పంటలకు నష్టం చేసే అడవి పందుల నివారణ - మార్గదర్శకాలు

హైదరాబాద్: పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినందున వ్యవసాయ భూముల చుట్టూ కరెంటు వైర్లు, ఉచ్చులు పెట్టడం మానుకోవాలని అటవీ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా కోరాయి. అడవి పందుల పంటల విధ్వంసం, కాల్చివేత ఉత్తర్వుల నేపథ్యంలో అటవీ, వ్యవసాయ, పంచాయితీ రాజ్ శాఖల మధ్య సమన్వయం కోసం అరణ్య భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డిలు నిర్వహించిన సమావేశంలో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) సిద్దానంద్ కుక్రేటీ, ఓఎస్డీ శంకరన్, ఆయా జిల్లాల స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్లు, జిల్లా అటవీ, వ్యవసాయ, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేతకు ప్రభుత్వ ఉత్తర్వులకు కొనసాగింపుగా అటవీ శాఖ మార్గదర్శకాలను (ఆపరేషనల్ గైడ్ లైన్స్) జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో అడవి పందుల గుర్తింపు, కాల్చివేత, తదనంతరం పూడ్చటం ఎలా జరగాలి, దీనిలో సర్పంచ్ లు, స్థానిక అధికారుల పాత్ర- విధివిధానాలపై వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానంగా చర్చజరిగింది. అడవి పందులను అరికట్టే ఉద్దేశ్యంతో పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు, ఉచ్చులు పెట్టడం వల్ల రైతులతో పాటు, వన్యప్రాణులు కూడా చనిపోతున్నాయని, ఇకపై రైతులు ఎట్టిపరిస్థితుల్లో వీటిని అనుసరించవద్దని ఉన్నతాధికారులు కోరారు. సర్పంచ్ లతో పాటు, స్థానిక సంస్థల ప్రతినిధులను ఈ విషయంపై అవగాహన పెంచాలని, రైతు వేదికల ప్రారంభోత్సవాలను ఇందుకు ఉపయోగించుకోవాలని సూచించారు.

అడవి పందుల కాల్చివేతలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, వ్యవసాయ, పంచాయితీ రాజ్ శాఖలకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆర్. శోభ వివరాలు పంపారు.
 
పంటలకు నష్టం చేసే అడవి పందుల నివారణ – మార్గదర్శకాలు:
1. సర్పంచ్ లకు గౌరవ వైల్డ్ లైఫ్ వార్డెన్ హోదా. ఇది ప్రకటించిన రోజు నుంచి ఒక సంవత్పరం పాటు అమలులో ఉంటుంది. కేవలం పంట నష్టపరిచే అడవి పందుల నివారణ కోసం మాత్రమే సర్పంచులకు ఈ హోదా.
2. అడవి పందులు- పంట నష్టంపై రైతులను నుంచి తప్పనిసరిగా రాత పూర్వక ఫిర్యాదు సర్పంచ్ లు స్వీకరించాలి.
3. ఫిర్యాదు అందిన తర్వాత గ్రామ పెద్దలు, రైతులతో కలిసి సర్పంచ్ సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించాలి.  పందుల వల్ల పంట నష్టంపై పంచనామా చేయాలి. అడవి పందుల నివారణకు కాల్చివేత  అవసరమైతే ఆ విషయాన్ని పంచనామాలో రాయాలి.
4. ఆ తర్వాతే గౌరవ వైల్డ్ లైఫ్ వార్డెన్ హోదాలో అడవి పందుల కాల్చివేతకు సర్పంచ్ ఆదేశాలివ్వాలి.
5. అడవి పందుల వేటకు తప్పనిసరిగా అటవీ శాఖ గుర్తించి/జారీ చేసిన జాబితాలో ఉన్న లైసెన్స్ కలిగిన షూటర్ ను మాత్రమే నియమించాలి. లేదంటే జిల్లా/మండల/గ్రామ స్థాయిలో గన్ లైసెన్స్ కలిగిన వారిని కూడా వినియోగించవచ్చు. జిల్లా స్థాయి వారి జాబితాను జిల్లా  ఎస్పీ నుంచి పొందవలెను.
6. సంబంధిత షూటర్ నిపుణుడు అయి ఉండాలి.  గన్ (రైఫిల్) తో పాటు, కాల్చివేతకు అవసరమైన మందుగుండును కలిగి ఉండి పూర్తి ఉచితంగా పనిచేయాలి. గ్రామ పంచాయితీ, సర్పంచ్ ఎలాంటి రుసుమునూ షూటర్ కు చెల్లించరాదు.
7. రైతులకు పంటనష్టం చేస్తున్న అడవి పందులను మాత్రమే కాల్చివేయాలి. గర్భంతో ఉన్న అడవి పందులను, చిన్న పంది పిల్లలను ఎట్టిపరిస్థితుల్లో కాల్చకూడదు. రిజర్వ్ అటవీ ప్రాంతాలు, ఇతర ప్రభుత్వ భూముల్లో ఉన్న వాటిని కాల్చవద్దు. వేట సమయంలో మనుషులకు, ఇతర జంతువులకు, రైతుల ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఏరకమైన నష్టం జరిగినా సంబంధిత వ్యక్తి/షూటర్ దే బాధ్యత. అటవీ శాఖ ఎలాంటి బాధ్యతా వహించదు.
8. ఏ ప్రాంతంలో ఎన్ని అడవి పందులను కాల్చివేతకు అనుమతిని ఇచ్చారో అన్న విషయాన్ని స్థానిక అటవీ అధికారులకు కచ్చితంగా ముందస్తు సమాచారం ఇవ్వాలి.
9. చంపిన అడవి పందుల పంచనామా స్థానిక అటవీ సిబ్బంది సమక్షంలో నిర్వహించిన తర్వాత భూమిలో పాతిపెట్టాలి. అవసరమైన స్థలం గుర్తింపు, ఖర్చుకు ఆయా పంచాయితీలదే బాధ్యత. భూమిలో పాతిపెట్టిన తర్వాత హాజరైన వారి సంతకాలతో కూడిన పంచనామా ప్రతిని అటవీ రేంజ్ అధికారికి అందచేయాలి. చంపిన అడవి పందుల కళేబరంలో ఎలాంటి భాగాన్ని కూడా వదిలివేయటం, మనుషులు వాడటం చేయకూడదు.
10. ఆయా ప్రాంతాల్లో చంపిన అడవి పందుల జాబితాను ప్రతీ నెలా రేంజ్ అధికారి, జిల్లా అటవీ అధికారి ద్వారా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కు పంపాలి.
11. పైన పేర్కొన్న నియమాలు, నిబంధనలు ఖచ్చితంగా సంబంధిత వ్యక్తులు పాటించాలి. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా సెక్షన్ 51, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ – 1970 ప్రకారం శిక్షార్హులు

More Press News