అటవీ అగ్ని ప్రమాదాలు అదుపులోనే ఉన్నాయి: తెలంగాణ అటవీ శాఖ
- నిరంతర పహారా, అప్రమత్తతో అగ్ని ప్రమాదాలతగ్గుదల, నియంత్రణ
- గతంతో పోల్చితే తగ్గిన తీవ్రత, ప్రమాదాల సంఖ్య
- ఉపగ్రహాలు నమోదు చేస్తున్న ప్రమాదాల సంఖ్యలో అటవీ శాఖ చేపడుతున్న ముందస్తు చర్యలు కూడా ఉన్నాయి
- అగ్ని ప్రమాదాల వివరాలు వెల్లడించి, స్పష్టత నిచ్చిన అటవీ శాఖ
గత రెండేళ్లతో పోల్చితే ఈయేడు 15 శాతం తగ్గుదల నమోదైంది. వీటిల్లో 9,595 (92 శాతం) ప్రమాదాలను అటవీ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకున్న నివేదిక తయారు చేసింది. ఈ యేడాది నమోదైన సంఖ్యల్లో 113 ప్రాంతాల్లో అసలు ప్రమాదాలు జరగకపోగా, అటవీ ప్రాంతాలకు బయట 245 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. ఇక అటవీ శాఖ స్వయంగా తమ పరిధిలో భవిష్యత్తు పనుల కోసం చేసిన చర్యలు 2519 ( అడ్వాన్స్ ఆపరేషన్ ) కూడా అగ్నిప్రమాదాలుగా ఉపగ్రహాల ద్వారా నమోదయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వాస్తవానికి అడవుల్లో పునరుద్దరణ కోసం అవసరంలేని మొక్కలు, చెట్లను తొలగించి కాల్చివేసిన ప్రదేశాలు. అలాగే మంటలు చెలరేగితే అవి వ్యాప్తి చెందకుండా ఫైర్ లైన్లను అటవీ శాఖ సిబ్బంది ఏర్పాటు చేస్తారు. ఆక్రమంలో కూడా చెత్తను తగులబెట్టగా వాటిల్లో 314 అగ్ని ప్రమాదాలుగా నమోదు అయ్యాయి.
వీటిల్లో పాత ఫైర్ లైన్ల నిర్వహణ కోసం చేపట్టిన పనులు 89 ప్రమాదాలుగా లెక్కల్లో తేలాయి. ఇక ఆర్వో ఎఫ్ ఆర్ పట్టా భూముల్లో రైతులు పంట నిర్వహణ కోసం పెట్టిన నిప్పు 268 చోట్ల ప్రమాదాల కిందికి రాగా, ఆక్రమిత అటవీ భూముల్లో చదును కోసం పెట్టిన మంటలు 666 అగ్ని ప్రమాదాలుగా నమోదు అయ్యాయి. మొత్తం మీద 3,856 ప్రమాదాలు నిజానికి అగ్ని ప్రమాదాలు కాదు. అంటే నమోదిత ప్రమాదాల్లో అటవీ అగ్ని ప్రమాదాలు కాని వాటి శాతం సుమారు 35 నుంచి 40 శాతంగా ఉంది. ఇక మిగతా ప్రమాదాల్లో కూడా మెజారిటీ మానవ తప్పిదాలు, వేసవిలో పెరిగిన ఎండల కారణంగా నమోదైన ప్రమాదాలుగా క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి అయినట్లు పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు.
ఇక అగ్ని ప్రమాదాలపై రెండు ఉపగ్రహాలు (MODIS. SNPP) పంపిస్తున్న సమాచారంలో డూప్లికేషన్ శాతం కూడా ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. అంటే ఒక రోజులో ఇకే ప్రదేశంలో నమోదవుతున్న ప్రమాదాలను రెండు సార్లు, అంతకు మించి కూడా లెక్కించటం వల్ల అగ్ని ప్రమాదాల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు, ఈ విషయాన్ని ఉపగ్రహ నిర్వాహకులు FSI (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ) దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు అధికారులు తెలిపారు.
వాస్తవానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్ కు తెలంగాణ అటవీ శాఖ అగ్ని ప్రమాదాల నిర్వహణకోసం సర్వ సిద్దంగా ఉంది. కంపా నుంచి 14 కోట్ల నిధులతో అగ్ని ప్రమాద నివారణ చర్యలను ముందస్తుగా చేపట్టారు. ఎనిమిది వేల కిలోమీటర్ల పరిధిలో ఫైర్ లైన్లను ఏర్పాటుచేయటంతో పాటు, ప్రమాదాలు విస్తరించకుండా 9,470 కిలో మీటర్ల మేర కందకాలు తవ్వటం పూర్తయింది. ఐదుగురు సభ్యులతో 45 క్విక్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేసి ఒక్కో జీపు అందులో ఆధునిక అగ్ని మాపక సామాగ్రిని అందుబాటులో ఉంచారు. అత్యధిక అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉన్న అటవీ ప్రాంతాలను గుర్తించి వాటిల్లో 146 బేస్ క్యాంపులను, 69 వాచ్ టవర్లను తగినంత సిబ్బందితో అటవీ శాఖ ఏర్పాటు చేసింది.
ప్రత్యేకంగా అగ్ని మాపక శాఖకు లేఖ రాసి, ప్రమాదాల నియంత్రణలో పాల్గొనేలా అటవీ శాఖ చొరవ తీసుకుంది. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు కూడా సమాచారం ఇస్తూ మిగతా శాఖలతో సమన్యయం చేసుకుంది. ప్రతీ జిల్లా స్థాయిలో ఫైర్ ఫైటింగ్ సెల్ ను ఏర్పాటు చేయటంతో పాటు 15,300 మందికి అగ్ని ప్రమాదాల మెసేజ్ లు వచ్చేలా, తక్షణం స్పందించేలా చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా రోజూ అరణ్య భవన్ కు వస్తున్న ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిలో ఎలాంటి ఏమరుపాటు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలను అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తం చేసేందుకు 1400 గ్రామాల్లో అవగాహన సదస్సులను అటవీ శాఖ ఈ సీజన్ లో నిర్వహించింది. మొత్తం మీద ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల వల్ల అడవికి గానీ, వన్యప్రాణులు, జంతు సంపదకు గానీ ఎక్కడా నష్టం జరగలేదని, అయితే సహజ పునరుద్దరణకు మాత్రం గ్రౌండ్ ఫైర్ వల్ల ఆటంకం కలుగుతుందని, ఈ నష్టాన్ని కూడా వీలైంనంత తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అటవీ శాఖ వెల్లడించింది.