సీజనల్ వ్యాధుల నియంత్రణపై అధికారులతో సమావేశమైన మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్
- హైదరాబాద్ లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్‌లు GHMC లో క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశం
- పౌరుని కోణంలో సమస్యలను ఆలోచించి పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని ఆదేశం
- సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఫాగింగ్‌ను / స్ప్రేయింగ్ ను ఐదు రేట్లు చేయాలి
- సోడియం హైపోక్లోరైట్ ఇంటెన్సీవ్ స్ప్రేయింగ్ కొనసాగింపు
- చెరువులలో గుర్రపుడెక్కను తొలగించుటకు ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ మిషన్ల వినియోగం
- హై రిస్క్ ప్రాంతాలపై ఇంటెన్సీవ్ శానిటేషన్, యాంటి లార్వా స్ప్రేయింగ్
- తక్షణం పనులను చేపట్టడానికి డిప్యూటీ కమిషనర్లకు ఆర్థికపరమైన అధికారాలు
- తరుచుగా సర్కిల్ స్థాయిలో ఇతర డిపార్టుమెంట్లతో సమన్వయ సమావేశాలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారు
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు జిహెచ్‌ఎంసి ఎంటమాలజి విభాగంలో ఉన్న 2,412 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, యాంటి లార్వా ఫాగింగ్‌కు దాదాపు 2,200 యంత్రాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఆయా జోన్లలో ఉన్న పరిస్థితులను బట్టి స్థానిక శాసన సభ్యులు, కార్పొరేటర్ల సహకారంతో అదనపు ఫాగింగ్ మిషన్లను తెప్పించి ప్రతి ఐదు రోజులకు ఒకసారి చొప్పున నెలకు ఐదు విడతలు యాంటి లార్వా స్ప్రేయింగ్ చేయించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
హై రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఇంటెన్సీవ్ శానిటేషన్, యాంటి లార్వా స్ప్రేయింగ్ చేయాలని తెలిపారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావనాన్ని స్ప్రే చేయాలని ఇ.వి.డి.ఎం విభాగానికి సూచించారు. అలాగే సీజనల్ వ్యాధులను అరికట్టుటలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు. సర్కిల్ స్థాయిలో కన్వర్జెన్సీ మీటింగ్‌లు జరపాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఈ నెల 19 నుండి వారం పాటు కాలనీ/ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు నిర్వహించి దోమలతో వచ్చే డెంగ్యూ, మలేరియా, స్వైన్‌ప్లూ, చికెన్ గున్య వ్యాధులపై చైతన్యపర్చాలని డిప్యూటి కమిషనర్లను ఆదేశించారు.
మరో నెల రోజుల్లో వర్షాల ఉధృతి పెరుగుతుందని తెలిపారు. అందువలన ఇప్పటి నుండే దోమల నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజలను చైతన్యపర్చనున్నట్టు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. 54 ప్రధాన నాలాలలో పూడికను తొలగించుటకు యంత్రాలను వినియోగించాలని తెలిపారు. చెరువులు, కుంటలలో పెరిగిన గుర్రపుడెక్కను తొలగించుటకు ప్రతిజోన్‌కు ఒక ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ మిషన్‌ను కేటాయించనున్నట్టు తెలిపారు.
అవసరమైతే హెచ్.ఎం.డి.ఏ నుండి కూడా ఈ యంత్రాలను తీసుకోవాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్‌లను గుర్తించి నీరు నిల్వకుండా సరిచేయాలని తెలిపారు. రోడ్లపై ఏర్పడుతున్న గుంతలను పూడ్చేందుకు ఇన్‌స్టెంట్ రిపేర్ టీమ్స్‌ను వెంటనే రంగంలోకి దించాలని ఆదేశించారు. అలాగే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మ్యాన్‌హోల్స్‌పై ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. వర్షపునీరు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉన్న ఓపెన్ నాలాలకు భారీకేడింగ్ చేయాలని తెలిపారు.
భవన నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు జీడిమెట్ల, ఫతుల్లాగూడలలో నెలకోల్పిన ప్లాంట్లకు తరలించుటకై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వం పట్ల భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాలకు అదనంగా మరో 44 బస్తీ దవాఖానాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే బస్తీ దవాఖానాల పట్ల ప్రజలలో చైతన్యం కలిగించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ప్రైవేట్ కాళీ స్థలాలు (ఓపెన్ ప్లాట్స్) పేరుక పోయిన ఘన వ్యర్థాలను వెంటనే తొలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని దానికి అయ్యే ఖర్చును ప్లాట్ యజమానులనుండే వసూలు చేయాలనీ ఈ సందర్బంగా ఆదేశించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గత రెండున్నర నెలలుగా వైద్య సిబ్బందితో కలిసి మునిసిపల్ సిబ్బంది మరియు అధికారులు చాల గొప్పగా పనిచేశారని ఈ సందర్భంగా పురపాలక శాఖ పనిచేస్తున్న తీరును అభినందించారు. వ్యాధి చికిత్సకంటే, వ్యాధినివారనే ముఖ్యం కాబట్టి వచ్చే సీజన్లో వచ్చే వ్యాదుల నివారణకోసం పురపాలక మంత్రి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసి అందరిని సమాయత్తం చేయడం చాలా మంచి విషయం ఈ సందర్భగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు జిహెచ్‌ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటి మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, సెక్రటరి సుదర్శన్ రెడ్డి, మెట్రోవాటర్ వర్క్స్ ఎం.డి యం.దానకిషోర్, ఇ.వి.డి.యం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, అదనపు కమిషనర్లు , జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఏంటోమోలోజి అధికారులు, HMWSSB అధికారులు పాల్గొన్నారు.