ఘనంగా ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలి: అధికారులకు ఏపీ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఆదేశం

  • ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
  • రూ.100 కోట్ల విలువైన ఉపకరణాలు, చెక్కుల పంపిణీ
  • రూ.43 కోట్ల పనులకు శంఖుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు
ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అదివాసీ దినోత్సవం జరపటం అనవాయితీ కాగా, రాష్ట్రంలోని అరకులోయ వేదికగా గిరిజన సంక్షేమ శాఖ  ఈ ఏడాది కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  ఈ నేపధ్యంలో ముఖేష్ కుమార్ మీనా మంగళవారం విజయవాడలో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రవీంద్రబాబు, గిరిజన గురుకులాల కార్యదర్శి భానుప్రసాద్, శాఖ సివిల్ ఇంజనీరింగ్ విభాగపు ఇంజనీర్ ఇన్ ఛీప్ శేషు బాబు, ఓ ఎస్ డి ఆదినారాయణ  తదితరులు  ఈ సమీక్షలో పాల్గొనగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గిరిజన సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఆ క్రమంలో గిరిజనుల ఉన్నతికి ఉపకరించేలా కార్యక్రమాల రూపకల్పన జరగాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలపై వారికి పూర్తి అవగాహరన ఏర్పడేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన ప్రచార సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

 గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రవీంద్రబాబు మాట్లాడుతూ కనీసం  ఐదు వేల మంది గిరిజనులకు కార్యక్రమంలో భాగంగా సమీకరిస్తున్నమని వివరించగా, గరిష్ట సంఖ్యలో గిరిజనులు తరలివచ్చి ఆదివాసీ దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని మీనా స్ఫష్టం చేసారు. గిరిజన సంక్షేమ శాఖ లోని వివిధ పధకాల ద్వారా దాదాపు రూ.100 కోట్ల విలువైన ఉపకరణాలు, చెక్కుల పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఐఐటిలలో శిక్షణ పొందుతున్న గిరిజన విద్యార్ధులు ఏడుగురికి కార్యక్రమంలో భాగంగా ల్యాప్ టాప్ లు అందించాలని మీనా అధికారులను ఆదేశించారు.

పదోతరగతిలో పదికి పది జిపిఎ సాధించిన గిరిజన విద్యార్ధులతో పాటు, 2019 మార్చిలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించిన వారికి రూ.5,000 చొప్పున క్యాష్ అవార్డు అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రూ.43 కోట్ల విలువైన 27 పనులకు కూడా ఆదివాశీ దినోత్సవం రోజున ప్రారంభోత్సవాలు చేయనున్నామని , అదే క్రమంలో రూ.35 కోట్ల విలువైన పనులకు శంఖుస్ధాపనలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇ ఎన్ సి శేషుబాబు సమావేశంలో వివరించారు.

గిరిజన విద్యార్ధులకు పలువురు ఐఐటిలలో సీట్లు సాధిస్తూ విద్యాపరమైన ఎదుగుదలను సాధిస్తుండగా, అందుకు కారణమైన గిరిజన విద్యాసంస్ధల ప్రిన్సిపాల్స్ ను ఉచిత రీతిన సత్కరించాలన్న గురుకుల విద్యాలయాల కార్యదర్శి భాను ప్రసాద్ ప్రతిపాదనకు మీనా సానుకూలంగా స్పందిస్తూ తగిన ఏర్పాట్లు చేయాలని ఆధేశించారు.  ప్రభుత్వం గిరిజనుల కోసం ఏమి చేస్తుందన్న విషయాన్ని వారికి చేర్చే క్రమంలో ఆదివాసీ దినోత్సవాన్ని వేదికగా చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఐటిడిఎల నుండి పెద్ద ఎత్తున కళాజాతాలను కార్యక్రమానికి రప్పించి గిరిజన సాంప్రదాయాలను ప్రతిబింభింపచేసే కార్యక్రమాలను నిర్వహించాలని మీనా ఆదేశించారు.

More Press News