లాక్‌డౌన్ పిరియడ్‌లో వేగంగా జరుగుతున్న సీఆర్‌ఎంపీ రోడ్ల పనులు
- మెరుగైన నిర్వహణకు నగరంలోని 709 కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ఏజెన్సీలకు అప్పగించిన ప్రభుత్వం
- జూన్ 2020 కి నిర్దేశించిన లక్ష్యం 331 కిలోమీటర్లలో ఇప్పటికే పూర్తి అయిన 208 కిలోమీటర్లు
ఆయా రోడ్లను అందంగా తీర్చిదిద్దుటకు మరమ్మతులతో పాటు పారిశుధ్య, మురుగు, వరదనీటి పారుదల నిర్వహణను కూడా చేయాల్సిన బాధ్యత ఏజెన్సీలపైనే ఉంది. నిర్వహణలో భాగంగా మొత్తం 709 కిలోమీటర్లలో మొదటి సంవత్సరం 50శాతం రోడ్లను రీకార్పెటింగ్ చేయాలి. అందులో భాగంగా జూన్ 2020 లోపు 331 కిలోమీటర్ల రీకార్పెటింగ్ లక్ష్యంలో ఇప్పటి వరకు 208 కిలోమీటర్ల రీకార్పెటింగ్ పూర్తి అయ్యింది. మే నెలాఖరు వరకు 280 నుండి 300 కిలోమీటర్ల రీకార్పెటింగ్ పూర్తి అవుతుందని సీఆర్‌ఎంపీ చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ తెలిపారు. నిర్దేశిత లక్ష్యాన్ని మరో నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
లాక్‌డౌన్ పిరియడ్‌లో ట్రాఫిక్, ఇతర సమస్యలు లేనందున సీఆర్‌ఎంపీ రోడ్ల పనులపై అధికారులు, నిర్మాణ సంస్థలు తమ దృష్టిని పూర్తిగా కేంద్రీకరించారు. తదనుగుణంగా ప్రతిరోజు ప్యాకేజిల వారిగా పూర్తి చేయాల్సిన పనులను మానిటరింగ్ చేస్తున్నారు. జోనల్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్లతో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీకి చెందిన సైట్ ఇంజనీర్లు వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని సీఆర్‌ఎంపీ రోడ్ల పనులను కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పని ప్రదేశంలో ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించి కార్మికులు, సిబ్బందికి తగు రక్షణ చర్యలు తీసుకొని బౌతిక దూరం పాటిస్తూ భారీ యంత్రాలతో పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.
ఈ 331 కిలోమీటర్ల రీకార్పెటింగ్‌తో పాటు మొత్తం రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేసి దెబ్బతిన్న చోట ప్యాచ్ వర్కలను చేస్తున్నారు. అలాగే రోడ్ల నిర్వహణలో భాగంగా లేన్ మార్కింగ్, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియం, రోడ్ సేఫ్టి, లేన్ మార్కింగ్ పెయింటింగ్‌లు చేస్తున్నారు. బి.ఎస్.ఎన్.ఎల్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ ఇతర శాఖలు చేపట్టే పనులకు అవసరమైన రోడ్ కటింగ్‌ల అనుమతులను ఇచ్చి రోడ్లను రిస్టోరేషన్ చేసే బాధ్యత ఏజెన్సీలు చేస్తాయి. లాక్ డౌన్ పిరియడ్‌లో సీఆర్‌ఎంపీ పనులతో నగరంలోని రోడ్లు అందంగా, ఆహ్లాదకరంగా మెరుస్తున్నాయి.