రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

సనత్ నగర్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో 68.30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 10.00 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేస్తారు. ఈ RUB నిర్మాణంతో గత 30 సంవత్సరాలుగా సనత్ నగర్ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారం కానున్నది. ప్రస్తుతం సనత్ నగర్ ప్రాంత ప్రజలు నర్సాపూర్ చౌరస్తా, జీడిమెట్ల కు వెళ్ళాలన్నా, జీడిమెట్ల నుండి సనత నగర్ వైపుకు రావాలన్నా పతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా సుమారు 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ RUB నిర్మాణంతో కేవలం 1.8 కిలోమీటర్ల ప్రయాణించి తమ గమ్య స్థానాలకు చేరుకోవచ్చు. దూరాభారం తగ్గడమే కాకుండా పతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ట్రాఫిక్ రద్దీ కూడా భారీగా తగ్గనుంది. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు RUB నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వస్తున్నారు. స్థానిక ప్రజల ద్వారా సమస్య ను తెలుసుకున్న పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మే 15 వ తేదీన మేయర్ బొంతు రాంమోహన్, HRD, రైల్వే అధికారులతో కలిసి RUB ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. RUB నిర్మాణ ప్రాధాన్యతను మంత్రి శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకెళ్ళి వివరించగా నిర్మాణానికి ఆమోదం తెలిపి నేడు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. RUB నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే HRD అధికారులు రైల్వే అధికారులకు రైల్వే శాఖ పనుల నిమిత్తం 89.70 లక్షల రూపాయలను చెల్లించారు.

పతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి విస్తరణ

ప్రస్తుతం 2 లైన్ లుగా ఉన్న పతేనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ని సుమారు 400 మీటర్లు మేర 45.04 కోట్ల రూపాయల ఖర్చుతో 4 లైన్ లుగా విస్తరించే నిర్మాణ పనులను కూడా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభిస్తారు. ఇందులో 36 లక్షల రూపాయలను HRD అధికారులు రైల్వే అధికారులకు రైల్వే శాఖ పనుల నిమిత్తం చెల్లించారు. అప్పటి ట్రాపిక్ రద్దీకి అనుగుణంగా నిర్మించిన పతే నగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రస్తుతం పెరిగిన వాహనాల రద్దీ తో నిరంతరం ట్రాపిక్ స్తంభించి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 2 లైన్ లుగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి విస్తరించి నిర్మించడం వలన సమస్య పరిష్కారం కానుంది. 

More Press News