దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ప్రతీ చెరువును నింపాలి: మంత్రి ఎర్రబెల్లి

జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల నుంచి చెరువులకు, పొలాలకు నీటిని అందించే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ పంచాయతీరాజ, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ప్రతి చెరువును నింపేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. సాగునీటి శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ సమన్వయంతో ఈ పనిని విజయవంతంగా పూర్తి చేయాలని అన్నారు. చెరువులను నింపే ప్రక్రియలో ఎక్కడా అడ్డంకులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు.

దేవాదుల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ప్రణాళిక 2019-20పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగామ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే  అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, దేవాదుల ప్రాజెక్టు సీఈ బంగారయ్య, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, జనగామ జాయింట్‌ కలెక్టర్‌ ఒ.జె.మధు, జనగామ డీసీపీ శ్రీనివాస్‌తోపాటు సాగునీటి శాఖ, రెవెన్యూ, పోలీసుల అధికారులు పాల్గొన్నారు. మంచి వర్షాలు రావడంతో గోదావరికి గణనీయ స్థాయిలో వరద ఉందని... దీన్ని వినియోగించుకునేలా రిజర్వాయర్ల నుంచి నీటిని చెరువులకు తరలించాలని అన్నారు.

‘ఆలస్యంగా అయినా వరుణదేవుడు కరుణించడంతో మంచి వర్షాలు కురిశాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని... జనగామ జిల్లాలో మినహా  అంతటా చెరువులకు నీళ్లు  చేరాయి. వర్షాభావం తక్కువగా ఉండే జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టుతోనే నీరు అందుతుంది. ఖరీఫ్‌లో పంటలు పండేలా చెరువులకు నీటిని చేరవేయాలి. వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాదుల ప్రాజెక్టు కింద 418 చెరువులు ఉన్నాయి. దాదాపు అన్ని చెరువులను నింపేలా ప్రణాళిక ఉండాలి. నీటి విడుదల, తరలింపు ప్రక్రియకు శాశ్వత ప్రణాళిక ఉండాలి. దీన్ని పకడ్బందీగా ఇప్పటి నుంచే దీన్ని అమలు చేయాలి. నీటి విడుదల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి. సాగునీటి శాఖ ప్రణాళికకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో అందరికీ అవగాహన కల్పించేలా గ్రామాల్లో డప్పు చాటింపు చేయాలి. పంపులను, తూములను, కట్టలను ధ్వంసం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి.

ఈ విషయంలో ఎమ్మెల్యేల పూర్తి సహకారం ఉంటుంది. సాగునీరు కచ్చితంగా చివరి వరకు చేరుతుందనే ధీమాను రైతులకు కలిగించాలి. అలా చేస్తే రైతులు సైతం ఎక్కడా ఆటంకాలు కలిగించరు. నీటి విడుదల సమాచారాన్ని సాగునీటి శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రెవెన్యూ, పోలీసు శాఖలకు అందించాలి. పోలీసులు పెట్రోలింగ్‌తోపాటు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించడానికి ముందే అన్ని రకాలుగా నీటి తరలింపు వ్యవస్థను పటిష్ట పరచాలి. దేవరుప్పుల, సింగరాయపల్లి, కడివెండి, శాతాపురం చెరువులను నింపేలా ప్రణాళిక ఉండాలి. ఉప్పుగల్, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. వర్ధన్నపేట, పరకాల రైతులకు ఇబ్బంది లేకుండా దేవాదుల నీరు తరలించేలా పనులు పూర్తి చేయాలి’ అని మంత్రి దయాకర్‌రావు, అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలోనే మంత్రి దయాకర్‌రావు... ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించి దేవాదుల నీటి విడుదల ప్రణాళికలను వెల్లడించారు.

దేవాదుల ఎత్తిపోతల పంపింగ్‌ షెడ్యూల్‌: 

  • ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ సౌత్‌(దక్షిణ) మెయిన్‌ కెనాల్‌ ద్వారా సెప్టెంబరు 9 నుంచి సెప్టెంబరు 21 వరకు మొత్తం 12 రోజులపాటు తొలి విడత నీటిని విడుదల చేసేలా ప్రణాళిక ఉంది. 62  చెరువులకు నీటిని విడుదల కానుంది.

  • ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నార్త్‌(ఉత్తర) కెనాల్‌ ద్వారా ఆగస్టు 20 నుంచి సెప్టెంబరు 4 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడతలో నీటిని విడుదల చేసే ప్రణాళిక ఉంది. 27 చెరువులకు నీరు విడుదల కానుంది.

  • ధర్మసాగర్‌ నుంచి ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ ఫేజ్‌– 1 ద్వారా ఆగస్టు 11 నుంచి ఆగస్టు 17 వరకు మొత్తం 7 రోజులపాటు నీరు విడుదల. 12 చెరువులకు నీరు విడుదల అయ్యింది.

  • ధర్మసాగర్‌ నుంచి ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ ఫేజ్‌– 2 ద్వారా జూలై 26 నుంచి ఆగస్టు 19 వరకు మొత్తం 24 రోజులు నీరు విడుదల అవుతుంది. 28 చెరువులకు నీరు చేరుతుంది.

  • ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబరు 11 నుంచి సెప్టెంబరు 25 వరకు మొత్తం 15 రోజులు మొదటి విడత తడి కోసం నీటి విడుదల ప్రణాళిక ఉంది. 30 చెరువులకు నీటి విడుదల జరగనుంది.

  • ఆర్‌.ఎస్‌.ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ ఫోర్‌(4) ఎల్‌ డిస్ట్రిబ్యూటరీ ద్వారా సెప్టెంబరు 11 నుంచి సెప్టెంబరు 25 వరకు మొత్తం 15 రోజులు మొదటి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది. 42 చెరువులకు నీటి విడదల జరగనుంది.

  • ఆర్‌.ఘన్‌పూర్‌–అశ్వారావుపల్లి మెయిన్‌ ప్రెజర్‌ వాల్వుల ద్వారా సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 10 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది. 11 చెరువులకు నీటి విడుదల జరగనుంది.

  • నవాబ్‌పేట రిజర్వాయర్‌ ద్వారా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 10 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది. 82 చెరువులకు నీటి విడుదల జరగనుంది.

  • అశ్వారావుపల్లి రిజర్వాయర్‌ కుడి ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 10 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది.

  • అశ్వారావుపల్లి రిజర్వాయర్‌ గ్రావిటీ మెయిన్‌ కెనాల్‌ ద్వారా సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 10 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది. 11 చెరువులకు నీటి విడుదల జరగనుంది.

  • చీటకోడూరు రిజర్వాయర్‌ రిజర్వాయర్‌ ప్రధాన కాలువ ద్వారా సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 10 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది.

  • బొమ్మకూరు ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 14 నుంచి ఆగస్టు 24 వరకు మొత్తం 10 రోజులపాటు తొలి విడత నీటి విడుదల అవుతుంది. 6 చెరువులకు నీటి విడుదల ఉంది.

  • బొమ్మకూరు కుడి కాలువ ద్వారా ఆగస్టు 11 నుంచి ఆగస్టు 26 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది. 10 చెరువులకు నీటి విడుదల జరగనుంది.

  • బొమ్మకూరు ఫేజ్‌– 2 లోని కన్నెబోయినగూడెం రిజర్వాయర్‌ ద్వారా ఆగస్టు 18 నుంచి నుంచి ఆగస్టు 25 వరకు మొత్తం 10 రోజులపాటు తొలి విడత నీటి విడుదల అవుతుంది. 15 చెరువులకు నీటి విడుదల జరగనుంది.

  • వెల్లండ రిజర్వాయర్‌ రిజర్వాయర్‌ ద్వారా ఆగస్టు 15 నుంచి నుంచి ఆగస్టు 20 వరకు మొత్తం మొత్తం 6 రోజులపాటు తొలి విడత నీటి విడుదల అవుతుంది. 11 చెరువులకు నీటి విడుదల జరగనుంది.

  • తపాస్‌పల్లి ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 9 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది. 23 చెరువులకు నీరు విడుదల జరగనుంది.

  • తపాస్‌పల్లి కుడి కాలువ ద్వారా ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 9 వరకు మొత్తం 15 రోజులపాటు తొలి విడత నీటి విడుదల ప్రణాళిక ఉంది. 39 చెరువులకు నీరు విడుదల జరగనుంది.

  • ఐనాపూర్‌ రిజర్వాయర్‌ రిజర్వాయర్‌ ద్వారా సెప్టెంబరు 2 నుంచి  సెప్టెంబరు 16 వరకు  మొత్తం 15 రోజులపాటు నీటి విడుదల ప్రణాళిక ఉంది.


More Press News