తెలంగాణలో పకడ్బందీగా లాక్ డౌన్ నిర్వహిస్తున్నాం.. వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రితో ఎర్రబెల్లి!
- కరోనా నిర్మూలనకు అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నాం
- ప్రతి నెలా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.1500 ఇస్తున్నాం
- 6 లక్షల మంది వలస కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నాం
- కరోనా కష్ట కాలంలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.5000 ప్రోత్సాహకం అందచేశాం
- స్వయం సహాయక సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను పంపిణీ చేశాం
- ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ను వ్యవసాయంలో విలీనం చేయండి
- 12,548 గ్రామాల్లో, 98శాతం ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి
- ప్రతి గ్రామానికి సగటున కనీసం 82 మందికి ఉపాధి పనులు కల్పిస్తున్నాం
- ఉపాధి హామీ కింద కూలీలకు సురక్షిత పని వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం
- కనీస మద్దతు ధరతో 4వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం, మక్కలు కొనుగోలు చేస్తున్నది
- వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ తో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ముందే లాక్ డౌన్ విధించిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటూనే ఉందన్నారు. లాక్ డౌన్ ఉన్న కాలంలో ప్రతి నెలా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.1500 ఇస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి వివరించారు. 6 లక్షల వలస కూలీలకు సైతం ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కొక్కరికి రూ.500, కుటుంబంతో ఉంటే రూ.1500 అందచేశామన్నారు. అదనంగా వలస కార్మికులు ఉండడానికి షెల్టర్లు కూడా ఇచ్చామని మంత్రి తెలిపారు.
కరోనా కష్ట కాలంలో పారిశుద్ధ్య కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.5000 ప్రోత్సాహకం అందచేశామని కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా 50 లక్షలకు పైగా మాస్కులను తయారు చేయించి పంపిణీ చేశామని తెలిపారు.
ఇక ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ను వ్యవసాయంలో విలీనం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని, ఆ విధంగా చేస్తే రైతాంగానికి ఉపయోగపడే విధంగా వ్యవసాయ అనుబంధ పనులకు ఇజిఎస్ ని వాడే వీలుంటుందని తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని, వీలైనంత త్వరగా ఆ నిర్ణయం తీసుకోవాలని ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
కాగా, రాష్ట్రంలోని 12,548 గ్రామాల్లో, అంటే 98శాతం గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయని, 10 లక్షల మంది కూలీల ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కాగా, ప్రతి గ్రామం నుంచి సగటున కనీసం 82 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. కరోనా నేపథ్యంలో ఉపాధి హామీ కింద కూలీలకు సురక్షిత పని వాతావరణాన్ని నెలకొల్పుతున్నామని, మాస్కులు, సానిటైజర్లు అందచేస్తున్నామని ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి తెలిపారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే రైతుల నుంచి మొత్తం పంటలను కొనుగోలు చేస్తున్నదన్నారు. రూ.1800 కనీస మద్దతు ధరతో 4వేల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యం, మక్కలు కొనుగోలు చేస్తున్నది అని కేంద్ర మంత్రి తోమర్ కి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, స్పెషల్ కమిషనర్ సైదులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.