కరోనా విపత్కర కాలాన్ని కూడా ప్రగతికి అనుకూలంగా మార్చుకోవాలి: వినోద్ కుమార్

  • ఖనిజ పరిశ్రమల పురోగతికి నిర్ధిష్ట సూచనలను ఇవ్వండి
  • తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌ కుమార్‌
  • ‘‘ఖనిజ పరిశ్రమలపై కోవిడ్‌ ప్రభావం’’ అంశంపై
  • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ నిర్వహించిన వెబ్‌నార్‌ లో వినోద్ కుమార్ పిలుపు
  • దేశ వ్యాప్తంగా వెబ్‌నార్‌ లో పాల్గోన్న ఇంజనీర్లు
కరోనా వలన ఖనిజ పరిశ్రమలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయనీ, అయినా సరే విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని కష్టకాలాన్ని కూడా ప్రగతికి అనువుగా మార్చుకొనేందుకు వ్యూహరచన చేయాలని ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ధిష్టమైన సూచనలతో కూడిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి  వినోద్‌ కుమార్‌ ఇంజనీర్లకు సూచించారు.

ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ (ఇండియా) తెలంగాణా సెంటర్‌ ఆధ్వర్యంలో శనివారం (జూన్‌ 13వ తేదీ) నాడు ఉదయం ‘‘ఖనిజ పరిశ్రమలపై కోవిడ్‌-19 ప్రభావం’’ అనే అంశంపై జరిగిన వెబ్‌నార్‌ లో ఆయన ప్రసంగించారు.

కోవిడ్‌ ప్రభావం అన్ని దేశాల్లోని పరిశ్రమలపై ఉందనీ, చైనా వంటి దేశాల్లో గల విదేశీ పరిశ్రమలు నేడు భారత్‌ వైపు చూస్తున్న పరిస్థితి ఉందనీ, కష్టకాలాన్ని కూడా ప్రగతికి అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహరచన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఖనిజ పరిశ్రమల్లో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి పార్లమెంటు స్థాయిలో తాను ప్రత్యేక పోరాటం చేశానని, ఈ మేరకు 1952 బిల్లులకు సవరణలు చేయడం జరిగిందన్నారు. కనుక ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని, యాజమాన్యాలు కూడా మహిళలకు పరిశ్రమల్లో అవకాశాలు కల్పించాలని కోరారు.

 ఖనిజ పరిశ్రమల ఇంజనీర్లు కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకొంటూ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలకు కృషి చేయాలన్నారు. ఉత్పాదకత పెంచుకోగలిగితేనే ఖనిజ పరిశ్రమలు మనుగడ సాగించగలవన్నారు. కోవిడ్‌-19 నుండి విముక్తి లభించేంతవరకూ ఇంజనీర్లు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొత్త ఆవిష్కరణలు, ఆలోచనా విధానాలకు రూపకల్పన చేయాలని, మెదడుకు పదును పెట్టాలని సూచించారు.

జాతీయ మినరల్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ ట్రస్టు - కొత్త ప్రాజెక్టు చేపట్టే విషయంపైన, డి.ఎం.ఎఫ్‌.టి. నిధుల వినియోగం, బొగ్గు గనుల వేలం, కమర్షియల్‌ మైనింగ్‌, మైనింగ్‌ ఎక్విప్‌ మెంట్‌ తయారీ - ఆధునిక మైనింగ్‌ పద్ధతుల కోసం విదేశీ ఎఫ్‌.డి.ఐ.లకు తెలంగాణా అవకాశం ఇవ్వడం తదితర అంశాలపై నిర్ధిష్టమైన నివేదికలను సమర్పించాలన్నారు. జాతీయస్థాయిలో గల సింఫర్‌, ఎన్‌.ఐ.ఆర్‌.ఎం. వంటి సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించి నివేదికను సమర్పించాలని వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొంటుందని తెలిపారు.

వినోద్‌ కుమార్ పరిశ్రమ రంగానికి చేసిన సేవలపై ఐ.ఇ.ఐ. ప్రశంసలు కురిపించింది. ఖనిజ పరిశ్రమల్లో మహిళలకు అవకాశం కల్పించడంలో వినోద్‌ కుమార్‌ చేసిన కృషి యావత్‌ మహిళ లోకానికి మేలు చేసిందన్నారు.

వినోద్‌ కుమార్‌ ప్రత్యేక చొరవ వల్లనే జె.ఎన్‌.ఐ.టి.యు.లో ఉన్న మైనింగ్‌ మిషనరీ కోర్సును మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సుతో సమంగా గుర్తింపు సాధించారన్నారు.

ఉదయంపూట జరిగిన వెబ్‌నార్‌ టెక్నికల్‌ సదస్సును తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి ప్రారంభించారు. కరోనా కల్గించిన ఆర్ధిక కల్లోలంపై పోరాడి విజయం సాధించాలన్నారు. కరోనా సమయంలో ఖనిజ పరిశ్రమల మనుగడకు జాతీయ, అంతర్జాతీయ మైనింగ్‌ మేథావులతో ఈ వెబ్‌నార్‌ నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని మంచి ప్రతిపాదనలు వెల్లడవుతాయని ఆశిస్తున్నానని తెలిపారు.  మైనింగ్‌ ఇంజనీర్స్‌ పూర్వ విద్యార్ధుల సంఘం మైనింగ్‌ విద్యా వ్యాప్తికి, మైనింగ్‌ విద్యార్ధులకు కావాలసిన నైపుణ్యాలను విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని, వారియొక్క విజ్ఞప్తి మేరకే ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఇ. (మైనింగ్‌) ప్రారంభించడం జరిగిందని, ఇక ముందు కూడా వారియొక్క కృషికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పాపిరెడ్డి తెలియజేశారు.

ఈ వెబ్‌నార్‌ లో ఇంకా సింగరేణి తరపున జి.ఎం. (మార్కేటింగ్‌) కె.రవిశంకర్‌ మాట్లాడుతూ కరోనా వలన దేశంలో సగానికి పై బొగ్గు వినియోగం తగ్గిపోయిందనీ, ఇదే సమయంలో విదేశీ బొగ్గు తక్కువ ధరకే అమ్మకానికి సిద్దంగా ఉంచారనీ, దీని వలన ప్రభుత్వ రంగ పరిశ్రమలు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. మారుతున్న ప్రభుత్వ సరళీకృత విధానాల వలన రానున్న కాలంలో ప్రైవేటు, విదేశీ సంస్థలతో సింగరేణి లాంటి సంస్థలు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నాయనీ, అయినా సరే అపార అనుభవం, ఇంజనీర్ల సామర్థ్యంతో ప్రభుత్వ ఖనిజ సంస్థలు తమ ఉనికిని కాపాడుకోగలవని పేర్కొన్నారు. టెక్నికల్‌ సెషన్‌ కు సింగరేణి కాలరీస్‌ అడ్వయిజర్‌ (మైనింగ్‌) డి.ఎన్‌.ప్రసాద్‌ ఛైర్మన్‌ గా వ్యవహరించారు.

 ఈ వెబ్‌నార్‌ లో దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లతో పాటు, ఆస్ట్రేలియా, స్వీడన్‌ దేశాల నుండి కూడా మైనింగ్‌ మేథావులు తమ ఉపన్యాసాలు సమర్పించారు.

డా॥ లక్ష్మీ చికటమర్ల, దిపేష్‌ దిపు, బిద్యుత్‌ చక్రబోర్తి, పి.కె.సటపతి, కె.రవిశంకర్‌, పి.శరత్‌ కుమార్‌, భవీష్‌ సంఘవి, డియాగో గలార్‌ తమ పేపర్లను సమర్పించారు. ప్రారంభ, ముగింపు సమావేశానికి ఐ.ఇ.ఐ. ఛైర్మన్‌ డాక్టర్‌ జి.రామేశ్వర్‌ రావు అధ్యక్షత వహించారు. ఇంకా కన్వీనర్‌ బి.రమేష్‌ కుమార్‌, గౌరవ కార్యదర్శి టి.అంజయ్య, కె.జె. అమర్‌ నాథ్‌ , ఎం.ఎస్‌. వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

More Press News