రైతులు, బాధితులు ఆందోళన చెందొద్దు: మంత్రి ఎర్రబెల్లి
- పంటల నష్టాల పాలైన రైతులను ఆదుకుంటాం
- పంట నష్టాల అంచనాల తర్వాత ఆర్థిక సాయం
- వరంగల్ రూరల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. పంట నష్టాలను స్వయంగా చూశారు. రైతాంగంతో మాట్లాడారు. వదర బాధితులను పరామర్శించారు. గండ్లు పడిన చెరువులకు మరమ్మతులను దగ్గరుండి చేయించారు. వర్దన్నపేట మండలంలోని ఉప్పరపల్లి చెరువు కు గండి పడగా, మంత్రి దగ్గరుండి గండి పూడ్చివేయించారు. అక్కడి ప్రజలు, అధికారులను అప్రమత్తం చేశారు. ఆ చెరువు కింది నాలుగు గ్రామాల ప్రజలను సైతం అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళే విధంగా చూశారు.
అనంతరం మంత్రి ఖానాపూర్, నాచనపల్లి, కల్నేపల్లి చెరువులున పరిశీలించారు. అలాగే, ఖానాపూర్ బ్రిడ్జీని చూశారు. మిగతా గ్రామాల్లో రైతులతో మాట్లాడారు. వారి పంట నష్టాలను స్వయంగా పరిశీలించారు. వర్దన్నపేట, నర్సంపేటల ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డిలతో పాటు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, రైతులు ఆందోళన చెందొద్దు, ఈ వర్షాల కారణంగా వందల, వేల ఎకరాల్లో పత్తి, వరి, పల్లి వంటి పంటలకు నష్టం వాటిల్లింది. వాటి అంచనాలు వేయమని అధికారులను ఆదేశించాం. ఆ అంచనాలు రాగానే, స్వయంగా సీఎం కెసిఆర్ గారు, మంత్రి కెటిఆర్ గార్లతో మాట్లాడి, అవసరమైన మేర సాయం అందేలా చూస్తాం. రైతాంగాన్ని అదుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు ఈ వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయిన, కూలిపోయిన వాళ్ళను కూడా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. వరద ముంపు ఇతర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలే విధంగా చూడాలని, అధికారులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం చెరువులపై నిఘా పెట్టాలని, ప్రమాదపు హెచ్చరికలను గమనిస్తూ, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చేపలు పట్టేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు, వంకలు, చెరువుల్లోకి వెళ్ళొద్దన్నారు. ప్రమాదాల బారిన పడొద్దని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. తెగిన రోడ్లు, చెరువుల మరమ్మతులను సత్వరమే జరిగే విధంగా నష్టాల అంచనాలతో అధికారులు సిద్ధం కావాలన్నారు. కూలిన ఇండ్ల బాధితులను కూడా ఆదుకుంటామన్నారు.