మే 2వ తేదీ నుంచి రూ.1500 నగదు జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం!

  • రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ
  • నాలుగు జిల్లాల్లో కిలో కందిపప్పు
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన నిరు పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. గత నెలలో ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, ఒక్కో కార్డుపై రూ.1500 ఆర్థిక సహాయం అందించింది.

"శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 87.55 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబంలో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. అలాగే నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ రూరల్, మెదక్ జిల్లాల్లో ప్రతి కార్డుదారుడికి కిలో కందిపప్పును కూడా ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్) ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక నెలకు రాష్ట్రానికి అవసరమైన 8,754 మెట్రిక్ టన్నుల కందిపప్పు రావాల్సి ఉండగా, నా ఫెడ్ ఇప్పటి వరకు 3,233 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. దీంతో ముందుగా మే1 నుంచి నాలుగు జిల్లాల్లో మాత్రమే సరఫరా చేస్తున్నాం. నా ఫెడ్ సరఫరా చేసే దానికి అనుగుణంగా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల్లో 15వ తేదీ తరువాత కందిపప్పును పంపిణీ చేస్తాం" అని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మే నెలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క ఆహార భద్రత కార్డుదారునికి రూ.1500 వారి బ్యాంకు లేదా పోస్టాఫీసు అకౌంట్ లో జమ చేసే కార్యక్రమాన్ని మే 1న బ్యాంకులకు సెలవు కావున 2వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

"రేషన్ లబ్ధిదారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ టోకెన్లో ఇచ్చిన నిర్దేశించిన సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలి. ప్రతి రేషన్ షాపు వద్ద సబ్బు, సానిటైజర్, నీళ్లు వంటి కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకొని లబ్ధిదారులు కూడా తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సాధారణ రోజుల్లో ప్రతి నెల 15వ తేదీ వరకు మాత్రమే రేషన్ పంపిణీ జరిగేది. కోవిడ్ లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో ప్రతి ఒక్కరు రేషన్ తీసుకునే వరకు 23వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేశాం. ఈ నెల కూడా ప్రతి ఒక్కరు రేషన్ తీసుకునే వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.

More Press News