దసరా నాటికి హైదరాబాద్ జిల్లా పరిధిలో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభిస్తాం: మంత్రి తలసాని

హైదరాబాద్: పేదల సొంత ఇంటి కల నేరవేరనున్నాదని, హైదరాబాద్ జిల్లా పరిధిలోని 21 ప్రాంతాలలో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దసరా నాటికి ప్రారంభించి లబ్దిదారులకు కానుకగా ఇవ్వనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోం మంత్రి మహమూద్ అలీ సమక్షంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ జిల్లాలో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ శ్వేతా మహంతి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, RDO శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ CE సురేష్, SE కిషన్, వాటర్ వర్క్స్ DOP కృష్ణ, పలువురు తహసిల్దార్ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి రూపకల్పన చేశారని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాలతో పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు చెప్పారు.

అందులో భాగంగా జిల్లాలోని 35ప్రాంతాలలో 812 కోట్ల రూపాయల ఖర్చుతో 7,455 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి ఎన్ని కోట్ల నిదులైన ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఇప్పటికే జియాగూడలో 840, కట్టెల మండి లో 112, గోడే ఖీ ఖబర్ లో 182 ఇండ్లు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని మంత్రి వివరించారు. దసరా నాటికి 21 ప్రాంతాలలోని 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల  నిర్మాణ పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హౌసింగ్, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, రెవెన్యూ, ghmc తదితర శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యవహరించి పని చేయాలని మంత్రి చెప్పారు.

అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. దసరా నాటికి లక్ష్యం మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేందుకు జోనల్ కమిషనర్ ల ఆధ్వర్యంలో ఎలెక్ట్రికల్, వాటర్ వర్క్స్, హార్టికల్చర్, హౌసింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులతో  పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ghmc కమిషనర్ లోకేష్ కుమార్ ను మంత్రి ఆదేశించారు.

వివిధ కారణాలతో 9 ప్రాంతాలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని, అందుకు ఉన్న అడ్డంకులను అధిగమించి ఆయా ప్రాంతాలలో కూడా ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ghmc పరిధిలో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు.

హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ బస్తీలలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పేదల సొంత ఇంటి కలను తీర్చాలనేది ముఖ్యమంత్రి  ఉద్దేశమని అన్నారు. రోడ్లు, డ్రైనేజి, త్రాగునీరు తదితర అన్ని రకాల సౌకర్యాలతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

More Press News