ఆరవ విడత తెలంగాణకు హరితహారం కోసం సర్వం సిద్దం చేయాలి: అటవీ సంరక్షణ ప్రధాన అధికారి

  • జిల్లా స్థాయిలో నర్సరీల్లో మొక్కలు, నాటాల్సిన సంఖ్యపై స్పష్టత రావాలి
  • అవసరం మేరకు పెద్ద మొక్కలు సరఫరా చేయాల్సిన బాధ్యత అటవీ శాఖదే
  • మళ్లించిన అటవీ భూములకు బదులుగా తీసుకున్న రెవెన్యూ భూములు రిజర్వ్ ఫారెస్ట్ గా నోటిఫై
  • అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) వీడియో కాన్ఫరెన్స్
వచ్చే నెల- జూన్ ఇరవై నుంచి ఆరవ విడత  తెలంగాణకు హరితహారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆదేశించిన నేపథ్యంలో అరణ్య భవన్ లో సమీక్షా సమావేశం జరిగింది. హరితహారం సన్నాహకాలు, నర్సరీల్లో పరిస్థితిపై అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెంటనే అన్ని నర్సరీల్లో ఉన్న మొక్కలను మదింపు చేయాలని, చెట్ల రకాలు, ఎత్తు ఆధారంగా సరఫరాకు సిద్దం చేయాలని ఆదేశించారు.

అలాగే జిల్లాల వారీగా నాటాల్సిన మొక్కల టార్గెట్ ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయించిందని, జిల్లా అటవీ అధికారి నోడల్ అధికారిగా కార్యక్రమం సమన్వయం చేయాలన్నారు. జిల్లాల వారీగా లభ్యమయ్యే మొక్కల వివరాలతో నర్సరీ డైరెక్టరీని సిద్దం చేయాలని, గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం పల్లె ప్రగతిలో భాగంగా గ్రామీణాభివృద్ది శాఖ నిర్వహిస్తుందని, సాంకేతిక సహకారం అటవీ శాఖ సిబ్బంది అందించాలన్నారు. మున్సిపాలిటీలు, పట్టణాల్లో పెద్ద మొక్కల అవసరం ఎక్కువగా ఉంటుందని, వాటిని తగిన సంఖ్యలో సరఫరా చేసే బాధ్యత ఆయా జిల్లా అటవీ అధికారులు పర్యవేక్షించాలన్నారు. అటవీ శాఖ సిబ్బంది పనితీరుకు ముఖచిత్రంగా నిలుస్తున్న రహదారి వనాలపై (అవెన్యూ ప్లాంటేషన్) ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచించారు.

వివిధ ప్రాజెక్టుల కోసం మళ్లించిన అటవీ భూములకు బదులుగా తీసుకున్న రెవెన్యూ భూములను వెంటనే రిజర్వ్ ఫారెస్ట్ / రక్షిత అటవీ ప్రాంతాలుగా నోటిఫికేషన్ జారీ చేయాలని, అదే సమయంలో అనుమతుల జారీలో ఉన్న నియమాలన్నీ కచ్చితంగా పాటించేలా చూడాలని జిల్లా అటవీ అధికారులకు పీసీసీఎఫ్ సూచించారు. తుది దశ అనుమతుల జారీ కోసం ప్రతిపాదనలను నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం సమీపిస్తున్ననేపథ్యంలో అటవీ భూములను ఆక్రమించే కొత్త ప్రయత్నాలు జరగొచ్చని, అన్ని బీట్లలో నిత్య పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఆక్రమణలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి గట్టి నిఘా పెట్టాలని తెలిపారు.

అవసరం మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారం తీసుకోవాలని పీసీసీఎఫ్ కోరారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల జంతువులు బాహ్య ప్రపంచలోకి వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో రెస్క్యూ ఆపరేషన్ అత్యంత జాగ్రత్తగా చేయాలని, వీలైనంత వరకు జంతువులు అటవీ ప్రాంతాల్లోకి తిరిగివెళ్లేలా చూడాలన్నారు. ఇక కంపా నిధులతో జిల్లాల వారీగా చేపట్టిన పనుల పురోగతి, అటవీ పునరుజ్జీవన చర్యలపై కూడా సమావేశంలో చర్చించారు. జిల్లాల వారీగా పనుల వివరాలను అదనపు పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్ సమీక్షించారు.

సమావేశంలో హరితహారం నోడల్ అధికారి, అదనపు పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ లు  స్వర్గం శ్రీనివాస్, ఎం.సీ. పర్గెయిన్, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు చంద్రశేఖర రెడ్డి, సునీతా భగవత్, అన్ని జిల్లాలకు చెందిన అటవీ అధికారులు పాల్గొన్నారు.

More Press News