వు ఫారెస్టులను అభివృద్ధి చేస్తుంద‌న్నారు. పర్యాటకులు సైతం సందర్శించేందుకు వీలుగా పార్కుల్లో అదనపు హంగులు సమకూరుస్తున్నామ‌ని చెప్పారు.

ద‌మ్మాయిగూడ‌లో 298 హెక్టార్ల రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఏరియాను అభివృద్ది చేశార‌ని తెలిపారు. రూ.74.424 ల‌క్ష‌ల‌తో గ‌జీబా, కూర్చునేందుకు వీలుగా బెంచ్ లు, వాట‌ర్ హ‌ర్వేస్టింగ్ స్ట్ర‌క్చ‌ర్స్, యోగా షేడ్, వాకింగ్ ట్రాక్ ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. గ‌జీబా (వ్యూ పాయింట్) నుంచి చూస్తే మొత్తం అర్బన్ పార్కు వ్యూ తో పాటు నగరం వ్యూ కూడా కనిపించేలా నిర్మాణం చేశారన్నారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించి ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. పార్క్ లు ఆహ్లాద‌క‌రంగా ఉండేలా స్థానికులు కూడా తోడ్పాటునందించాల‌ని కోరారు.తెలంగాణ ప్ర‌భుత్వం అడవుల‌ను పెంచ‌డం, అట‌వీ భూముల ర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేస్తుంద‌న్నారు. హ‌రిత‌హ‌రం కార్య‌క్ర‌మంలో పెద్ద ఎత్తున మొక్క‌లు నాటుతున్నామ‌ని తెలిపారు. చెట్ల‌ను ర‌క్షిస్తే.. చెట్లు మ‌న‌ల్ని ర‌క్షిస్తాయ‌న్నారు.

మంత్రి మ‌ల్లారెడ్డి మాట్ల‌డుతూ.. సీయం కేసీఆర్ అడ‌వుల ర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధ‌న్యత‌నిస్తున్నార‌న్నారు. న‌గ‌ర‌వాసుల‌కు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని అందించేందుకు రిజ‌ర్వ్ ఫారెస్ట్ ఏరియాను అభివృద్ది చేస్తున్నామ‌ని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పార్కుల్లో ఫుడ్‌ కోర్ట్‌, ఓపెన్‌ జిమ్‌, చిల్డ్ర‌న్ గేమ్ జోన్ ఏరియా, ఏర్పాటు చేస్తామ‌ని వివరించారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా గడపడానికి టూరిజం స్పాట్‌గా ఈ పార్క్ లను  తీర్చిదిద్దుతామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ‌, మేడ్చల్ జిల్లా కలెక్టర్ యంవీ రెడ్డి, అద‌న‌పు పీసీసీఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అట‌వీ శాఖ అధికారి సుధాక‌ర్ రెడ్డి, ఇత‌ర‌ అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


More Press News