కోవిడ్ అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ అంబులెన్సులు, కోవిడ్ సంచార పరీక్ష వాహనాలను ప్రారంభించారు.

మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి మేరకు గత సంవత్సరంలో HUDCO సంస్థకు లేఖ రాశారు. స్పందించిన ఆయా సంస్థ రూ.60.69 లక్షల విలువ గల అడ్వాన్స్డ్ అంబులెన్స్ లు మంజూరు చేసింది. అనివార్య కారణాల వల్ల నేడు ఎదుర్కొంటున్న కోవిడ్ కు ఆయా అంబులెన్స్ లను వినియోగించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

హోసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (HUDCO) సమకూర్చిన పూర్తి అధునాతన 2 అంబులెన్సులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి (1), భద్రాచలం ఏరియా ఆసుపత్రికి(1) అంబులెన్స్ లు, రాష్ట్ర ప్రభుత్వం నుండి అంబులెన్స్(1) ఆర్టీసీ నుండి సంచార కోవిడ్ టెస్ట్ వాహనం(1) లను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వెంటిలేటర్ లను ప్రారంభించారు. ఆయా పరిస్థితులను పరిశీలించారు. కోవిడ్ పాజిటివ్ వస్తే ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా చికిత్సను అందజేస్తామని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అదనపు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, DM&HO, RTC RM కృష్ణ మూర్తి, DM శ్రీహర్ష, వైద్యులు, నాయకులు ఉన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి: పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలన్న ఉద్దేశ్యంతో పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం అందజేస్తుందనీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ.5.03కోట్లతో 80 డబుల్ బెడ్ రూం ఇళ్ళు, దుబ్బతండా గ్రామంలో రూ.2.26 కోట్లతో 45 డబుల్ బెడ్ రూం ఇళ్ళు, రామచంద్రపురం గ్రామంలో రూ.3.27 కోట్లతో 65 డబూల్ బెడ్ రూం ఇళ్ళు, ఎలకలవొడ్డు గ్రామంలో రూ.1.76కోట్లుతో 35 డబుల్ బెడ్ రూం ఇళ్ళు మొత్తం రూ. 12.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 225 ఇళ్ళును వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేపించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని.. అందుకే భారీ వ్యయంతో కూడుకున్నప్పటికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంకు శ్రీకారం చుట్టారని అన్నారు.

పేదలకు కేటాయించిన ఇండ్లు ఒక్కొక్కటి 15 లక్షల విలువైనవి తెలిపారు. ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా చేపట్టామన్నారు. ప్రజల సమక్షంలో నిజమైన నిరుపేదలను లబ్దిదారులుగా ఎంపిక చేశామని మంత్రి చెప్పారు. ఎస్సీలు, బిసిలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు ఇండ్లు కేటాయించామన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 500కు పైగా రెండు పడక గదుల ఇండ్లను నిరుపేదలకు అందజేశామన్నారు. కేటాయింపులో నిరుపేదలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గృహ ప్రవేశాలు చేయించామన్నారు.

అధిక వ్యయం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించిందని, వాటిని సద్వినియోగం చేసుకుని పేద ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలన్నారు.

తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆత్మగౌరవంతో బ్రతకాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సమిష్టి కృషి వల్లే నేడు పేదలకు ఇళ్ళు కేటాయించుకోగలిగామని పేర్కొన్నారు.

కోవిడ్ అనివార్య పరిస్థితుల వల్ల ఇళ్లను అందజేయడం కొంత ఆలస్యం అయినప్పటికీ, డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

లబ్ధిదారులతో కలిసి ఇండ్ల ప్రవేశం చేయడం, పాలు పొంగించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. నిర్మాణాలు పూర్తి అయిన వాటికి లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తామని, నిర్మాణంలో ఉన్న మిగతా గ్రామాల్లో ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభిస్తామన్నారు. సీఎం కేసిఆర్ లక్ష్యాలకు అనుగుణంగా లబ్దిదరులకు అందజేస్తామన్నారు.

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలు కూడా పని చేసే ప్రభుత్వాలకు అండగా నిలవాలని కోరారు. కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. రైతులు పండించిన ధాన్యంను పూర్తిగా కొనుగోలు చేసి రైతులకు వారి ఖాతాలో నగదును జమ చేశామన్నారు.

రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలకు అన్ని అందుబాటులో ఉంచామని, వ్యవసాయం కోసం విత్తనాలు, ఎరువులు, సాగునీరు ఉంచామన్నారు. సంక్షేమ పథకాలు ఆగకుండా నిధులు విడుదల చేస్తూ గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఇది మన సమస్య మాత్రమే కాదని ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యగా వివరించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం, మాస్కులు, శ్యానిటైజర్లు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

More Press News