ఈ రోజు ఒక్క సీటు రేపు అసెంబ్లీ మొత్తాన్ని ఆక్ర‌మించేస్తుంది: పవన్ కల్యాణ్

  • నన్ను ప్రాణప్రదంగా చూసే ఒక్క జ‌న‌సైనికుడు ఉన్నా పార్టీ న‌డుపుతా
  • జ‌న‌సేన ఉనికిని చాటేందుకే ఒంట‌రి పోరాటం
  • ఓట‌మి త‌ర్వాత పీఆర్పీ మాదిరే ప్రలోభ‌పెట్టాల‌ని చూశారు
  • అలాంటి ఆలోచ‌న‌లు ఉన్న ఎవ‌రైనా వెళ్లిపోవచ్చు
  • క‌మిట్‌మెంట్ ఉన్న కార్యక‌ర్తలు ఉన్నారు... అనుసంధానం చేసే నాయ‌కులు లేరు
  • నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జులు కార్యక‌ర్తల‌కు చేరువ‌గా వెళ్లండి
  • న‌ర‌సాపురం, ఉండి, తాడేప‌ల్లిగూడెం కార్యక‌ర్తల స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్

నన్ను ప్రాణప్రదంగా చూసే ఒక్క జ‌న‌సైనికుడు ప‌క్క‌న ఉన్నా పార్టీని న‌డుపుతాన‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. నేడు ఒకే ఒక్క ఎమ్మెల్యే.. అది ఏదో ఒక రోజు వామ‌నుడు ఎదిగిన చందంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్థానాల‌న్నింటికీ ఆక్ర‌మించేలా చేస్తుంద‌న్నారు. భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సోమ‌వారం ఉండి రోడ్డులోని కోట్ల ఫంక్ష‌న్ హాల్లో న‌ర‌సాపురం, ఉండి, తాడేప‌ల్లిగూడెం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. “జ‌న‌సేన పార్టీ ఓట‌మి అనంత‌రం- పీఆర్పీకి ఎలాంటి ప‌రిస్థితులు సృష్టించారో నా వ‌ద్ద అలాంటి ప్రస్తావ‌న‌లే మొద‌లుపెట్టారు.

చిరంజీవిగారి మెత్త‌ద‌నం వ‌ల్ల వెంట‌నే చేశారు. నా ద‌గ్గ‌ర నెల రోజుల త‌ర్వాత అలాంటి ప్ర‌స్తావ‌న తెచ్చారు. ప్రజారాజ్యం విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ చేయం. జనసేన మీద నాయకులకు నమ్మకం లేకపోతే వెళ్లిపోవచ్చు. దయచేసి నన్ను ప్రలోభపెట్టాలని చూడకండి. పోతే ప్రాణాలు పోగొట్టుకుంటాం గానీ ఒక‌సారి జ‌రిగిన పొర‌పాటు రెండోసారి చేయం. ఎవ‌రో వ‌చ్చి ఏదో చేస్తార‌ని ఆలోచిస్తూ కూర్చోను. అవ‌స‌రం అయితే నేను ఒక్క‌డినే నిల‌బ‌డ‌గ‌ల‌ను. ఆ ధైర్యం, స‌త్తా నాకు ఉన్నాయి. చాలా మంది మీకు క్షేత్ర స్థాయిలో అవ‌గాహ‌న లేదు అంటున్నారు. ప్ర‌జ‌ల క‌ష్టాల మీద అవ‌గాహ‌న‌, బాధ లేకుంటే పార్టీ పెట్ట‌గ‌ల‌నా? నా కోసం అయితే ఏదో ఒక పార్టీలోకి వెళ్లిపోగ‌ల‌ను. అసెంబ్లీలో ప్ర‌జ‌ల త‌ర‌ఫున బ‌ల‌మైన పోరాటం చేసే వ్య‌క్తులు,స‌మ‌స్య‌ల‌పై ఎదురొడ్డి పోరాడే వ్య‌క్తులు కావాలి అన్న స‌దుద్దేశంతోనే జ‌న‌సేన పార్టీ స్థాపించాను.

 2014లో న‌న్ను అర్ధం చేసుకున్న నాయ‌కులు అయిదుగురు నాకు తోడుగా ఉంటే ఈ పాటికి జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వాన్ని స్థాపించి ఉండేది. న‌న్ను  మీరు అర్ధం చేసుకున్న‌ట్టు నాయ‌కులు అర్ధం చేసుకుని ఉంటే క‌నీసం అసెంబ్లీలో బ‌ల‌మైన స్థానంలో ఉండేవాళ్లం. జ‌న‌సేన పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనుకాడ‌నటువంటి క‌మిట్‌మెంట్ ఉన్న కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. వారిని అనుసంధానం చేసే నాయ‌కులు ఉంటే పార్టీ ప‌రిస్థితి వేరుగా ఉండేది. నియోజ‌క‌వ‌ర్గ ఇన్ చార్జీలుగా బాధ్య‌త‌లు తీసుకున్న నాయ‌కులంతా కార్య‌క‌ర్త‌ల‌కు మ‌రింత చేరువ‌గా వెళ్లాల‌ని సూచించారు.

కొప్పినీడి ముర‌ళీకృష్ణ లాంటి బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌ల‌ను నా ద‌గ్గ‌ర‌కు తీసుర‌మ్మ‌ని నాయ‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నా. అంద‌రితో నేను వ్య‌క్తిగ‌తంగా క‌లుస్తాను. చిన్న ముద్ద పెడితే కంఠం కోసిచ్చేసే అంత‌టి కృతజ్ఞత నాకు ఉంటుంది. కార్య‌క‌ర్త‌ల‌కు నా మీద అలాంటి అభిమాన‌మే ఉంటుంది. మ‌న‌కు ఉన్న ఆ అభిమానాన్ని దేశ‌, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగిద్దాం. నేను స్వ‌ప్ర‌యోజ‌నాలు కోరుకుంటే 2014లో బీజేపీతోనో,టీడీపీతోనే క‌ల‌సి వెళ్లిపోయేవాడిని, మ‌న ఉనికిని చాట‌డానికే ఒంట‌రి పోరాటం చేశాం. ఓట‌మిని నేను ఎంతో బ‌లంగా స్వీక‌రించ‌గ‌ల‌ను. రేపు గెలిచి మ‌రింత బ‌ల‌మైన అడుగులు వేయ‌బోతున్నాం.

ఓటమి నన్ను ఆపలేదు

ఫలితాలు వ‌చ్చిన త‌ర్వాత అదే త‌ల‌చుకుని బాధ ప‌డుతూ కూర్చోను. నేను ఈ క్ష‌ణం, భ‌విష్య‌త్తుల గురించి మాత్ర‌మే ఆలోచిస్తాను. గ‌తాన్ని త‌ల‌చుకుని బాధ‌ప‌డ‌డం నాకు చేత‌కాదు. ఓట‌మి న‌న్ను ఆప‌లేదు. జ‌న‌సేన పార్టీ గెల‌వ‌క‌పోయినా పోటీ చేసిన స్థానాల్లో ఎంత బ‌లంగా ఓట్లు వ‌చ్చాయంటే, ఆఖ‌రిశ్వాస వ‌ర‌కు పార్టీని న‌డిపించాల‌న్న నిర్ణ‌యానికి నేను వ‌చ్చేలా చేశాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన స‌రాస‌రి ఓట్లు 6 శాతం. అది 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు స‌రాస‌రి. మ‌నం పోటీ చేసిన స్థానాల వ‌ర‌కు మాత్ర‌మే చూస్తే అది 8-9 శాతం. న‌ర‌సాపురం లాంటి బ‌ల‌మైన పార్ల‌మెంట్ స్థానాల్లో అయితే  25 నుంచి 30 శాతం ఓట్లు వ‌చ్చాయి.

ఈ ఓట్లు చాలు జ‌న‌సేన పార్టీకి ప్ర‌జ‌లు ఎంత బ‌లంగా నిల‌బ‌డ్డారో చెప్ప‌డానికి. దీన్ని నిల‌బెట్టుకుంటాం, క్షేత్ర స్థాయి నుంచి వెళ్దాం. ధైర్యం ఉన్న చోటుకి అన్నీ వ‌చ్చి చేరుతాయి. ఉండి నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే అలయెన్స్‌లో సిపిఎంకి ఇచ్చాం. అక్క‌డ 25 వేల మంది ఓటు వేశారు. పొత్తుకి గౌర‌వం ఇవ్వ‌డం విజ‌యం కాదా.? ఇది విజ‌యోత్స‌వ స‌మావేశం కాదు. ప‌రాజ‌యం తర్వాత పెట్టుకున్న మీటింగ్‌. ఓట‌మి చాలా క‌ష్టంగా ఉంటుంది. నేను మాత్రం ఓట‌మి భారాన్ని ఎలా ఎదుర్కోవాల‌న్న అంశాన్నే చిన్న‌నాటి నుంచి నేర్చుకున్నా. ఓట‌మి భారాన్ని మోయ‌గ‌లిగిన‌ప్పుడే విజ‌యం వ‌చ్చి ప‌క్క‌న చేరుతుంది. ధైర్య‌లక్ష్మి ఉన్న చోటే మిగిలిన లక్ష్ములు అందరూ వస్తారు.  ధైర్యం కోల్పోతే అన్నీ వెళ్లిపోతాయి. జ‌న‌సేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ ధైర్య‌మే అండ‌గా ఉంది. ఏదో ఒక రోజు అది విజ‌య‌ల‌క్ష్మిని మ‌న వ‌ద్ద‌కు తీసుకువ‌స్తుంది” అన్నారు.

పార్టీ కోసం ప్రతి ఒక్కరూ గంట స‌మ‌యం కేటాయించండి: మనోహర్

జనసేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ మాట్లాడుతూ.. “ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన 30 రోజుల‌కే మీటింగ్ పెట్టి భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక రూపొందించిన నాయ‌కుడు దేశ చ‌రిత్ర‌లో ఒక్క ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఒక్క‌రే. ఆయ‌న ఆలోచ‌నా విధానం మ‌మ్మ‌ల్ని ఆక‌ట్టుకుంది. ఇది ఒక మైలు రాయిగా భావించండి. నిండు మ‌న‌స్సుతో రెట్టించిన ఉత్సాహంతో గ్రామాల్లో సైతం రోడ్ల మీద‌కి వ‌చ్చి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి ఆహ్వానం ప‌లికిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు.  మీ ఎన‌ర్జీని త‌గ్గించుకోవద్దు. ప్ర‌తి రోజు పార్టీ కోసం ఒక గంటసేపు ప‌ని చేయండి. కొత్త వారిని పార్టీలోకి తీసుకురండి. ఆ బాధ్య‌త అంద‌రి మీద ఉంది. ఇన్‌ఛార్జ్ అంటే పద‌వి కాదు. ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను బ‌య‌ట‌కు తీసుకురావాల్సిన బాధ్య‌త మ‌న మీద ఉంది.

అలాంటి ప‌నులు చేసిన‌ప్పుడే మీ మీద‌, పార్టీ మీద ప్ర‌జ‌ల‌కి గౌర‌వం పెరుగుతుంది. ఏ కార్య‌క్ర‌మం చేసినా అది ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉండాలి. చాలామందికి తెలియ‌ని విష‌యాలు మీకు తోచిన విధంగా అంద‌రికీ తెలియ చేయండి. ఎవ‌రూ ఆత్మ‌స్థైర్యాన్ని కోల్పోవ‌ద్దు. భ‌విష్య‌త్తులో భీమ‌వ‌రంలో విజ‌యోత్స‌వాలు జ‌రుపుకోవాలి. న‌ర‌సాపురం పార్ల‌మెంట్ స్థానాన్ని కైవ‌సం చేసుకునేలా ప్ర‌తి ఒక్క‌రూ క‌ష్ట‌ప‌డాలి” అని కోరారు.

విజయం అంటే ధైర్యం.. అది మన దగ్గర ఉంది: పి.రామ్మోహన్ రావు

జ‌న‌సేన పోలిట్ బ్యూరో స‌భ్యులు పి.రామ్మోహ‌న్‌రావు మాట్లాడుతూ.. “జ‌న‌సేన పార్టీ ఓట‌మి నిజం కాదు. ఓట‌మి అంటే పారిపోవ‌డం. అలాంటి అపోహ ఎవ‌రిలో ఉన్నా ఈ క్ష‌ణ‌మే మ‌ర‌చిపోండి. ఓట‌మి అంటే పిరికిత‌నం. విజ‌యం అంటే ధైర్యం. అదే ధైర్యం మ‌న‌ద‌గ్గ‌ర ఉంది. ప్ర‌స్తుతం పార్టీని గ్రామ స్థాయి నుంచి ప‌టిష్ట‌ పరచటం  అవ‌స‌రం. మ‌న‌కి అవ‌స‌రం అయిన అంశాలు క్ర‌మ‌శిక్ష‌ణ‌, కార్యాచ‌ర‌ణ‌. ఈ అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేప‌డితే జ‌న‌సేన ఎవ‌రూ ఎదుర్కోలేని శ‌క్తి అవుతుంది” అని చెప్పారు. ఈ స‌మావేశంలో పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యులు బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేష్‌, క‌న‌క‌రాజు సూరి, మ‌నుక్రాంత్‌రెడ్డి, న‌ర‌సాపురం పార్ల‌మెంట్ ఇన్‌ఛార్జ్ చేగొండి సూర్యప్ర‌కాష్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More Press News