అభివృద్ది చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఆక్సీజన్ ఫ్యాక్టరీలుగా పని చేస్తాయి: తెలంగాణ సీఎస్

  • ప్రతీ గ్రామం, పట్టణ ప్రాంతంలో ఒక యాదాద్రి మోడల్ (మియావాకి ప్లాంటేషన్) పార్క్ అభివృద్ది
  • సాచురేషన్ పద్దతిలో అటవీ ప్రాంతాలన్నీ పునరుజ్జీవనం చేస్తాం
  • మేడ్చల్ కండ్లకోయ ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను సందర్శించిన చీఫ్‌ సెక్రటరీ సోమేష్ కుమార్
ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రానున్న రోజుల్లో ఆక్సీజన్ ఫ్యాక్టరీలుగా పని చేస్తాయని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఉన్న ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును అధికారులతో కలిసి సీఎస్ పరిశీలించారు. దాదాపు మూడు గంటల పాటు పార్కులో కలియ తిరిగిన చీఫ్‌ సెక్రటరీ ప్రతీ అంశాన్నీ అత్యంత క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అటవీ పునరుజ్జీవనం, నేల మరియు తేమ పరిరక్షణ, రూట్ స్టాక్ అభివృద్ధి, తెలంగాణ నేలల్లో వృద్ధి చెందే మొక్కల రకాలు, అర్బన్ పార్కుల్లో నాటదగిన మొక్కలు, పర్యావరణ పరంగా చేకూరే లాభం, సందర్శకుల సౌకర్యాలు ఇలా అన్ని విషయాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పీసీసీఎఫ్ ఆర్. శోభ అర్బన్ పార్క్ ల విశిష్టతలను సీఎస్ కు వివరించారు. పూర్తిగా అభివృద్ధి చేసిన ఆక్సీజన్ పార్క్ అత్యంత అహ్లాదకరంగా ఉందని, ప్రకృతి స్వర్గంగా ఉందంటూ చీఫ్ సెక్రటరీ ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల పెద్ద మొత్తంలో అటవీ భూములు ఉన్నాయని, ఔటర్ రింగు రోడ్డుకు ఐదు కిలో మీటర్ల పరిధిలో 59 అర్బన్ ఫారెస్ట్ పార్కులను డెవలప్ చేస్తున్నామని, 32 ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 అటవీ పార్క్ లకు ప్రణాళిక ఉందన్నారు. ఈ నెల 16 న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారని, దానిలో మిగతా అంశాలకు తోడు హరితహారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉద్యాన వనాల అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.

యాదాద్రి మోడల్ (మియావాకి ప్లాంటేషన్)లో ప్రతీ ప్రాంతంలో కనీసం ఒక ఎకరాలో చిక్కగా మొక్కలు నాటి చిట్టడవులను అభివృద్ధి చేస్తామన్నారు. హరిత తెలంగాణ సాధనలో ప్రతీ ఒక్కరూ భాగస్వాయ్యం కావాలని, పచ్చదనం పెంపు వల్ల అందరి జీవన విధానం మెరుగుపడుతుందని సీఎస్ వెల్లడించారు. నిధుల కొరతను అధిగమించి సాచురేషన్ పద్దతిలో అటవీ పునరుజ్జీవన చర్యలు చేపడతామని తెలిపారు. అటవీ ప్రాంతాలు ఆక్రమణలకు గురికాకుండా ఫెన్సింగ్ నిర్మించి, సహజ అటవీ పురుద్దరణ కు (రూట్ స్టాక్ డెవలప్ మెంట్ ) ప్రాధాన్యతను ఇస్తామన్నారు. కార్యక్రమంలో కొద్ది సేపు పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో అటవీ శాఖ పార్కులు, హరితహారం కార్యక్రమాలు బాగున్నాయని సీఎస్ కు తెలిపారు.
 
కండ్లకోయ అర్బన్ ఫారెస్ట్ పార్కులో చేసిన ప్రతీ పనిని సీఎస్ పరిశీలించారు. అన్ని వివరాలు అటవీ అధికారులను అడిగితెలుసుకున్నారు. ఏఏ మొక్కలు ఎన్ని సంవత్సరాల కిందట నాటారు, వాటి ఎదుగుదల ఎలా ఉందని ఆరా తీశారు. సందర్శకుల సంఖ్య సౌకర్యాలను పరిశీలించారు. వాక్ ఇన్ ఐవరీ (పక్షుల కేంద్రం)తో పాటు, ప్రకృతి రమణీయంగా పార్కును తీర్చిదిద్దన విధానం బాగుందని ప్రశంసించారు. అధికారులతో కలిసి చీఫ్ సెక్రటరీ పార్కులో మొక్కలు నాటారు. వెండి నెమలి పక్షులను (silver pheasant birds) ఐవరీలోకి విడుదల చేశారు.
అటవీ శాఖ సిబ్బందిని అందరినీ పలకరించిన సీఎస్, చక్కగా పనిచేస్తున్నారని అభినందించారు.
 
కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, పీసీసీఎఫ్ ఆర్ శోభ, జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం.డోబ్రియల్, చంద్రశేఖర్ రెడ్డి, డీఎఫ్ఓ లు సుధాకర్ రెడ్డి, శివయ్య, అశోక్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

More Press News