ఆరవ విడత హరితహారం ఏర్పాట్లపై అన్ని జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్ వీడియో కాన్ఫరెన్స్

  • హరితహారానికి సర్వసన్నద్ధం, యాదాద్రి మోడల్, బతికే మొక్కల శాతం పెంపుపై ప్రధాన దృష్టి
  • సీఎం సూచనలతో 30 కోట్లకు పెరిగిన ఆరవ విడత హరితహారం లక్ష్యం, జిల్లాల వారీ టార్గెట్లు పెంపు
  • పునరుద్దరణపై అటవీ బ్లాకుల వారీగా ప్రణాళికలు, కలెక్టర్ల నేతృత్వంలో అన్ని శాఖల సమన్యయం
  • హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనంపై స్పెషల్ ఫోకస్
హైదరాబాద్: పచ్చదనం పెంపు దిశగా స్పష్టమైన మార్పు కనిపించేలా ఆరవ విడత తెలంగాణకు హరితహారం కొనసాగాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ వెల్లడించారు. ఇటీవల కలెక్టర్లతో సమావేశం సందర్భంగా అన్ని జిల్లాలకు, పట్టణ ప్రాంతాలకు హరితహారంపై ముఖ్యమంత్రి మార్గనిర్ధేశం చేశారని, ఆమేరకు లక్ష్యాలు కూడా పెరిగాయని తెలిపారు. హెచ్ఎండీఏ,  జీహెచ్ఎంసీ, మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటాలనే సీ.ఎం సూచనతో ఆరవ విడత హరితహారం లక్ష్యం 20 కోట్ల నుంచి 30 కోట్లకు పెరిగింది. తాజా లక్ష్యాల ప్రకారం హెచ్ఎండీఏ ఐదు కోట్ల మొక్కలు,  జీహెచ్ఎంసీ రెండున్నర కోట్లు, మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో మరో ఐదు కోట్ల మొక్కలను నాటనున్నారు.  

దీంతో మొక్కల లభ్యత, అటవీ శాఖ తరపున సాంకేతిక సహకారం, మండల, పట్టణ స్థాయిలో ప్రత్యేక సమావేశాలపై పీసీసీఎఫ్ సూచనలు చేశారు. *నాటేవిధానం, తగిన విధంగా రక్షణ గార్డులను ఏర్పాటు చేయటంతోనే మొక్కల మనుగడ వంద శాతం ఆధారపడి ఉంటుందని ఆదిశగా ప్రతీ ఒక్కరిలో అవగాహన కల్పించాలని తెలిపారు*. మిగతా శాఖల సిబ్బందికి కూడా తగిన విధంగా అటవీశాఖ సాంకేతిక విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ ప్రాంతంలో కనీసం ఒక్క ఎకరాలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ (తక్కువ ప్రాంతం ఎక్కువ చిక్కదనంతో మొక్కలు నాటడం ద్వారా చిట్టడవుల సృష్టి) తో పాటు, రక్షణ చర్యలు, బతికే మొక్కల శాతాన్ని పెంచటం, అటవీ పునరుజ్జీవన చర్యలకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.

జిల్లాల వారీగా అటవీ ప్రణాళికలు, రక్షణ చర్యలు, హరితహారం పురోగతి, కొనసాగుతున్న పునరుజ్జీవన పనులతో కూడిన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ప్రోఫైల్ హ్యాండ్ బుక్ ను సిద్దం చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లే నోడల్ అధికారులుగా అటవీ పునరుజ్జీవన చర్యలు ఉంటాయని, అన్ని జిల్లాల అటవీ అధికారులు కలెక్టర్లతో సమావేశమై ఈ వివరాలు వెల్లడించాలని, జిల్లా స్థాయి మీటింగ్ ల్లో అటవీ రక్షణ చర్యలు, ఇబ్బందులపై వివరించాలని తెలిపారు. పోలీసు, రెవెన్యూ శాఖల సమన్యయంతో జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం కచ్చితంగా అమలుకావాలన్నారు. అన్ని జిల్లాల్లో అటవీ బ్లాకుల వారీగా పునరుజ్జీవన చర్యల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యతను ఇస్తోందని, హరితహారంలో భాగంగా ఈ పనులు కొనసాగుతాయని పీసీసీఎఫ్ వెల్లడించారు.

ఈ సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, ఎం.సీ.పర్గెయిన్, చంద్రశేఖర రెడ్డి, సునీతా భగవత్, అన్ని జిల్లాల అటవీ అధికారులు, సర్కిల్ హెడ్స్ పాల్గొన్నారు.

More Press News