ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా ఖాళీగా ఉన్న దివ్యాంగుల ఉద్యోగాల భర్తీ: కృతికా శుక్లా

  • విభిన్న ప్రతిభావంతులు, లింగ మార్పడి, వయోవృద్దుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా
అమరావతి: విభిన్న ప్రతిభావంతుల కోసం రిజర్వ్ చేయబడి, ప్రస్తుతం ఖాళిగా ఉన్న అన్ని ఉద్యోగాలను ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, లింగ మార్పడి, వయోవృద్దుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ఇందుకోసం నిర్ణీత కాలవ్యవధితో కూడిన షేడ్యూలును సిద్దం చేశామని వివరించారు. ఈ నెల 25వ తేదీ లోపు వివిధ విభాగాలలో ఉన్న ఖాళీ పోస్టులను గుర్తించి, జనవరి 7వ తేదీ నాటికి నియామక ప్రకటన విడుదల చేయాలని ఆదేశించామని కృతికా శుక్లా తెలిపారు.

జనవరి 31 నాటికి అన్ని దశలను దాటి నియామకాలను పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దివ్యాంగుల సమస్యల పట్ల సానుకూల ధోరణితో ఉన్నారని, సీఎం ఆదేశాల మేరకే ఈ ప్రత్యేక నియామక ప్రక్రియను చేపట్టామని స్పష్టం చేశారు. ఆయా విభాగాలకు సంబంధించిన ఉపసంచాలకులు అందరికీ నియామక విషయంలో చేపట్టవలసిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, ప్రకటించిన షేడ్యూలు మేరకు ప్రక్రియ పూర్తి కాకుండా బాద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డాక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు.
 
విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల కార్పోరేషన్ పరిధిలో ఉపకరణాల పంపిణీ:
 
విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల కార్పోరేషన్ పరిధిలో అందుబాటులో ఉన్న విభిన్న ఉపకరణాలను సైతం జనవరి 31వ తేదీలోపు పంపిణీ చేస్తామని సంస్ధ నిర్వహణ సంచాలకురాలు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని సహాయ సంచాలకులు, మేనేజర్ల వద్ద దివ్యాంగులకు ఉపకరించే 2667 ఉపకరణాలు సిద్దంగా ఉన్నాయన్నారు. వీటిలో 231 మూడు చక్రాల సైకిళ్లు, 174 చక్రాల కుర్చీలు, 419 ఊతకర్రలు, 156 టచ్ ఫోన్లు, 1527 వినికిడి సాధనాలు, మరో 160 ఇతర ఉపకరణాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్పోరేషన్ చేరిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితా తయారు చేస్తారని కృతికా శుక్లా తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ధేశించామన్నారు.

More Press News