పట్టణ ప్రాంతాల్లో 'ఇన్ సిట్యూ' నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది: తెలంగాణ సీఎస్

భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మే 1వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులలో పట్టణ ప్రాంతాల్లో 'ఇన్ సిట్యూ' (in situ) నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  తెలిపారు. ప్రాజెక్ట్ డెవలపర్లు తమకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చుకోవడంతో పాటు కార్మికులతో నిర్మాణపు పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్నారు. ప్రాజెక్ట్ డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై డీజీపీ, మున్సిపల్, పరిశ్రమల ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు, CREDAI, TREDAI ప్రతినిధులతో ప్రధాన కార్యదర్శి బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో నిర్మాణ రంగానికి సంబంధించి  ప్రాజెక్ట్ డెవలపర్లకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర యంత్రాంగం అందిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో కౌన్సెలింగ్ ద్వారా కార్మికుల్లో ముఖ్యంగా వలస కార్మికుల్లో విశ్వాసం కలిగించాలని, ప్రోత్సాహకాలు, సౌకర్యాలు, వైద్య సంరక్షణ అందించాలని బిల్డర్లను కోరారు. టేలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న బిల్డర్ల కోరిక మేరకు స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుకలు తదితర భవన నిర్మాణ సామాగ్రి సరఫరాలో ఎటువంటి అంతరాయాలు ఏర్పడకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని సీఎస్ హామీ ఇచ్చారు. ఈ విషయమై 3 పోలీసు కమీషనరేట్ల ద్వారా భవన నిర్మాణ సామాగ్రిని తరలించే వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పయనించేలా చూస్తామని  మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ టేలీ కాన్ఫరెన్స్ లో డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్యకార్యదర్శులు అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్, పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, డైరెక్టర్ సి.సి.ఎల్.ఎ రజత్ కుమార్ షైనీ, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

More Press News