బక్రీద్ పండుగ పై జిహెచ్ఎంసి అధికారులతో సమీక్షించిన హోంమంత్రి
హైదరాబాద్: ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న బక్రీద్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం నాడు జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సంబంధిత ఏర్పాట్లను సమీక్షించారు. జిహెచ్ఎంసి కమిషనర్ డి .ఎస్. లోకేష్ కుమార్ తో పాటు జోనల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ రానున్న బక్రీదు పండుగ ప్రత్యేక పరిస్థితుల మధ్య జరగనుందని తెలిపారు. కరోనా వైరస్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ముస్లిం సోదరులు ప్రత్యేక శ్రద్ధ వహించి పండగ జరుపుకోవాలని సూచించారు.ప్రార్థనలు ఇంటిలోనే చేయాలని అక్కడ కూడా భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్ లను ధరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని అన్నారు. పండగ సందర్భంగా బలి ఇచ్చే జంతువుల వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు జిహెచ్ఎంసి అధికారులు ఏర్పాటు చేశారని తెలియజేశారు. వీటికోసం ప్రత్యేక వాహనాలను అదనపు సిబ్బందిని నియమించామని జిహెచ్ఎంసి అధికారులు హోం మంత్రికి తెలిపారు. వర్షాలు అధికంగా కురుస్తున్న ప్రస్తుత తరుణంలో వ్యర్ధాలను తొలగించే ప్రక్రియలో జిహెచ్ఎంసి సిబ్బంది కి ముస్లిం సోదరులు సహకరించాలని అధికారులు అన్నారు. జిహెచ్ఎంసి జోనల్ అధికారులైన రవి కిరణ్, మమత ,శ్రీనివాస్ రెడ్డి ,ఉపేందర్ రెడ్డి లతోపాటు డిప్యూటీ కమిషనర్ జి.రజనీకాంత్ రెడ్డి తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.