కరోనాతో కంపిస్తున్న కర్నూలు.. ప్రత్యేక బృందాల్ని పంపండి: పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

  • యుద్ధ ప్రాతిపదికన వ్యాధిని నివారించండి
"కర్నూలు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రజలను భయకంపితుల్ని చేస్తోంది. ఈ జిల్లాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసిన పరిస్థితులు ఈ జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి కర్నూలు జిల్లాలో వ్యాప్తి చెందడానికి కారణాలు, తప్పులను అన్వేషించడంలో జనసేన పార్టీకి ఎటువంటి ఆసక్తి లేదు. ప్రజల ఆరోగ్యమే జనసేన ఆకాంక్ష. ఈ  సమస్య మనందరిది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తోంది. ఈ జిల్లాలో ఈ క్షణం వరకు అందిన సమాచారం ప్రకారం 203 కేసులు నమోదు అయ్యాయి. అయిదుగురు చనిపోయారు. నలుగురు రోగులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇన్ని కేసులు ఈ జిల్లాలో నమోదవడం పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో తెలుపుతోంది. అందువల్ల కర్నూలు  జిల్లాకు  ప్రత్యేక బృందాల్ని పంపండి. ప్రత్యేక వ్యూహంతో వ్యాధి ఉదృతిని అరికట్టి, ప్రజలలో మనోధైర్యాన్ని నింపండి. వ్యాధి నివారణలో ఇప్పటి వరకు జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూడండి. వ్యాధి నివారణకు  ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు పని చేస్తున్న వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు అవసరమైనన్ని రక్షణ కిట్లు, ఇతర అవసరాలు సమృద్ధిగా అందించండి. ఇప్పుడు కూడా  మేల్కొనకపోతే ఈ వ్యాధి ఉదృతి ఈ జిల్లాలో చేయి దాటే ప్రమాదం వుంది. ఈ జిల్లాలో పరిస్థితిపై జనసేన స్థానిక నాయకులతోపాటు సీనియర్ రాజకీయవేత్త, బి.జె.పి.నాయకులు శ్రీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కూడా వ్యాధి తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ నాకు లేఖలు పంపారు. ఈ జిల్లావాసుల ఆందోళన తక్షణం  తీర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుంది." అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

More Press News