జన సైనికులెవరూ సంయమనం వీడొద్దు.. సేవే ప్రధానంగా ముందుకు వెళ్దాం: పవన్ కల్యాణ్

  • కరోనా సమయంలో సమస్యలు పక్కదోవ పట్టించేందుకు రెచ్చగొడతారు
  • రైతులు, కార్మికులు నష్టపోతున్నారు... చిన్నపాటి వ్యాపారులు చితికిపోతున్నారు
  • కోవిడ్ ఆసుపత్రులు... క్వారంటైన్ కేంద్రాల్లో సమస్యలు నా దృష్టికి వచ్చాయి
  • ప్రకాశం జిల్లా జనసేన నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
కరోనా మహమ్మారి అన్ని రంగాలపైనా ప్రభావం చూపింది.. పేద కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయి.. వారిని జనసేన నాయకులు, శ్రేణులు ఆదుకొంటూ చేస్తున్న సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించే దిశగా పని చేస్తున్నప్పుడు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, చర్యలకు పాల్పడ్డా సంయమనం వీడవద్దు అని జనసైనికులకు సూచించారు.

ప్రజా సేవే ప్రధానంగా ముందుకు వెళ్దాం అన్నారు. కరోనా విపత్తు వేళ తలెత్తుతున్న సమస్యలను, తప్పులను పక్కదోవ పట్టించి జనం దృష్టి మరల్చేందుకే వివాదాలు రేపి రెచ్చగొడతారనే విషయాన్ని గ్రహించాలి అని తెలిపారు. గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా జనసేన నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఒంగోలు, చీరాల, అద్దంకి, కందుకూరు తదితర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రైతాంగం సమస్యలు, కూలీల కష్టాలు, తాగు నీటి సరఫరాలో ఆటంకాల గురించి చర్చించారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రపంచంలో ఎవరూ ఊహించని విపత్తు ఇది. ఈ విపత్తుని ఎదుర్కొనేందుకే అన్ని దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ముప్పుపై ముందుగానే స్పందించి ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు చర్యలు చేపట్టారు. ఆయన సమర్థ నాయకత్వంలో చేపడుతున్న చర్యలు ఫలితాన్నిస్తాయి. లాక్  డౌన్ ను సడలించే సమయం వస్తోంది.. ఏ మేరకు సడలింపు ఉంటుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నారు.

కరోనా వ్యాప్తి మూలంగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకొనేవారు చితికిపోతున్నారు. అలాగే రైతులు, రోజు కూలీలు నష్టపోయారు. ఇలాంటి కష్ట కాలంలోనే సాటి మనిషి అండ అవసరం. మన భారత జీవనంలోనే తోటివారికి సాయపడటం ఉంది. ఆ మానవత్వం ఇంకా ఉంది అని మన జన సైనికులు నిరూపిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారందరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుతున్నారు.

ప్రకాశం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిశాయి. అలాగే కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు, వ్యాధి అనుమానితులకు సరైన సేవలు, ఆహారం అందటం లేదనే సమస్యను మన నాయకులు తెలిపారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్తాను. సమస్య పరిష్కారమే ప్రధానంగా పనిచేద్దాం. ఈ విపత్కర సమయంలో రాజకీయాల కంటే ప్రజా ప్రయోజనమే ముఖ్యంగా మనం పని చేద్దాం” అన్నారు.

రైతాంగం ఇక్కట్లపై దృష్టి సారించండి: నాదెండ్ల మనోహర్  
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ప్రకాశం జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రజలకు ఇలాంటి తరుణంలో మనో ధైర్యం ఇవ్వాలి. అలాంటి ధైర్యాన్ని ఏ మేరకు ప్రభుత్వం ఇస్తుందో అర్థం కావడం లేదు. జనసేన నాయకులు, కార్యకర్తలు మారుమూల ప్రాంతాల్లో సైతం పేదలకు అవసరమైన నిత్యావసరాలు అందిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మిర్చి, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఎన్నో ఇబ్బందులుపడుతున్నారు. అలాగే పొగాకు వేలం వేసే సమయం ఇది. ఆ రైతులకు సమస్యలు వస్తున్నాయి.

జిల్లాలోని రైతాంగం సమస్యపై పార్టీ నాయకులు దృష్టి సారించాలి. అలాగే జిల్లా నుంచి వలసలు వెళ్ళినవారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి. చీరాల ప్రాంతంలో చేనేత రంగం ఉంది. అక్కడి చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. వారికి ప్రభుత్వపరంగా సాయం సక్రమంగా అందుతుందో లేదో దృష్టిపెట్టాలి” అని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ప్రకాశం జిల్లాలో పరిస్థితి గురించి నాయకులు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో వివరించారు. జనసేన ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జ్ షేక్ రియాజ్ మాట్లాడుతూ “ఒంగోలు నగర పరిధిలోనే  ఎక్కువ కేసులు ఉన్నాయి. రెడ్ జోన్ ప్రాంతంలో నిన్నటి వరకూ నిత్యావసరాలు కూడా అందించలేదు. మన పార్టీ బలంగా డిమాండ్ చేశాక పోలీసుల సహకారంతో పంపిణీ మొదలుపెట్టారు. అందులో కూరగాయలు కుళ్లిపోయాయి అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఉద్యాన పంటలు వేసిన రైతులు నష్టపోయారు.

పొగాకు కోసం 10 వేలం కేంద్రాలు ఉంటే నాలుగు మాత్రమే తెరిచారు” అన్నారు. యరగొండపాలెం నియోజకవర్గ పరిధిలో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని... గతంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేవారని, లాక్ డౌన్ వల్ల ఆ సరఫరా ఆపేయడంతో ప్రజలు తీవ్ర నీటి కష్టాలుపడుతున్నారని ఆ నియోజకవర్గ ఇంచార్జ్ డా.పాకనాటి గౌతమ్ తెలిపారు.
 
డయాలసిస్ రోగులను నరసరావుపేట వెళ్లమంటున్నారని.. పేద రోగులకు అది చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. మార్కాపురం ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ “పలకల పరిశ్రమలో పని చేసే కూలీలు ఉపాధికి దూరమైపోయారు. ఈ నియోజకవర్గంలో పార్టీ తరఫున రోగులకు మందులు అందచేస్తున్నాం” అన్నారు. రైతులకు పంట దిగుబడి వచ్చిన ఈ సమయంలో గోనె సంచులు, టార్పాలిన్ల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారనే విషయాన్ని పర్చూరు నియోజకవర్గ నాయకుడు పి.విజయ్ కుమార్ తెలిపారు.

అలాగే ఆసుపత్రుల్లో ఓపీ చూడకపోవడంతో దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్న వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పార్టీ నాయకులు బొటుకు రమేశ్, పులి మల్లికార్జున్, బెల్లంకొండ సాయిబాబు, కంచర్ల శ్రీకృష్ణ తదితరులు జిల్లాలో పరిస్థితిని వివరించారు.

More Press News