ప్రజల ప్రాణాలకు మా ప్రాణాలను ఫణంగా పెడతాం: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
- సమస్యలెన్ని ఉన్నా... సంక్షేమం వీడం
- ఆర్థిక ఇబ్బందులున్నా...అభివృద్ధిని ఆపం
- కష్టాలెన్నైనా...కరోనాని కట్టడి చేస్తం
- సిఎం కెసిఆర్ చెప్పినట్లు నడుచుకోవాలి
- లాక్ డౌన్ ని పకడ్బందీగా పాటించాలి
- ప్రజలు పరస్పరం సాయం చేసుకోవాలి...ప్రభుత్వానికి సహకరించాలి
- రంగపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
- గంట్లకుంటలో ఇంటింటి సర్వేపై ఆరా
- తొర్రూరు, వెలికట్ట, కొడకండ్ల తదితర గ్రామాల్లో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
ప్రజలు చేయాల్సిందిల్లా... లాక్ డౌన్ ని ప్రజలు పకడ్బందీగా పాటించాలి. ప్రజలు పరసర్పరం సహకరించుకోవాలి. ప్రభుత్వానికి సహకరించాలి. అన్నారు. మంత్రి ఎర్రబెల్లి మంగళవారం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వైద్యులకు పిపి ఇ కిట్లను పంపిణీ చేసిన తర్వాత జనగామ జిల్లా కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, వెలికట్ట లలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా వైరస్ విస్తృతి ప్రపంచాన్ని వణికిస్తున్నది. అయినా అందరికంటే ముందే తన తెలివి, సాహసంతో సిఎం కెసిఆర్ గారు లాక్ డౌన్ ని ప్రకటించారు. అవసరాన్ని బట్టి దాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత కష్టకాలంలోనూ సిఎం కెసిఆర్ సంక్షేమాన్ని వీడలేదు. ప్రతి మనిషికి నెలనెలా 12కిలోల బియ్యం, రేషన్ కార్డుకు రూ.1500 ఇస్తున్నారు. వలస కూలీలను ఆదుకున్నారు. పెన్షన్లు ఇస్తున్నారు. మరోవైపు అధికారులు, పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు సైతం తమ ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. కష్టాలెన్ని ఎదురైనా సరే, కరోనా వైరస్ ని కట్టడి చేసి తీరుతామని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఆర్థిక సమస్యలు సంక్షోభ స్థాయికి చేరుకున్నా సరే, అటు అభివృద్ధిని కూడా వీడబోమని ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారని చెప్పారు. మరోవైపు రైతులను ఆదుకోవడానికి తద్వారా భవిష్యత్తులో ఆహార కొరత లేకుండా ఉండడానికి వీలుగా ప్రభుత్వమే ధాన్యం, మక్కలు, ఇతర పంటలను కొనుగోలు చేస్తున్నదన్నారు.
ప్రజలు సిఎం కెసిఆర్ చెప్పినట్లు నడుచుకోవాలి. లాక్ డౌన్ ని పకడ్బందీగా పాటించాలి. ప్రజలు పరస్పరం సాయం చేసుకోవాలి...ప్రభుత్వానికి సహకరించాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూడొద్దు. మీకు మీరే ఒకరినొకరు ఆదుకునే ఆప్తులు కావాలి అన్నారు. ఒకవేళ రేపు కరోనా కట్టడి కాకపోతే, మరికొద్ది రోజులు లాక్ డౌన్ ని పొడిగించినా సహకరించేందుకు సంసిద్ధం కావాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.
రంగపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన:
రంగపురం (కొడకండ్ల) ః జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగపురంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో, అధికారులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్ చొరవ తీసుకుని కనీస మద్దతు ధర రూ.1800 పెట్టి కొనుగోలు చేస్తున్నదన్నారు. పక్క రాష్ట్రాల్లో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వెయ్యి రూపాయల లోపే ధర వస్తున్నదని తెలిపారు. రైతులను ఇబ్బందులు పెట్టొద్దని అధికారులకు, ధాన్యాన్ని ప్రభుత్వ ప్రమాణాలకనుగుణంగా కొనుగోలు కేంద్రానికి తేవాలని రైతులకు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అలాగే సమాజిక, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
గంట్లకుంటలో ఇంటింటి సర్వేపై ఆరా:
గంట్లకుంటలో వైద్య సిబ్బంది చేస్తున్న ఇంటింటి సర్వే పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరా తీశారు. అక్కడ కనిపించిన వైద్య సిబ్బందితో మంత్రి మాట్లాడారు. ఇతర గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి వస్తున్న వాళ్ళపై నిఘా పెట్టాలని, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయాలని సూచించారు. కరోనా కట్టడి అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని, ప్రజల ప్రాణాలను కూడా జాగ్రత్తగా చూడాలని వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, వైద్య సబ్బింది, నిరుపేదలు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.