ఆప‌ద‌లో ఆప‌న్నురాలికి అండ‌గా నిలిచిన‌ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

  • తీవ్ర అస్వ‌స్థ‌త తెలుసుకుని వెంట‌నే హాస్పిట‌ల్ కి పంపిన మంత్రి
  • ఎస్ ఐ తో మాట్లాడి అనుమ‌తులు, వాహ‌నం ఏర్పాటు
  • డిఎం అండ్ హెచ్ఓ, మాట‌ర్నిటీ హాస్పిట‌ల్ సూప‌రింటెండ్ల‌కు స్వ‌యంగా ఫోన్లు
  • స‌త్వ‌ర‌మే వైద్యం అందించాల‌ని ఆదేశాలు
  • హ‌న్మ‌కొండ మాట‌ర్నిటీ హాస్పిట‌ల్ లో కోలుకుంటున్న బాలిక‌
  • మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపిన బాధిత కుటుంబం
పాల‌కుర్తి (జ‌న‌గామ జిల్లా), ఏప్రిల్ 18: పిలిస్తే ప‌లికే నేత‌గా పేరున్న తెలంగాణ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, త‌న‌ను అంతా ద‌య‌న్న అని పిలిచే పేరుని మ‌రోసారి సార్థ‌కం చేసుకున్నారు. ఆప‌ద‌లో ఉన్న ఓ ఆప‌న్నురాలైన బాలిక‌కు అండ‌గా నిలిచారు. 12 ఏండ్ల బాలిక తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన విష‌యం తెలుసుకుని వెంట‌నే స్పందించారు. సంబంధిత ఎస్ ఐ తో మాట్లాడి లాక్ డౌన్ నేప‌థ్యంలో ప‌ర్మీష‌న్ తోపాటు ఓ వాహ‌నం ఏర్పాటు చేయించారు. స్వ‌యంగా జిల్లా వైద్యాధికారి, సంబంధిత హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ల‌కు స్వ‌యంగా ఫోన్లు చేశారు. సత్వ‌ర‌మే వైద్యం అందేలా చూశారు. ప్ర‌స్తుతం ఆ బాలిక ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో కోలుకుంటుండ‌గా, ఆ బాధిత కుటుంబం మాత్రం మంత్రికి మ‌న‌స్పూర్తిగా ధ‌న్యవాదాలు తెలుపుతున్న‌ది. లాక్ డౌన్ ఉన్న స‌మ‌యంలో, రెక్కాడితే డొక్కాడ‌ని స్థితిలో, అనుకోని ఆప‌ద‌లో, ఎటు వెళ్ళాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న త‌మ‌కు అండ‌గా నిలిచిన ఎర్రబెల్లిని దీవిస్తున్నారు.

జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలోని బ‌త్తుల శ్రీ‌నివాస్ 12 ఏళ్ళ కూతురు రేణు శ్రీ‌ కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ది. ర‌క్త‌స్రావం జ‌రుగుతున్న‌ది. మొద‌ట‌గా ఏదో మాయ‌గా భావించి, ఇంట్లోనే దేవ‌త‌ల‌కు మొక్కుకున్నారు. త‌గ్గ‌క‌పోవ‌డంతో స్థానికంగా అందుబాటులో ఉన్న ఓ వైద్యుడికి చూపించారు. అయినా త‌గ్గ‌లేదు. ఓ వైపు రోజులు గ‌డుస్తున్నాయి. బాలిక‌కు ర‌క్తం త‌గ్గిపొతూ బ‌ల‌హీన ప‌డుతున్న‌ది. ఎక్క‌డికి వెళ్ళాలో తెలియ‌ని ప‌రిస్థితి, పైగా రెక్కాడితే గానీ డొక్కాడ‌ని కుటుంబం, నెల రోజులుగా క‌రోనా వైర‌స్ లాక్ డౌన్ కార‌ణంగా ప‌నులులేవు.

మ‌హారాష్ట్రలో బావులు తీసి బ‌తికే కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ విష‌యం కాస్తా తెలుసుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వెంట‌నే త‌న ప్ర‌జా సంబంధాల అధికారిని రంగంలోకి దించారు. స‌మ‌న్వ‌యం చేయాల్సిందిగా ఆదేశించారు. పాల‌కుర్తి ఎస్ ఐ గుండ్రాతి స‌తీష్ కి ఫోన్ చేసి, హ‌న్మ‌కొండ ప్ర‌భుత్వ ప్ర‌సూతి వైద్య‌శాలకు త‌ర‌లించడానికి అనుమ‌తుల‌తోపాటు, ఓ వాహ‌నం ఏర్పాటు చేయించారు. మ‌రోవైపు తానే స్వ‌యంగా వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితా దేవితో మాట్లాడారు. హ‌న్మ‌కొండ ప్ర‌సూతి ద‌వాఖాన సూప‌రిoటెండెంట్ డాక్టర్ సరళతో మాట్లాడారు. స‌త్వ‌ర‌మే వైద్యం అందించాల‌ని ఆదేశించారు. తాను స్వ‌యంగా బాధిత కుటుంబంతో మాట్లాడి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

కాగా, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశాల మేర‌కు పాల‌కుర్తి ఎస్ ఐ గుండ్రాతి స‌తీశ్, ద‌గ్గ‌రుండి అనుమ‌తులిచ్చి, వాహ‌నం సిద్ధం చేసి బాధిత కుటుంబాన్ని హ‌న్మ‌కొండ మిష‌న్ హాస్పిట‌ల్ కి పంపించారు. వెంట‌నే అక్క‌డి వైద్యులు స్పందించి వైద్యం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ బాలిక కోలుకుంటున్న‌ది. అయితే, త‌మ‌కు ఆప‌ద స‌మ‌యంలో ఆదుకుని స‌త్వ‌ర‌మే వైద్యం అందేలా చేసిన మంత్రి ద‌యాక‌ర్ రావుకి బ‌త్తుల శ్రీ‌ను కుటుంబం ధ‌న్య‌వాదాలు తెలిపింది. ద‌య‌న్న ప‌ది కాలాల‌పాటు చల్ల‌గా ఉండాల‌ని దీవిస్తున్న‌ది.

More Press News