ఆకాశమార్గంలో వచ్చిన ఊపిరితిత్తులు.. కొవిడ్ కష్టకాలంలోనూ ప్రాణాలు కాపాడిన వైద్యులు

  1. రోగికి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య
  2. జీవన్ దాన్ నేతృత్వంలో పుణె నుంచి ఊపిరితిత్తులు
  3. వేగవంతమైన రవాణా కోసం రెండు నగరాల్లో గ్రీన్ కారిడార్ల ఏర్పాటు
హైదరాబాద్, ఆగస్టు 16, 2020: కరోనా కష్టకాలంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందాలన్నా చాలా ఇబ్బంది అవుతోంది. కానీ సంకల్పం గట్టిదైతే.. ఊపిరితిత్తుల మార్పిడి లాంటి అత్యంత సంక్లిష్టమైన చికిత్సలు కూడా అత్యంత సులభంగా జరిగిపోతాయి. తెలంగాణ జీవన్ దాన్ ఫౌండేషన్ నేతృత్వంలో, పుణె నగరంలోని జోనల్ ట్రాన్స్ పోర్టేషన్ కోఆర్డినేషన్ కమిటీ (జడ్.టి.సి.సి.) సహకారంతో ఇదంతా సాకారమైంది. హైదరాబాద్ నగరంలోని కిమ్స్ హార్ట్ అండ్ అంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్న ఒక రోగికి పుణె నుంచి ఊపిరితిత్తులు తెప్పించారు.

పుణె నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తక్కువ వయసున్న ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఒకవ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో తీవ్రంగా బాధపడుతూ, జీవన్ దాన్ ఫౌండేషన్ లో అవయవ మార్పిడి కోసం తన పేరు నమోదు చేయించుకున్నారు. పుణెలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి బంధువులు నలుగురి ప్రాణాలు కాపాడేందుకు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం ఉంది. చాలామంది తమ మరణానంతరం అవయవాలను దానం చేద్దామనుకుంటారు. కానీ, ప్రస్తుత సమయంలో ఎవరైనా కరోనాతో గానీ, మరికొన్ని ఇతర సమస్యలతో గానీ మరణిస్తే వాళ్లు తమ అవయవాలను దానం చేయడానికి వీలుండదు. కానీ పుణెలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి కరోనా నెగెటివ్ రావడంతో అవయవదానానికి మార్గం సుగమమైంది. తెలంగాణ జీవన్ దాన్ ఫౌండేషన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత దీనికి సహకరించి, మార్గదర్శకత్వం వహించారు. దాంతోపాటు.. పుణెలోని జడ్.టి.సి.సి. సంస్థ సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీమతి ఆర్తీ గోఖలే సహకారంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా ఊపిరితిత్తులను హైదరాబాద్ కు తీసుకురాగలిగారు.


పుణె నుంచి తీసుకురావడానికి ఒక చార్టర్డ్ విమానాన్ని ఉపయోగించారు. రెండు నగరాల్లో గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేయడం ద్వారా ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా చూశారు. ఇరు నగరాల ట్రాఫిక్ పోలీసులు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా ఈ విషయంలో ఎంతగానో సహకరించారు. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రానికి ఎక్కడో 560 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణె నుంచి ఊపిరితిత్తులు కిమ్స్ హార్ట్ అండ్ అంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్‌కు గంటలో చేరుకున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య నిపుణులు.. దాన్ని రోగికి అమర్చి అతడికి ప్రాణదానం చేశారు.


More Press News