కరోనా నిర్మూలనలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు శ్లాఘనీయం: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
పల్లెల్లో పచ్చదనం-పరిశుభ్రతకి, పల్లె ప్రగతికి వారే ఆద్యులు-బాధ్యులు
సిఎం కెసిఆర్ ఔదార్యం గొప్పది
పని చేస్తున్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల్లోనూ సరైన గుర్తింపు
పారిశుద్ధ్య కార్మికులు మరింత బాధ్యతాయుతంగా పని చేయాలి
ప్రజలను, పారిశుద్ధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాలి
ప్రభుత్వానికి, సిఎం కెసిఆర్ కి మంచి పేరు తేవాలి
పంచాయతీ కార్మికులకు సిఎం ప్రోత్సాహకం విడుదల
రాష్ట్రంలోని 43,600 మందికి రూ. 21 కోట్ల 80 లక్షలు
జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సిఎంకి, కెటిఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్/పర్వతగిరి (వరంగల్ రూరల్ జిల్లా), ఏప్రిల్ 10: కరోనా నిర్మూలనలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు శ్లాఘనీయమని, పల్లెల్లో పచ్చదనం పరిశుభ్రత, పల్లె ప్రగతికి వాళ్ళే ఆద్యులు, బాధ్యులు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయితే, కరోనా లాంటి కష్ట కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి, వారొక్కక్కరికి రూ.5వేల ప్రోత్సాహం ప్రకటించి, వెంటనే విడుదల చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఔదార్యం ఎంతో గొప్పదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికీ సిఎం కెసిఆర్ ప్రత్యేక ప్రోత్సాహంగా ఒక్కొక్కరికి రూ.5వేల ప్రకటించిన ప్రకారంగా, సిఎం ఆదేశాల మేరకు నిధులు కూడా విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిఓ 16 జారీ చేసిన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. కరోనా కంటే ముందు నుంచే పారిశుద్ధ్య కార్మికులు అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలోనూ వారి సేవలు అమోఘమన్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వైద్యులు, పోలీసులు, ఆశా వర్కర్లు, అధికారుల మాదిరిగా పారిశుద్ధ్య కార్మికులు సైతం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నారన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పరిరక్షిస్తున్నారని తెలిపారు. వీరి సేవలను గుర్తించిన సిఎం స్పందించి ప్రత్యేక ప్రోత్సాహాన్ని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆ నిధులను కూడా విడుదల చేయడం గొప్ప విషయమన్నారు.
కరోనా విపత్తు వంటి కష్ట కాలంలోనూ పని చేసే వాళ్ళకి తగిన గుర్తింపు, గౌరవం ఇచ్చే విధంగా, సిఎం చర్యలున్నాయన్నారు. మాట మీద నిలబడటం, మడమ తిప్పకపోవడం, ప్రజల సంక్షేమం, రక్షణ కోసం ఎంతకైనా సిద్ధపడటం, ఆర్థిక మాంద్యం ఉన్న, కరోనా కారణంగా ఆర్థిక ఒడిదొడుకులున్నప్పటికీ, రాష్ట్రంలోని 43,600 మంది పారిశుద్ధ్య సిబ్బందికి రూ.21 కోట్ల 80 లక్షలు విడుదల చేయడం సీఎం కెసిఆర్ కే చెల్లిందన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సీఎంలను చూడలేదన్నారు. 40 ఏళ్ళ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కెసిఆర్ లాంటి సీఎంని చూడలేదన్నారు.
సిఎం కెసిఆర్ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నారని, ప్రజల కోసం పని చేస్తున్నవాళ్ళని గుర్తించి, గౌరవిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కెసిఆర్ కి పారిశుద్ధ్య కార్మికులు, వారి కుటుంబాలు ఎల్లప్పటికీ రుణపడి ఉంటాయని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు తెలిసిన వెంటనే స్పందించిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, నగరపాలక, పరిశ్రమల శాఖా మంత్రి కెటిఆర్ కూడా సానుకూలంగా స్పందించారని కొనియాడారు. అటు కెసిఆర్ కి, ఇటు కెటిఆర్ కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు పారిశుద్ధ్య కార్మికులపై బాధ్యత పెరిగిందని, వాళ్ళంతా మరింత బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. కరోనా వైరస్ కట్టడి అయ్యే వరకు ప్రజలను, పారిశుద్ధ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాలని చెప్పారు. ప్రజలకు మంచి సేవలు చేసి, అటు ప్రభుత్వానికి, ఇటు సీఎంకి మంచి పేరు తేవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పారిశుద్ధ్య కార్మికులకు ఉద్బోధించారు.