అన్నదాతలకు ఆన్‌లైన్ వ్యవసాయ కన్సల్టేషన్!
- రైతుగా మారి సందేహాలు అడిగి తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
- అన్నదాతలకు అండగా టీటా చొరవను ప్రశంసించిన వ్యవసాయశాఖ మంత్రి
- విదేశాల్లోని నిపుణులతోనూ రైతులకు అనుసంధానం
గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్య సేవలు అందించేందుకు, ముఖ్యంగా కరోనా సమయంలో ఎదుర్కుంటున్న ఆర్థిక, రవాణ, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు టి.కన్సల్ట్ యాప్‌ను టీటా ప్రవేశపెట్టింది. టి.కన్సల్ట్ ఇప్పటికే 10,000 కన్సల్టేషన్లు అందించింది. తెలంగాణలో అందుతున్న ఈ-డాక్టర్ వైద్య సేవల్లో టి.కన్సల్ట్ యాప్ అగ్రగామిగా ఉంది. ఇప్పటికే హోమియో, ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇలా సేవలు అందించడం వల్ల అనేకమంది గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు జరిగింది. దీనికి కొనసాగింపుగా రైతులకు మేలు చేసేందుకు టి.కన్సల్ట్ విస్తరించాలని టీటా నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయంలోని అన్ని సమస్యలపై సమగ్ర అవగాహన, తాజా పరిస్థితుల యొక్క వివరాలు, సమస్యలకు పరిష్కారాలు పొందేందుకు శాస్త్రవేత్తలను రైతులకు అనుసంధానం చేసేలా టి.కన్సల్ట్ రూపుదిద్దుకుంది. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలతో చర్చలు జరిపింది. టి.కన్సల్ట్ సేవల్లో భాగంగా రైతులు, అగ్రికల్చర్ సైంటిస్టులు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఆన్ లైన్ సేవలను నేడు మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం తొలి రైతుగా వ్యవసాయ శాస్త్రవేత్త జలపతిరావు ద్వారా పలు సలహాలు, సూచనలు పొందారు.
టి.కన్సల్ట్ ద్వారా అందుబాటులోకి వస్తున్న ఈ ఆన్ లైన్ అగ్రి కన్సల్టేషన్ ద్వారా రైతులు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని అగ్రికల్చర్ సైంటిస్టులతో సలహాలు పొందవచ్చు. అగ్రికల్చర్ సైంటిస్టులతో ఈ ప్రక్రియను నిర్వహించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ వారితో చర్చలు జరిపింది. ఈ వీడియో కన్సల్టేషన్ ద్వారా రైతులు వాలంతరీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో అనుసంధానం కావచ్చు. వారి సలహాలు, సూచనలు పొందవచ్చు. ఇతర దేశాల్లో ఉండే వ్యవసాయ నిపుణులతో కూడా రైతులు అనుసంధానం అయ్యేలా చూడటం సైతం టి.కన్సల్ట్ ప్రణాళికలో ఉన్నాయి. టీటా చాప్టర్లకు చెందిన టెక్కీలు అక్కడి నిపుణులను అనుసంధానం చేసి వ్యవసాయంలో ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలు గురించి విపులంగా తెలియజేయనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, సాంకేతిక అక్షరాస్యతలో టీటా అనేక కార్యక్రమాలు నిర్వహించిందని కొనియాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్‌లో టి.కన్సల్ట్ ప్రారంభించడమని, టి.కన్సల్ట్ ద్వారా పదివేల కన్సల్టేషన్లు చేయడాన్ని మంత్రి అభినందించారు. టి.కన్సల్ట్ అగ్రికల్చర్ అప్లికేషన్‌ను వానాకాలంలో రైతాంగం ఉపయోగించుకోవాలని సూచించారు. అగ్రికల్చర్ సైంటిస్టులు, ఎంటమాలజిస్టులు ఈ టి.కన్సల్ట్‌లో ఆన్‌బోర్డ్ అయి రైతులకు సేవలు అందించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల మాట్లాడుతూ టీటా ద్వారా ఇప్పటివరకు విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సేవలు అందించామని, దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం వ్యవసాయానికి సాంకేతికతలను జోడిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నారైల ద్వారా విదేశాల్లోని వ్యవసాయ విధానాలను రైతులకు చేరువ చేస్తున్నామని ప్రశంసించారు. రైతులు టి.కన్సల్ట్ సేవలు వినియోగించుకొని తమ సలహాలు, సూచనలు అందించాలని సందీప్ మక్తాల విజ్ఞప్తి చేశారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్, వ్యవసాయ శాఖ ఓఎస్డీ, టీటా సలహాదారు ఎల్ కే సంగమేశ్వర రావు, టీటా ఉపాధ్యక్షుడు రాణాప్రతాప్ బొజ్జం, శ్రీకాంత్ ఉప్పల తదితరులు పాల్గొన్నారు.