యుద్థప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటి లభ్యత ఉన్నప్పటికీ సరియైన విధంగా వాటిని వినియోగించుకోవడం లేదనే ఉద్దేశ్యంతో సీయం కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణాలను చేపట్టారన్నారు. దీన్నిదృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా నీటి పారుదల శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ ల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా భూసేకరణ, భూనిర్వాసితులకు నష్టం పరిహారం చెల్లించేందుకు అధిక ప్రాధన్యత ఇవ్వాలన్నారు. ప్రధాన కాలువల, డిస్ట్రిబ్యూషన్ కాలువల భూసేకరణ సత్వరం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. చెక్ డ్యాంల నిర్మాణ పనులను కూడా పూర్తి చేసి చెరువులను నింపేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. కొత్తగా చెక్ డ్యాంల నిర్మాణాలను మంజూరు చేయాలని ప్రజాప్రతినిదులు కోరగా, వీటికి సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ ఇంజనీర్లను ఆదేశించారు.
చనాక- కొరాట, కుమ్రం భీం, జగన్నాథపూర్, నీల్వాయి ప్రాజెక్ట్ పెండింగ్ పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది జూన్ లోగా 93 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. అదేవిధంగా ప్రాణహిత ప్రాజెక్ట్ కు సంబంధించి సర్వేను చేపట్టి పనులు త్వరగా ప్రారంభమయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా ఆసిఫాబాద్, సిర్పూర్- కాగజ్ నగర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో సుమారు లక్ష 70 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు జలాలను అందించే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేష్ ద్వారా లక్ష 30 వేల ఎకరాలకు ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వొచ్చన్నారు.
ప్యాకేజీ 27 ద్వారా డిసెంబర్ లో 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 27, సదర్మాట్ బ్యారేజ్ పెండింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ప్యాకేజీ 27 లోని యూనిట్ -1 లెఫ్ట్, రైట్ కెనాల్ ద్వారా డిసెంబర్ లో 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా కార్యాచరణ ను రూపొందించి పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. తద్వారా చెరువులను నింపి వేసంగి పంటలకు సాగు నీరందించవచ్చని తెలిపారు. దీంతో పాటు ప్యాకేజీ 28 కు సంబంధించి భూసేకరణను పూర్తి చేసి పనులు ప్రారంభించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి, రేఖ శ్యాంనాయక్, దివాకర్ రావు, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఏస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, అదిలాబాద్ సీఈ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సార్ఎస్పీ సీఈ శంకర్, తదితరులు పాల్గొన్నారు.