అక్టోబ‌ర్ 15 లోగా అందుబాటులోకి పిఎంఎస్‌ఎస్ వై హాస్పిట‌ల్: మంత్రి ఎర్ర‌బెల్లి

  • ఎంజిఎం సేవ‌లు మ‌రింత మెరుగు ప‌డాలి
  • క‌మ‌లాపూర్ లో 40 ప‌డ‌క‌ల ఐసోలేష‌న్ కేంద్రం
  • శ‌వాల త‌ర‌లింపు అవ‌క‌త‌వ‌క‌ల ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణకు ఆదేశం
  • ఎంజిఎంలో డ్యూటీ డాక్ట‌ర్లు, హై ప‌వ‌ర్ క‌మిటీ స‌భ్యుల ఫోన్ నెంబ‌ర్ల డిస్ ప్లే
  • ఎంజిఎం వైద్య‌శాల ప‌నితీరుపై స‌మీక్షించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
వ‌రంగ‌ల్, సెప్టెంబ‌ర్ 21ః అక్టోబ‌ర్ 15వ తేదీలోగా, పిఎంఎస్ఎస్ వై హాస్పిట‌ల్ ని అన్ని హంగుల‌తో ప్రారంభోత్స‌వానికి సిద్ధం చేయాల‌ని, ఈ లోగా ఎంజిఎం సేవ‌లు మ‌రింత‌గా మెరుగుప‌డాల‌ని, అందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, సంబంధిత అధికారులు, ఎంజిఎం సూప‌రింటెండెంట్ల‌ను తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశించారు. హ‌న్మకొండ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రి సోమ‌‌వారం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కరోనా వైర‌స్ అదుపు, చికిత్స‌లు, ఎంజిఎం వైద్య‌శాల మెరుగైన సేవ‌లు అందించే అంశాల‌పై క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, సంబంధిత వైద్యాధికారుల‌తో స‌మీక్ష చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ర‌క‌ర‌కాల సాంకేతిక, ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఆల‌స్య‌మవుతున్న కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీలోని పిఎంఎస్ఎస్ వై హాస్పిట‌ల్ ని అన్ని హంగుల‌తో, పూర్తి స‌దుపాయాలు, సౌక‌ర్యాల‌తో అక్టోబ‌ర్ 15లోగా అందుబాటులోకి తేవాల‌ని అదేశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యిన ప‌నుల‌ను మంత్రి అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే ఎంజిఎంలో ప్రస్తుతం 440 బెడ్స్ కోవిడ్ చికిత్స కొరకై అందుబాటులో వున్నాయి. కరోనా పేషెంట్ లు మొత్తం 131 మంది ఉన్నారు. సారి వార్డు (Serious Acute Respiratory Infections – SARI) లో 40 మంది పేషంట్లున్నారు. ఇంకా 230 ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు.

ఎంజిఎం లో 604 మంది పేషంట్లు ఉండ‌గా, 60 ఆక్సిజన్ పడకలు అన్ని సేవ‌ల‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని మంత్రి వివ‌రించారు. పైగా ప్రతి రోజు చేరిన ప్రతి వారికి అంటిజెన్ మరియు ఆర్.టి.పి.సి.ఆర్ టెస్ట్ లు చేస్తున్నారని మంత్రి వివ‌రించారు. ఇంత అద్భుతంగా, ప్రైవేట్ కి మిన్న‌గా ఎంజిఎంలో వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని, వీటిని ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సేవ‌ల‌కు అద‌నంగా ఖజానా జువెల‌ర్స్ వారు రూ.3కోట్ల నిధులిచ్చార‌ని మంత్రి తెలిపారు.

ఈ నిధుల‌తో ఎంజిఎం వైద్య‌శాల‌ను మ‌రింత‌గా అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ ద‌శ‌లో క‌రోనా బాధిత డెడ్ బాడీల త‌ర‌లింపులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై మంత్రి సీరియ‌స్ అయ్యారు. నిజా నిజాలు తేలాల‌ని, వెంట‌నే విచార‌ణ కు ఆదేశించారు. క‌మిటీ వేసి, నివేదిక తెప్పించ‌మ‌ని అధికారుల‌కు మంత్రి చెప్పారు. దోషులు ఎంత‌టి వారైనా వ‌దిలేద‌ని లేద‌ని శ‌వాల మీద పైస‌లు ఏరుకునే దుర్మార్గుల ప‌ని ప‌ట్టాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి అధికారుల‌కు తెలిపారు.

అలాగే, ఎంజిఎంలో ప‌ని చేసే డ్యూటీ డాక్ట‌ర్లు, హై ప‌వ‌ర్ క‌మిటీ స‌భ్యుల ఫోన్ నెంబ‌ర్ల‌ను డిస్ ప్లే చేయాల‌ని ఎంజిఎం సూప‌రింటెండెంట్ నాగార్జున రెడ్డిని మంత్రి ఆదేశించారు. త‌ద్వారా ఎవ‌రికైనా ఇబ్బందులు ఎదురైతే, వారు నేరుగా ఆ నెంబ‌ర్ల‌లో ఎవ‌రికైనా ఫోన్ చేసి మాట్లాడే వీలుంటుంద‌ని తెలిపారు. ఇదిలా వుండ‌గా, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌మ‌లాపూర్ లో 40 ప‌డ‌క‌ల ఐసోలేష‌న్ కేంద్రం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని మంత్రి తెలిపారు. ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వ ద‌వాఖానాల సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని, క‌రోనా వైద్యం విష‌యంలో ప్ర‌భుత్వ ఎంజిఎం ద‌వాఖానాలో ఆక్సీజ‌న్, వెంటిలేట‌ర్లు, త‌దిత‌ర అత్య‌వ‌సర సేవ‌ల‌తో కూడిన వైద్యం అందుబాటులో ఉంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

ఈ స‌మీక్ష‌లో వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, సిపి ప్ర‌మోద్, కెఎంసి ప్రిన్సిపాల్ సంధారాణి, డిఎం అండ్ హెచ్ ఓ, ఇత‌ర అధికారులు ఉన్నారు.

నాలాలపై దురాక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు వేగంగా జ‌ర‌గాలి: మంత్రి 
వ‌రంగ‌ల్, సెప్టెంబ‌ర్ 21ః గత కొద్ది రోజుల క్రితం భారీగా కురిసిన వ‌ర్షాల కార‌ణంగా వ‌రంగ‌ల్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల ముంపు, జ‌ల‌మ‌యానికి కార‌ణ‌మైన నాలాల‌పై దురాక్ర‌మ‌ణ‌ల క‌ట్ట‌డాల‌ను సాధ్య‌మైనంత వేగంగా తొల‌గించాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర‌ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అభివృద్ధి, నాలాల‌పై దురాక్ర‌మ‌ణ‌లు, క‌ట్ట‌డాల తొల‌గింపు వంటి ప‌లు అంశాల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి వ‌రంగ‌ల్ లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో స‌మీక్ష జ‌రిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ‌త ఆగ‌స్టు నెల‌లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌రంగ‌ల్ లోత‌ట్టు ప్రాంత‌లు జ‌ల‌మ‌య‌మైన సంగ‌తి తెలిసిందేన‌ని, అయితే, ఆనాడు ప్ర‌జ‌లంతా ముక్త కంఠంతో నాలాల‌పై క‌ట్ట‌డాల‌ను, దురాక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించాల‌ని కోరార‌న్నారు. ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌,  ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కెటిఆర్ వ‌రంగ‌ల్ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా కూడా ప్ర‌జ‌లు ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెప్పార‌న్నారు. దీంతో ప్ర‌జాభీష్టం మేర‌కు నాలాల‌పై దురాక్ర‌మ‌ణ‌లన్నింటినీ తొల‌గించాలని నిర్ణ‌యించాం. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు దురాక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు కూడా జ‌రిగింది. ఇంకా మిగిలిన ప‌నులు వేగంగా పూర్త‌వ్వాల‌ని క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తిని మంత్రి ఆదేశించారు. అల‌స‌త్వం వ‌హించే అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.

ఈ స‌మీక్ష‌లో క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, సిపి ప్ర‌మోద్, ఇత‌ర అధికారులు ఉన్నారు.

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత:
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయం వద్ద 126 మంది లబ్ధిదారులకు 1,24,14,916/-  కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పేద ఆడబిడ్డల పెండ్లికి కట్నంగా సీఎం కేసిఆర్ పెద్దన్నగా కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందించి పేదోల్ల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారన్నారు అలాగే సీఎం కేసిఆర్,మంత్రి కెటీఆర్ యొక్క ఆలోచనలతో  రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

More Press News