రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు: తెలంగాణ మంత్రి పువ్వాడ

రైతులు పండించిన మక్కల కొనుగోలులో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటుందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లాలోని వివి.పాలెం (రఘునాధపాలెం మండలం), అల్లీపురం (ఖమ్మం కార్పోరేషన్), లచ్చగూడెం (చింతకాని మండలం), పెద్ద గోపవరం (కొనిజర్ల మండలం) గ్రామాల్లో మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు బాగుంటేనే రాష్ట్ర బాగుంటుందని తద్వారానే అభివృద్ధి సాదించగలమన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మక్కలు, వరి ధాన్యం విస్తారంగా పండిందన్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలో గతంలో 96 కొనుగోలు కేంద్రాలు ఉండగా నేడు 432 కేంద్రాలకు పెంచటం జరిగిందన్నారు. ఎన్నడు లేని విధంగా మన రాష్ట్ర ధాన్య బండగారంగా మారిందన్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కొంత ప్రతిష్టంభన ఉందని, అయినప్పటికీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడి గ్రామాల్లో అక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు ఎవరు తొందర పడకుండా సామాజిక దూరం పాటిస్తూ తమ పనులు తాము చేసుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్య‌వ‌సాయం రంగంలో అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసుకున్నమన్నారు. నేడు యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికత, ముందు చూపుతోనే సాధ్యపడిందన్నారు. సమైక్య రాష్ట్రంలో కుదేలైన వ్య‌వ‌సాయం రంగం నేడు పునరుత్తేజం పొందింద‌ని తెలిపారు. అన్న‌దాత‌ల‌ను ఆదుకునే దిశ‌గా ప్ర‌భుత్వం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. దేశంలో ఎక్క‌డ లేని విధంగా రైతుబంధు, రైతు బీమా ప‌థకాల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు.  రైతుల‌కు 24 గంట‌ల ఉచిత క‌రెంట్ ను ఇస్తుందని, దీని వ‌ల్ల‌ సుమారు రూ.7 వేల కోట్ల స‌బ్సిడీ భారం ప‌డుతున్న‌ప్ప‌టికీ  రైత‌న్న‌ల మేలు కోసం ప్ర‌భుత్వమే భ‌రిస్తుంద‌ని తెలిపారు.

జిల్లాలో సాగు అయిన ప్రతి ఎకరంలో పండిన మక్కలు, వరి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆరుగాలం శ్ర‌మించి పంట పండించిన రైతులు న‌ష్ట‌పోకూడ‌ద‌నే ఉద్ద‌శ్యంతో  పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పిఏసిఎస్, మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గ‌న్ని బ్యాగుల కొర‌త రాకుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారు, ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వర రావు గారు, అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు గారు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం యాదవ్ గారు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు గారు, మార్కెక్ఫ్డ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, RDO రవీంద్రనాథ్ గారు తదితరులు ఉన్నారు.


More Press News