తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి భూమిని విరాళంగా ఇచ్చిన సోదరులు!

  • 300 గజాల భూమిని గ్రామానికి రాసి ఇచ్చిన దాతలు
  • పంచాయతీ పేరున రిజిస్ట్రేషన్
హైదరాబాద్, జూన్ 23: గజం జాగా కనిపిస్తే చాలు... గుటకాయ స్వాహా అనే బాపతు జనమే మనకు తరచూ తారస పడుతుంటారు. ప్రభుత్వ భూమి అని తెలిస్తే చాలు..గద్దల్లా వాలిపోయే జనమే తప్ప, అదే గజం జాగాని అదే ప్రభుత్వానికి, ఇతర అవసరాలకు ఇచ్చే మనుషులే కరువై పోతున్నారు. అలాంటిది, పుట్టిన ఊరు, కన్నతల్లి రుణం తీర్చుకోవాలని భావించిన ముగ్గురు సోదరులు, తమ సొంతూరుకి కొంత మేలు చేయాలని భావించారు. వెంటనే ఆచరణ చేపట్టారు.

మా శెట్టి ఉపేందర్, మా శెట్టి కృష్ణ, మా శెట్టి వెంకటేష్ తోబుట్టు వులు. వల్మిడి గ్రామం మా శెట్టి సోమయ్య - కనక మహా లక్ష్మి ల కొడుకులు. ముగ్గురు సోదరులు, హైదరాబాద్ లో స్థిర పడ్డారు. ఉన్నంతలో బాగానే సంపాదించుకున్నారు. మా శెట్టి ఉపేందర్ గతంలో వల్మీడి లోని సీతా రామచంద్ర స్వామి దేవాలయ చైర్మన్ గా పని చేశారు. తాము హైదరాబాద్ లో ఉంటున్న కారణంగా గ్రామంలోని ఇల్లు, తమ తల్లి తండ్రుల అనంతరం శిథిలావస్థకు చేరింది. దీంతో వాళ్ళంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. తమ తల్లితండ్రులు సోమయ్య, కనక మహాలక్ష్మి ల జ్ఞాపకార్థం ఆ ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఆలోచన వచ్చిందే తడవుగా, గ్రామ సర్పంచ్ కత్తి సైదులు ని సంప్రదించారు.

సోమవారం కొడకండ్లకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ పేపర్లని మంగళవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని కలిసి చూపించారు. మంత్రికి విషయం చెప్పారు. అప్పటికప్పుడే వల్మీ డీ గ్రామ సర్పంచ్ కత్తి సైదులునీ పిలిపించారు. మంత్రి సమక్షంలో సంబంధిత రిజిస్ట్రేషన్ పేపర్లని సర్పంచ్ కి అందచేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, వల్మీ డి గ్రామ పంచాయతీలో కార్యాలయ నిర్మాణానికి 300 గజాల స్థలాన్ని వితరణ చేసిన మా శెట్టి సోదరులను అభినందించారు. సొంతూరు కు ఎంతో కొంత చేయాలన్న వారి తపన ఆదర్శనీయం అన్నారు. వారి తల్లితండ్రుల స్మార కార్థం చేసిన భూ విరాళం గ్రామ ప్రజలు మరచి పోలేరన్నారు. మా శెట్టి సోదరులను ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా, గ్రామాల్లో మరింత మంది దాతలు ముందుకు రావాలన్నారు. ఉన్న ఊరు, కన్న తల్లి రుణం తీర్చుకోవాలన్న రు. ప్రభుత్వ పరంగా జరుగుతున్న నిరంతర అభివృద్ధికి చేదోడు కావాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మా శెట్టి సోదరులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా సమయంలో ఉదారతని చాటుకుంటూ, వేలాది మందిని అదుకున్నారని, దాని ముందు తాము చేసిన వితరణ గొప్పదేమి కాదన్నారు. ఇదే సమయంలో వల్మీ డి గ్రామ సర్పంచ్ మా శెట్టి సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు మా శెట్టి సోదరులను వేనోళ్ల కొనియాడుతున్నారు.

More Press News