మరికొన్నేళ్లు కరోనాతో కలిసి జీవించాల్సిందే: మంత్రి ఎర్రబెల్లి
- ముస్లీంలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు
- అల్లా, రాముడు, ఏసు పేర్లేవైనా దేవుడొక్కడే
- అందరి దేవుళ్ళకు మొక్కుతూ నేను వరసగా గెలుస్తున్నాను
- ముస్లీంలను శత్రువులుగా చూడొద్దు
- మన సంస్కృతి గొప్ప సంస్కృతి గంగా జమునా తహజీబ్
- ముస్లీంల వల్లే కరోనా విస్తృతి అయిందనడం పూర్తిగా నిజం కాదు
- ఒకరిద్దరు చేసిన తప్పుని అందరికీ రుద్దొద్దు
- మరో ఒకటి రెండేళ్ళు మనం కరోనాతో కలిసి జీవించాల్సిందే
- టీకాలు వచ్చినా సరే, ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు
- జ్వరం, జలుబు వంటి విపరీత లక్షణాలుంటే.. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండల కేంద్రాల్లో ముస్లీంలకు పండుగ రోజు వస్తువులతో కూడిన నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వైరస్ ని అంతం చేయడం అంత ఈజీ కాదన్నారు. అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్యులు కూడా ఇదే విషయాన్నిచెబుతున్నారన్నారు. టీకాలు వచ్చినా సరే, మనం మరికొన్నేళ్ళు అంటే కనీసం ఒకటి రెండేళ్ళైనా సరే, కరోనాతో కలిసి జీవించాల్సిందేనని వారంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో కరోనాతో పూర్తిగా భయపడాల్సింది లేదని, అలాగని నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని మంత్రి ప్రజలకు హితవు పలికారు.
జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యులని సంప్రదించాలన్నారు. అలాగని ఈ లక్షణాలన్నీ కరోనా అనుకోవడానికి లేదన్నారు. కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఇది. దీన్ని అదిగమించడానికి కొద్ది సమయం పడుతుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా, స్వీయ నియంత్రణలో ఉండాలని సూచించారు. సిఎం కెసిఆర్ తీసుకున్న అద్భుత సాహసోపేతమైన నిర్ణయాలే ఇవ్వాళ మనల్ని ఈ స్థితిలో ఉంచాయన్నారు. కెసిఆర్ ప్రజల ప్రాణాలే ముఖ్యమని, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతున్నా లెక్క చేయలేదన్నారు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే సీఎం మనకు ఉన్నందుకు గర్వ పడాలని మంత్రి చెప్పారు.
తొర్రూరులో ముస్లీంలకు పండుగ ఒక్కరోజు సరుకులను డాక్టర్ సోమేశ్వరరావు ఇచ్చారని, ఆయన్ని అభినందించారు. తన కొడుకు, కూతురు కుటుంబం సహా, అనేక మంది దాతలు ముందుకు రావడం వల్లే తాను తన ట్రస్టు తరపున, ఇతరుల పక్షాన వేలాది మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయగలగనట్లు మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లీం మత పెద్దలు, ముస్లీం కుటుంబాలకు చెందిన అనేక మంది మహిళలు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, రైతుల పొలాలు, చేసే సాగుని బట్టి, వారి ప్లాట్ ఫారాలకు నిధులు ఇస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. అలాగే అంతా ఒకే తరహా పంటలు కాకుండా, ఇక నుంచి ప్రభుత్వం చెప్పిన విధంగా సాగు చేద్దామని, సర్కారు చెప్పిన పంటలనే సాగు వేయాలని, లాభసాటి పంటల ద్వారా లబ్ధి పొంది రైతులు బాగుపడాలని మంత్రి సూచించారు. తెలంగాణలో కొత్త వరి వంగడం వచ్చిందన్నారు. షుగర్ ఫ్రీ తెలంగాణ సోనా తో రైతులు బాగా డబ్బులు సంపాదించే అవకాశం ఏర్పడిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కలు సాగు చేయవద్దని రైతులను మంత్రి కోరారు. ఈ సారి వేసే మక్కల వల్ల దిగుబుడులు రావని, వచ్చినా, గిట్టుబాటు కాదని మంత్రి అన్నారు.
దేశంలో తెలంగాణ పత్తికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఇప్పుడు సాగునీటి సమస్యలు తీరుతున్నందున ఇక పత్తి పంటలు వేసి పసిడి రాసులు పొందాలన్నారు. మన వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ మిర్చీ, పల్లీకి కూడా మంచి డిమాండ్ ఉందన్నారు. డిమాండ్ ఉన్న పంటలనే వేద్దాం... రైతుల జీవితాలను బంగారుమయం చేద్దాం అన్నారు. సీఎం కెసిఆర్ తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. కెసిఆర్ చెప్పినట్లే విందాం. మన బతుకులు బాగు చేసుకుందామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లీంలు, షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులు పాల్గొన్నారు.