దసరా దీపావళిలోగా డబుల్ బెడ్ రూం ఇండ్లు: మంత్రి ఎర్రబెల్లి
- ఉపాధి హామీ కింద అంతర్గత రోడ్లు, మిషన్ భగీరథతో మంచినీరు
- బ్లాక్ లిస్టుల్లోకి అలసత్వం వహించే కాంట్రాక్టర్లు
- త్వరితగతిన రైతు వేదికలు, కల్లాలు, ప్రకృతి వనాలు, సిసి రోడ్లు
- వర్షాలు, వరద నష్టాల అంచనాలు వేయండి
- కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవాలి
- మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలి
- పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఒక్కో మండలంలోని గ్రామాల వారీగా మంజూరైన ఇండ్లు, వాటి నిర్మాణ స్థాయిలను సమీక్షించారు. అయితే మరోవారం పది రోజుల్లో కొన్ని ఇండ్లు, దసరా లోగా మరికొన్ని, దీపావళికల్లా పూర్తిగా అన్ని ఇండ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా, అలసత్వం వహిస్తే వెంటనే వారి కాంట్రాక్ట్ ను నిలిపివేయడమేగాక, వారికి బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. అలాగే, బ్లాక్ లిస్టులో పెట్టిన విషయాన్ని మిగతా అన్ని శాఖలకు పంపాలని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్ల వెంట పడి పని చేయించాలని సూచించారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు నిధుల కొరత లేదని, సమస్యలేమైనా ఉంటే, తనకు వెంటనే తెలపాలని చెప్పారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇండ్లకు అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలకు ఉపాధి హామీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. మంచినీటికి మిషన్ భగీరథ పథకం కింద అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. విద్యుత్ సదుపాయానికి సంబంధించిన విషయాన్ని కలెక్టర్ కి మంత్రి అప్పగించారు.
కాగా, రైతు వేదికలు, కల్లాలు, ప్రకృతి వనాలు, సిసి రోడ్లు, పిఎంజిఎస్‌వై రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు వంటి అనేక అంశాల మీద మంత్రి ఎర్రబెల్లి సమీక్షించారు. సాధ్యమైనంత వేగంగా కల్లాలు, రైతు వేదికలు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి మాత్రమే కాకుండా, ప్రతి శివారు గ్రామాల్లోనూ ప్రకృతి వనాలు నిర్మించాలని, ఎకరా స్థలాన్ని గుర్తించి, వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాలు, తెగిన రోడ్లు, చెరువులు, ఇతరత్రా ఏమైనా ఉంటే వాటి అంచనాలు పూర్తి చేసి పంపాలని మంత్రి సూచించారు. కాగా, కరోనా విస్తృతి పెరుగుతున్నదని, గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో 20శాతం వరకు కరోనా పాజిటివ్ వస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రజలు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఐసోలేషన్ కిట్లు కరోనా బాధితులకు అందచేస్తున్నామని తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించి, సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు.