గ్రామాల సమగ్ర అభివృద్ధి విధివిధానాలపై సీఎం కేసీఆర్ సమీక్ష!

గ్రామాల పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపరచడానికి, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడానికి ఉద్దేశించబడిన కార్యాచరణ ప్రణాళిక విధివిధానాలపై గురువారం సాయంత్రం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. శుక్రవారం మరో మారు సమీక్ష జరిపి పూర్తి స్థాయి అవగాహనకు వచ్చిన తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాచరణ ప్రణాళికలో ఏ ఏ అంశాలు ఉండాలో శుక్రవారం నిర్ణయం తీసుకుంటామన్నారు.

సమీక్షా సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పంచాయతి రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్ డి ప్రియాంక వర్గీస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యాచరణ ప్రణాళిక విషయంలో సుదీర్ఘంగా చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి ప్రతి నెల రూ. 339 కోట్లు గ్రామపంచాయతిలకు కార్యాచరణ పథకం అమలు ప్రారంభం కావడానికి ముందే విడుదల చేస్తునట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతీ నెల విడుదలయ్యే ఈ నిధులు మొత్తం 8 నెలల పాటు విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యాచరణ ప్రణాళిక అక్టోబర్ 5 లేదా 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం అన్నారు. ఈ లోపల కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని కూడా సీఎం నిర్ణయించారు.

కార్యాచరణ అమలు పటిష్టంగా, పకడ్బందీగా చేయడానికి సర్పంచులను, వార్డు సభ్యులను, అధికారులను, ఇతరులను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. కార్యచరణ ప్రణాళిక అమలులో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీ తన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకొని దానికి గ్రామ సభ ఆమోదం పొందాలని సీఎం అన్నారు. గ్రామంలో ఖర్చు పెట్టే ప్రతీ పైసా గ్రామసభ ఆమోదంతోనే జరగాలని సీఎం అన్నారు.

More Press News