నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను త‌నిఖీ చేసిన‌ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్

  • న‌గ‌రంలో వేగంగా జ‌రుగుతున్న నాలాల పూడిక‌తీత ప‌నులు
  • పూడిక‌తీత ప‌నుల‌ను ఈ నెల రెండో వారంలో త‌నిఖీ చేసిన మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌
  • నేడు డ‌బీర్‌పుర‌లో నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను త‌నిఖీ చేసిన‌ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌
హైద‌రాబాద్‌, మే 27: న‌గ‌రంలో నాలాల పూడిక‌తీత ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆదేశాల మేర‌కు నాలాల పూడిక‌తీత‌కు వార్షిక షెడ్యూల్‌ను జీహెచ్‌ఎంసీ రూపొందించింది. వ‌ర్షాకాలం కంటే ముందు, వ‌ర్ష‌కాలం త‌ర్వాత ఏ మేర‌కు పూడిక జ‌మ అవుతుంది, త‌ద‌నుగుణంగా పూడిక‌తీత‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై కార్యాచ‌ర‌ణ‌ను అమ‌లు చేస్తున్న‌ది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని వ‌ర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా లాక్‌డౌన్ పిరియ‌డ్‌లోనే ఎక్కువ యంత్రాల‌ను వినియోగించి పూడిక తొల‌గింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని జీహెచ్‌ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు.

ఈ నెల 9న షేక్‌పేట్‌లో జ‌రుగుతున్న నాలా పూడిక‌తీత ప‌నుల‌ను  మేయ‌ర్ త‌నిఖీ చేశారు. అదే విధంగా బుధ‌వారం డ‌బీర్‌పుర‌లో రూ. 2కోట్ల వ్య‌యంతో జ‌రుగుతున్న నాలా విస్త‌ర‌ణ‌ ప‌నుల‌ను పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్ ప‌రిశీలించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో శాస‌న మండ‌లి స‌భ్యులు రియాద్ ఉల్ హ‌స‌న్ ఎఫెంది, శాస‌న స‌భ్యులు ఖాద్రి పాషా, కార్పొరేట‌ర్ బాసిత్‌, ఎస్‌.ఇ న‌ర్సింగ్‌రావు, డిప్యూటి క‌మిష‌న‌ర్లు మంగ‌త‌యారు, సూర్య‌కుమార్‌, ర‌జ‌నీకాంత్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జీహెచ్‌ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మెయింట‌నెన్స్ విభాగం చీఫ్ ఇంజ‌నీర్ జియాఉద్దీన్ మీడియాతో మాట్లాడుతూ వార్షికంగా 4 ల‌క్ష‌ల 79వేల క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను నాలాల నుండి తొల‌గించాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశిస్తూ 345 ప‌నుల‌ను మంజూరు చేయ‌డ‌మైన‌ది. ఈ సీజ‌న్‌లో 3 ల‌క్ష‌ల 29వేల క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను తొల‌గించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంటే ఇప్ప‌టి వ‌ర‌కు 2 ల‌క్ష‌ల 60వేల క్యూబిక్ మీట‌ర్ల పూడిక‌ను తొల‌గించారు.

మ‌రో 10 రోజుల్లో మొత్తం పూడిక‌ను తొల‌గించుట‌కు క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌నుల‌ను అధికారులు మానిట‌రింగ్ చేస్తున్నారు. తొల‌గించిన పూడిక‌ను జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లోని డంపింగ్‌యార్డ్‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు. అయితే చిన్న చిన్న గ‌ల్లీలు ఉన్న‌చోట వాహ‌నాలకు ఇబ్బందిగా ఉన్నందున స్థానికంగా డంపింగ్ పాయింట్‌లు ఏర్పాటు చేసి ముందుగా పూడిక‌ను అక్క‌డ‌కు చేర్చి, త‌దుప‌రి జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ కు త‌ర‌లిస్తున్న‌ట్లు తెలిపారు.

జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంపింగ్‌యార్డ్‌కు చేరిస‌న నాలా పూడిక‌ను లెక్కించి చెల్లింపులు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. చార్మినార్ జోన్‌లో 90శాతం పూడిక‌తీత పూర్తి అయిన‌ట్లు తెలిపారు. ఖైర‌తాబాద్‌, సికింద్రాబాద్‌ల‌లో పూడికతీత ప‌నుల్లో వేగాన్ని పెంచేందుకు ఎక్కువ మంది కూలీల‌ను వినియోగిస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రంలోని పెద్ద నాలాల‌ను మూసివేయ‌రాద‌ని ఉన్న నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఐరెన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

More Press News