రైతులు నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

  • ప్ర‌తి గింజా ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంది
  • ఆఖ‌రు గింజ వ‌రకు కొనుగోలు చేస్తాం
  • ప‌ర్వ‌త‌గిరిలో రైతుల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి భ‌రోసా
  • అన్నారం రైతుల‌కు మంత్రి అభ‌యం
  • పాల‌కుర్తిలో ప్రాథ‌మిక స‌హ‌కార రైతు సంఘం వ‌ద్ద రైతుల‌కు ప‌రామ‌ర్శ‌
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా (ప‌ర్వ‌త‌గిరి, పాల‌కుర్తి, తొర్రూరు), ఏప్రిల్ 27: రైతులు నిర్ణీత నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి. అధికారులు రైతుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌ద్దు. రైతుల‌కు నాణ్య‌త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి. చైత‌న్యం చేయాలి అని తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించిన‌ మంత్రి ప‌లు చోట్ల రైతుల‌ను క‌లిశారు. వారితో ముచ్చ‌టించారు. వారి క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ప‌ర్వ‌త‌గిరిలో:

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలో కొంద‌రు రైతులు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఇంటికి వెళ్ళారు. త‌మ ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయ‌డంలేద‌ని ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వెంట‌నే వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రిత‌తో మాట్లాడారు. రైతుల ఫిర్యాదుని ఆమె దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో రైతులు తూర్పాలా ప‌ట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, తాలు రావ‌డంతో వాళ్ళ‌కి న‌చ్చ చెబుతున్నామ‌ని క‌లెక్ట‌ర్ మంత్రికి చెప్పారు. దీంతో మంత్రి అటు రైతులు, ఇటు క‌లెక్ట‌ర్ తో మాట్లాడారు. నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల్సిందేన‌ని, అయితే రైతులు న‌ష్ట‌పోకుండా, ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్య‌త అధికారుల‌దేన‌ని ఆదేశించారు.

పాలకుర్తిలో:

పాల‌కుర్తి రైతు సేవా సహ‌కార సంఘం కొనుగోలు కేంద్రం వ‌ద్ద మంత్రి ఎర్ర‌బెల్లి ఆగారు. అక్క‌డ జ‌రుగుతున్న కొనుగోళ్ళ‌ను ప‌రిశీలించారు. మూడు నాలుగు రోజుల క్రితం గాలి వాన‌కు న‌ష్టాలు జ‌రిగాయా అని అడిగారు. లేవ‌న్న రైతుల‌తో మంత్రి మాట్లాడుతూ, కొనుగోళ్ళు సాఫీగా సాగేలా స‌హ‌క‌రించాల‌ని సూచించారు. క‌రోనా క‌ట్ట‌డి అయ్యేదాకా సామాజిక దూరాన్ని పాటించాల‌ని చెప్పారు. అధికారులు ఏవైనా ఇబ్బ‌దుల సృష్టిస్తే, త‌మ దృష్టికి తేవాల‌ని చెప్పారు.

అన్నారంలో:

మ‌హ‌బూబాబాద్ జిల్లా తొర్రూరు మండ‌లం అన్నారం గ్రామంలో త‌న‌కు ఎదురైన రైతుల‌తో మంత్రి మాట్లాడారు. అధికారులు త‌మ ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డంలేద‌ని ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించిన మంత్రి సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్ తో మాట్లాడారు. ధాన్యం ఒకేసారి కొనుగోలు సాధ్యం కాద‌ని, రైతులు ఓపిక ప‌డితే, వారి మొత్తం ధాన్యంలోని ఆఖ‌రు గింజ వ‌ర‌కు కూడా ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని రైతుల‌కు మంత్రి భ‌రోసా ఇచ్చారు.

More Press News