వరంగల్ మహానగర అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
- సిఎం హామీల అమలుపై సమీక్షించిన మంత్రి, ప్రజాప్రతినిధులు
- వరంగల్ మహా నగర అభివృద్ధికి మరిన్ని నిధులు
- సిఎం చేతుల మీదుగా కుడా మాస్టర్ ప్లాన్ విడుదల
- త్వరలోనే కెటిఆర్ పర్యటన
- అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇళ్ళ స్థలాల పట్టాలు
- హృదయ్, స్మార్ట్ సిటీ, జయశంకర్ స్మృతి వనాల పనుల పూర్తి
- నగర ప్రగతి, వరంగల్ రింగ్ రోడ్డు, భూసేకరణ పనులపైనా సమీక్ష
- వరంగల్ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసి, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులైన భద్రకాళి ట్యాంక్ బండ్ సుందరీకరణ, రూ 65 కోట్ల వ్యయంతో చేపట్టిన 11 స్మార్ట్ రోడ్డు పనులు, ప్రధాన ఆహ్వాన ద్వారాలు, 4 స్మార్ట్ రోడ్ పనుల పురోగతిని సమీక్షించి సమర్ధంగా నిర్వహించడానికి వీలుగా మంత్రి పలు సూచనలు చేశారు.
అలాగే, 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 4 నగర ఆహ్వాన ముఖ ద్వారాలలో 3 ద్వారాల పనులు వివిధ నిర్మాణ పురోగతి దశలలో ఉన్నాయని మిగిలిన ఒక ద్వారా టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.
లాక్ డౌన్, ముగిసినందున ఇసుక ఇతర వాటికి అనుమతి ఇచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ఆయా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతేనే మెటీరియల్ భారీగా సమకూర్చుకుని నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు కృషి చేయాలని మంత్రి ఆదేశించారు.
ములుగు రోడ్ జుంక్షన్ నుండి ఎంజిఎం వరకు, ఎంజిఎం జుంక్షన్ నుండి వెంకటరామ థియేటర్ వరకు, వెంకటరామ థియేటర్ నుండి లేబర్ కాలనీ వరకు, వెంకటరామ థియేటర్ నుండి ప్రధాన తపాలా కార్యాలయం వరకు, వరంగల్ రైల్వే స్టేషన్ నుండి రామ్ ఎంక్లేవ్ వరకు, పోచమ్మ మైదానం నుండి వరంగల్ చౌరస్తా వరకు, వరంగల్ చౌరస్తా నుండి ప్రధాన తపాలా కార్యాలయం వరకు, వరంగల్ చౌరస్తా నుండి హంటర్ రోడ్ వరకు, వరంగల్ చౌరస్తా నుండి ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ వరకు, హన్మకొండ బస్ డిపో నుండి అలంకార్ బ్రిడ్జి వరకు, భద్రకాళి దేవాలయం కమాన్ బ్రిడ్జి నుండి రంగంపేట బస్ స్టాప్ వరకు పనుల ప్రగతిని సమీక్షించారు.
*నగర ప్రగతి, వరంగల్ రింగ్ రోడ్డు, భూసేకరణ పనులపైనా సమీక్ష*
నగరం చుట్టూ 70 కి.మీ. అవుటర్ రింగ్ రెడ్డు నిర్మాణానికి గాను జాతీయ పరిధిలోని 29 కి.మీ., రాష్ట్ర పరిధిలో 41 కి.మీ. రోడ్డు పనులు పూర్తికి కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. 41 కి.మీ. రోడ్డు పనుల పూర్తికి వెయ్యి కోట్ల రూపాయల వ్యవయం అవుతుందని అధికారులు అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే, 37 కి.మీ. మేర ఇన్నర్ రింగ్ రోడ్డు పనులను త్వరలో పూర్తి చేయాలని సూచించారు. వరంగల్ మహా నగరంలో టౌన్ షిప్, ఆట స్థలాలు, లాజిస్టిక్ హబ్, వినోద హంగులు, బహుళార్థక సాధక ప్రాజెక్టులు, నర్సరీల అభివృద్ధి కోసం ఇప్పటి 155 ఎకరాల స్థలాన్ని ల్యాండ్ పూలింగ్ చేశారన్నారు. మరికొంత ల్యాండ్ పూలింగ్ చేయడం ద్వారా నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
*హృదయ్, స్మార్ట్ సిటీ, జయశంకర్ స్మృతి వనాల పనుల పూర్తి*
వారసత్వ నగరంగా అభివృద్ధి పరచడానికి వీలైన (హృదయ్-నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్ మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన) 12 నగరాల్లో ఒకటిగా ఎంపికైన వరంగల్ కి రూ.35 కోట్లు మంజూరయ్యాయయని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ, చేపట్టిన భద్రకాళి బండ్, వేయి స్తంభాల గుడి, కాజీపేట దర్గా, పద్మాక్షీ దేవాలయం, జైన విగ్రహం, కాకతీయ శిలా తోరణాల తిరిగి ప్రతిష్టించడం వంటి పలు పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అలాగే, రూ.2,349 కోట్ల వ్యయంతో చేపట్టిన 86 స్మార్ట్ సిటీ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
*సిఎం చేతుల మీదుగా కుడా మాస్టర్ ప్లాన్ విడుదల*
ఇప్పటికే ప్రాథమిక అంచనాలతో పూర్తయి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ తో సమీక్ష కూడా పూర్తి చేసుకున్న కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ ని సిఎం కెసిఆర్ చేతుల మీదుగా విడుదల చేయాలని, త్వరలోనే సీఎంగారి అనుమతితో ఆయన చేతుల మీదుగా విడుదల అయ్యే విధంగా చేయాలని కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు చెప్పారు.
*త్వరలోనే కెటిఆర్ పర్యటన*
అన్ని రకాల అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో, రూ.600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపించాలని ఇప్పటికే నిర్ణయించినందున వాటినని వేగంగా పూర్తి చేయాలని, తర్వలోనే కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు.
*వరంగల్ మహా నగర అభివృద్ధికి మరిన్ని నిధులు*
ఇదిలావుండగా, ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే, మరిన్ని నిధుల అవసరం కూడా ఉన్నదని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారని మంత్రి చెప్పారు. ఆయా పనులకు మరిన్ని నిధులు మంజూరయ్యేలా మంత్రి కెటిఆర్, సిఎం కెసిఆర్ లను కలిసి అభ్యర్థించాలని నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.