నైపుణ్యాలు పెంచుకోవడమే కీలకం : తెలంగాణ గవర్నర్

  • కేవలం పట్టాలతో లాభం లేదు
  • సరైన నైపుణ్యాలతోనే ఉద్యోగాలు, ఔత్సాహికత
  • కామరాజ్ గొప్ప నాయకుడు
ఈ పోటీ ప్రపంచంలో కేవలం పట్టాలు సంపాదిస్తేనే ఉద్యోగాలు రావని, సరైన నైపుణ్యాలు కలిగి ఉంటేనే సరైన ఉద్యోగాలు, ఔత్సాహికత వస్తాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

భారతదేశం ప్రపంచానికి నైపుణ్యాలున్నమానవవనరులను అందించే దేశంగా అభివృద్ధి చెందుతున్నదని, దీని కోసం నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ మిషన్ ద్వారా మొత్తం 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని గవర్నర్ వివరించారు.

ఈరోజు మధురై కామరాజ్ యూనివర్సిటీ, దేశీయ చింతనై కళగం సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన “కామరాజార్ జన్మదినం, ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ డే, వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్ మెంట్” అన్న అంశంపై గవర్నర్ ఆన్ లైన్ లో ప్రసంగించారు.

స్వామి వివేకానంద అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన ఒక సంఘటనని ఈ సందర్భంగా తమిళిసై వివరించారు.

“స్వామి వివేకానంద పర్యటనలో ఒకసారి లక్ష్యాన్ని ఛేదించలేకపోతున్న షూటర్లను చూసాడు. తాను గురి చూసి లక్ష్యాన్ని కాల్చగలను గన్ ఇస్తారా అని స్వామి వారిని అడిగారు. కాషాయ బట్టలు వేసుకున్న సన్యాసి గన్ తో లక్ష్యాన్ని ఎలా ఛేధిస్తాడు అనివారు హేళన చేస్తూనే గన్ ఇచ్చారు. స్వామి సరైన ఫోకస్ తో గురిచూసి కాల్చి సరిగ్గా లక్ష్యాన్ని ఛేధించాడు. మీకెలా ఇది సాధ్యమైంది అని వారు షాక్ తో అడిగినప్పడు.. నాకు ధ్యానం చేయడం వల్ల ఫోకస్ చేయగల శక్తి వస్తుంది. సరైన ఫోకస్ తో నేను గురిపై దృష్టి నిలపగలిగాను. లక్ష్యాన్ని సరిగ్గా ఛేధించగలిగాను అని స్వామి చెప్పాడు.”

ఈ సంఘటనను గమనిస్తే నిరంతర ధ్యానంతో, యువత ఫోకస్ ను, కాన్సంట్రేషన్ శక్తిని అభివృధ్ధి చేసుకోగలరని, గవర్నర్ సూచించారు.

నైపుణ్యాభివృద్ధి అనేది నిరంతరం కృషి చేయాల్సిన అంశం అని అప్పడే ఈ గ్లోబల్ పోటీలో ముందుకు పోగలమని తమిళిసై వివరించారు.

కామరాజ్ గొప్ప స్ఫూర్తివంతమైన నాయకుడు:  

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి భారతరత్న కామరాజ్ గొప్ప స్ఫూర్తినిచ్చే నాయకుడని గవర్నర్ ఆయన జయంతి సందర్భంగా ఈరోజు కొనియాడారు. అతి సాధారణ జీవనం, నిరాడంబరత్వం, పారదర్శక పాలనతో తమిళనాడుకు, దేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చారని తమిళిసై తెలిపారు.

విద్యార్ధులకు ఉచిత మధ్యాహ్న భోజనం, అందరికీ అందుబాటులో విద్య, బడుగు బలహీన వర్గాల విద్యపై ప్రత్యేక దృష్టి, ఇరిగేషన్, పరిశ్రమల అభివృద్ధితో కామరాజ్ దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.

కామరాజ్ గొప్పదనాన్ని కొనియాడుతూ, ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “తాను దేశ అభివృద్ధి, రక్షణ కోసం చేస్తున్న కృషిని లాల్ బహదూర్ శాస్త్రి, జయప్రకాశ్ నారాయణ్, రాంమనోహర్ లోహియా, కామరాజ్ లాంటి గొప్ప నేతలు బతికుటే హర్షించేవారని” ప్రధాని మోడీ అన్నట్లు గవర్నర్ వివరించారు. అలాంటి స్ఫూర్తివంతమైన నేతల అడుగుజాడల్లో ప్రధానమంత్రి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారని తమిళిసై వివరించారు.

వారి స్ఫూర్తితో విద్యార్ధులు, యువత నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుని తాము ఎంచుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మధురై కామరాజ్ యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ప్రొ. కృష్ణణ్, రిజిస్ట్రార్ డా. వసంత, నేషనల్ థింకర్స్ ఫోరమ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

More Press News