నెల‌లు నిండ‌ని శిశువును కాపాడిన కిమ్స్ వైద్యులు

  • 950 గ్రాముల బ‌రువుతో ఆరున్న‌ర నెల‌ల‌కే పుట్టిన పాప‌
కర్నూలు, అక్టోబ‌ర్ 23, 2020: నెల‌లు నిండ‌ని శిశువుల‌ను కాపాడ‌టం వైద్యుల‌కు క‌త్తిమీద సామే. అది కూడా ఆరున్న‌ర నెల‌ల గ‌ర్భ‌వతికే పుట్ట‌డం, ఒక కిలో కూడా బ‌రువు లేక‌పోవ‌డంలాంటి స‌మ‌స్య‌లున్న శిశువు ప్రాణాలు కాపాడి, ఆమెను సుర‌క్షితంగా త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించిన ఘ‌న‌త కర్నూలు కిమ్స్ ఆసుప‌త్రి వైద్యుల‌కు ద‌క్కింది. క‌డ‌ప జిల్లాకు చెందిన గీత 15 ఏళ్ల వైవాహిక జీవితంలో రెండోసారి గ‌ర్భం దాల్చారు.

అయితే, ఆరున్న‌ర నెల‌ల‌కే ఆమెకు ఉమ్మ‌నీరు మొత్తం పోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో సిజేరియ‌న్ చేసి బిడ్డ‌ను బ‌య‌ట‌కు తీయాల్సి వ‌చ్చింది. అప్ప‌టికా బిడ్డ బ‌రువు 950 గ్రాములు మాత్ర‌మే. నెల‌లు నిండ‌కుండా పుట్ట‌డంతో బిడ్డ‌ను స్థానిక ఆసుప‌త్రిలో చేర్చారు. అయితే అక్క‌డ ర‌క్తంలో ఇన్ఫెక్ష‌న్, పాలు తాగ‌లేక‌పోవ‌డంలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. దాంతో బిడ్డ‌ను మెరుగైన చికిత్స కోసం కర్నూలు కిమ్స్ ఆసుప‌త్రిలోని ఎన్ఐసీయూకు త‌ర‌లించారు. ఇక్క‌డి ఎన్ఐసీయూలో చేర్చ‌గానే ముందుగా ప‌రీక్ష‌లు చేయ‌డంతో.. బిడ్డ‌కు ర‌క్తంలో ఇన్ఫెక్ష‌న్‌తో పాటు, పేగుల్లో తీవ్ర‌మైన ఇన్ఫెక్ష‌న్ (నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్) ఉన్న‌ట్లు తేలింది.

వాటితోపాటు పేగుల‌కు రంధ్రం కూడా ప‌డింది. దాంతో బిడ్డ‌కు అత్య‌వ‌స‌రంగా శ‌స్త్రచికిత్స చేయాల్సి వ‌చ్చింది. అయితే, బిడ్డ బ‌రువు కిలో లోప‌లే ఉండ‌టం, తీవ్ర‌మైన ఇన్ఫెక్ష‌న్ కూడా ఉండ‌టంతో శ‌స్త్రచికిత్స చాలా ముప్పుతో కూడుకున్న‌ది. అయితే, క‌ర్నూలు కిమ్స్ ఆసుప‌త్రిలోని అత్యంత నిపుణులైన పీడియాట్రిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ బాబు ముందుకొచ్చారు. బిడ్డ‌కు ఇన్ఫెక్ష‌న్ ఉండ‌టం, పేగుల్లో రంధ్రం ఉండ‌టంతో ఇలియోస్ట‌మీ (మ‌ల‌విస‌ర్జ‌న‌కు ప్ర‌త్యేక మార్గం పెట్ట‌డం) చేశారు.

బిడ్డ‌ను ఐసీయూలో పెట్టి, అత్యాదునిక లైఫ్ స‌పోర్ట్ వ్య‌వ‌స్థ‌ల‌పై ఉంచారు. కొన్ని రోజులపాటు వెంటిలేట‌ర్ పెట్టి, త‌ర్వాత క్ర‌మంగా దాన్ని తీసేశారు. ఇంత చిన్న వ‌య‌సులోని పాప‌కు ఇన్ఫెక్ష‌న్ న‌యం చేయాల్సి రావ‌డంతో 3 వారాల పాటు యాంటీబ‌యాటిక్స్ ఇచ్చారు. దాంతోపాటు రెండుసార్లు ర‌క్తం ఎక్కించి, 5 సార్లు ప్లేట్ లెట్లు ఎక్కించారు. పేగులకు శ‌స్త్రచికిత్స జ‌ర‌గ‌డంతో త‌ల్లిపాలు తాగే ప‌రిస్థితి అప్పుడే లేదు. దాంతో రెండు వారాల పాటు పీఐసీసీ లైన్ ద్వారా పేరెంట‌ల్ న్యూట్రిష‌న్ అందించారు. త‌ర్వాత కొద్దికొద్దిగా త‌ల్లిపాలు అల‌వాటు చేసి, ఆ స‌మ‌యంలో పేరెంట‌ల్ న్యూట్రిష‌న్ త‌గ్గించి, చివ‌ర‌కు ఆపేశారు. పాప త్వ‌ర‌గా కోలుకోవ‌డానికి కంగారూ మ‌ద‌ర్ కేర్ అందించారు.

ఇప్పుడు పాప శ‌స్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకుని, త‌ల్లిపాలు తాగుతోంది. క‌న్స‌ల్టెంట్ నియోనాటాల‌జిస్టులు డాక్ట‌ర్ హెచ్.ఎ. న‌వీద్, డాక్ట‌ర్ జి. భరత్ రెడ్డి, డాక్ట‌ర్ ఎన్. భార‌తి లాంటి అనుభ‌వ‌జ్ఞులైన వైద్య‌నిపుణులతో పాటు న‌ర్సింగ్ సిబ్బంది కూడా దాదాపు నెల రోజుల పాటు పాప‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకోవ‌డం వ‌ల్లే పాప పూర్తిగా కోలుకుంది. ఇంత సుదీర్ఘ‌కాలంపాటు ఆసుప‌త్రిలో, అది కూడా ఖ‌రీదైన ఐసీయూలో ఉంచినా, అదంతా వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంలోనే అందించారు. దాంతో కుటుంబం మీద ఎలాంటి ఆర్థిక‌భారం ప‌డ‌లేదు. నెల‌లు నిండ‌క‌ముందే పుట్టినా, పాప‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌లేదు. అయితే, పూర్తిస్థాయిలో పెరిగేవ‌ర‌కు ఈ పాప‌కు మ‌ధ్య‌మ‌ధ్య‌లో త‌గిన వైద్య ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రిగా చేయించాలి.

More Press News