నిత్యం నిరాటంకంగా మిషన్ భగీరథ మంచినీరు: మంత్రి ఎర్రబెల్లి
- అక్టోబర్ 15వరకల్లా 80శాతం, 30లోగా వంద శాతం స్థిరీకరణ పూర్తి కావాలి
- నవంబర్ 30 లోగా...సోలార్ విద్యుత్ ద్వారా 126 ఐసోలేటెడ్ హ్యాబిటేషన్స్ కూ మంచినీరు
- బడి, గుడి, అంగన్ వాడీ, చర్చీ, మసీదులు మొదలు ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలకూ భగీరథ నీరు
- పనులన్నీ పూర్తి చేయండి... పకడ్బందీగా స్థీరకరించండి
- మిషన్ భగీరథ స్థిరీకరణ పనులను సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రా మీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
అక్టోబర్ 15వరకల్లా 80శాతం, 30లోగా వంద శాతం స్థిరీకరణ పూర్తి కావాలి. నవంబర్ 30 లోగా...సోలార్ విద్యుత్ ద్వారా 126 ఐసోలేటెడ్ హ్యాబిటేషన్స్ కూ మంచినీరు అందించాలి. బడి, గుడి, అంగన్ వాడీ, చర్చీ, మసీదులు మొదలు ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలకూ భగీరథ నీరు అందాలి. మిగిలిన ఓవర్ హెడ్ ట్యాంకులు పూర్తవ్వాలి. ఈ పనులన్నీ పూర్తి చేయండి... పకడ్బందీగా స్థీరకరించండి. అంటూ మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో మిషన్ భగీరథ నీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి, అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలనుసారం, ఆయన కలల ప్రాజెక్టు మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వారా ఈ పథకం అత్యంత అద్భుత పథకంగా జీరో శాతం ఫ్లోరైడ్ నీటిని అందిస్తున్న రాష్ట్రంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి అధికారులకు తెలిపారు.
భగీరథ పథకాన్ని కేంద్రం సహా, 13 రాష్ట్రాలు వేర్వేరు పేర్లతో తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాయన్నారు. రాష్ట్రంలో 23,804 గ్రామీణ ఆవాసాలకు గాను, 21,478ఆవాసాల్లో మంచినీరు అందుతున్నదన్నారు. 1607 ఆవాసాలు సింగూరు ఆధారిత ప్రాజెక్టు కింద ఉండగా, మిగతా ఆవాసాల్లో సాంకేతిక కారణాల వల్ల నీటిని అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇప్పటికే 10,682 గ్రామాల్లో (43శాతం) స్థిరీకరణ పూర్తయిందన్నారు. ఇంకా మిగతా స్థిరీకరణ పనులు అక్టోబర్ 15వరకల్లా 80శాతం, అక్టోబర్ 30లోగా వంద శాతం స్థిరీకరణ పూర్తి కావాలని మంత్రి అధికారులకు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 126 మారుమూల గ్రామాలను గుర్తించామని, వాటికి మంచినీటిని అందించేందుకు వెంటనే ప్రణాళికలు రూపొందించి, నవంబర్ 30 లోగా...సోలార్ విద్యుత్ ద్వారా ఆ 126 ఐసోలేటెడ్ హ్యాబిటేషన్స్ కూ మంచినీరు అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. బడి, గుడి, అంగన్ వాడీ, చర్చీ, మసీదులు మొదలు వైకుంఠ ధామాలకూ మిషన్ భగీరథ నీరు అందించాలని మంత్రి ఆదేశించారు.
పాత ట్యాంకులకు రిపేర్లు, అన్ని కొత్త ట్యాంకులు పని చేసేలా చూడటం, ఓవర్ హెడ్ ట్యాంకుల చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడటం, పైపులు భూమిలోకి వేయడం, సిసి రోడ్లను పునరుద్ధరించడం, ఇంటింటికీ మంచినీరు క్రమం తప్పకుండా అందించడం, లబ్ధిదారులను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం వంటి పనులన్నీ స్థిరీకరణ కిందకు వస్తాయని మంత్రి అధికారులకు వివరించారు. ఈ పనులన్నీ పూర్తి చేయండి... పకడ్బందీగా స్థీరకరించండి అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తయ్యేలా సిఇలు, ఎస్ ఇ ఇలు నిరంతరం పని చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలొ మిషన్ భగీరథ సెక్రటరీ, సిఎంఓ కార్యదర్శి స్మిత సభర్వాల్ తో పాటు మిషన్ భగీరథ ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్ తో పాటు రాష్ట్రంలోని సిఇ, అన్ని జిల్లాల ఎస్ ఇ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.