రైతు పక్షపాతిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

  • ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్
  • మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో అత్యున్నత స్దాయి సమీక్ష
రైతు పక్షపాతిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ సాగాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆదేశించారు. ప్రత్యేకించి ధాన్యం క్రయ,విక్రయాలకు సంబంధించి ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా వ్యవస్ధా పరమైన లోపాలను అధికమించాలని స్పష్టం చేసారు. రాజ్ భవన్ లో శనివారం వ్యవసాయ మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.  మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోనా శశిధర్, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రధ్యుమ్న, పౌర సరఫరాల సంస్ధ ఎండి సూర్య కుమారి తదితరులు, వేర్వేరుగా సాగిన సమావేశాలలో పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో సమావేశమైన హరిచందన్ లాక్ డౌన్ వేళ వ్యవసాయ పనులు ఆగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అవాంతరం ఏర్పడితే పలు ఇక్కట్లను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.

ప్రస్తుత రబీ సీజన్లో పౌర సరఫరాల సంస్ధ ద్వారా 32.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసామని అధికారులు గవర్నర్ కు వివరించారు. రైతు కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలోనే నేరుగా ధాన్యం కొనుగోలు చేసి అక్కడి నుండే రవాణా జరిగేలా ఏర్పాట్లు చేసామని, నగదు సైతం రైతుల ఖాతాలలోనే జమ అయ్యేలా పూర్తి కంప్యూటరీకరణతో పారదర్శకంగా పనులు జరిగేలా ఏర్పాట్లు చేసామని కోనా శశిధర్ గవర్నర్ కు వివరించారు.  గ్రామం ఒక యూనిట్ గా మార్కెటింగ్ వ్యూహాలను సిద్దం చేసామని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పరంగా ఎటువంటి ఆటంకాలు కలిగించ వద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధన్ రెడ్డి గౌరవ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.

సగటు ప్రజలకు ఏవిధమైన ఇబ్బంది కలగని రీతిలో ముఖ్యమైన వస్తువుల మార్కెటింగ్ కు సంబంధించి పూర్తి స్ధాయి కార్యాచరణ అమలు చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రధ్యుమ్న గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు సమస్యల పరిష్కారంలో అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తిని చూపుతున్నారని, వారి ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయదారులతో వ్యవహరించాలని బిశ్వ భూషణ్ పేర్కొన్నారు. సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

రండి దీపాలు వెలిగిద్దాం: హరి చందన్ 
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ఆదివారం ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లోని విద్యుత్ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా ప్రతి స్పందించాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో  9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించి తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలన్నారు. చమురు దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు ... ఇలా ఏదోక రూపంలో కాంతిని వెలిగించి, కరోనా అనే చీకటి మహమ్మారిని తరిమేద్దాం అన్న సంకల్పం చాటటం అత్యావశ్యకమన్నారు. జనతా కర్ప్యూస్ఫూర్తిని మరోమారు చాటుతూ, మీ విలువైన సమయంలో ఓ 9 నిమిషాలు దేశం కోసం కేటాయించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

More Press News