గతంలో ఉన్న 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే నిబంధనను ఎత్తివేస్తున్నాం: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్

  • ఎవరూ ఆందోళన చెందొద్దు

  • 15 రోజుల నిబంధన ఎత్తివేత

  • నెల మొత్తం రేషన్ బియ్యం పంపిణీ

  • బియ్యానికి నగదుకు సంబంధం లేదు

  • పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని అందిస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

రేషన్ పంపిణీపై శుక్రవారం నాడు తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూపన్ తీసుకున్న వారు, తీసుకోని వారు అందరు కూడా ఒకేసారి రేషన్ షాపులకు రావడంతో రద్దీ పెరుగుతోందని, కూపన్ తీసుకున్న వారు మాత్రమే రేషన్ షాపులకు రావాలని విజ్ఞప్తి చేశారు.

స్టేట్ డాటా సెంటర్ (ఎ డీసీ)లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల సర్వర్ డౌన్ అయింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 1, 2 తేదీల్లో రికార్డు స్థాయిలో 14 లక్షల కార్డుదారులు 55,561 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నారని, ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం వరకు నాలుగు లక్షల మంది రేషన్ తీసుకోవడం జరిగిందన్నారు.

2.80 కోట్ల మందికి కావాల్సిన 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ షాపుల్లో నిల్వ ఉంచామని, బియ్యం అందుతాయో లేదో అనే ఆందోళన అవసరం లేదని, ఈ నెల మొత్తం రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తామని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రేషన్ షాపులు నిరంతరాయంగా తెలిచే ఉంటాయని తెలిపారు. గతంలో ఉన్న 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే నిబంధనను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నవితరణ్ పోర్టల్ లో రేషన్ వివరాలు నమోదు కోసం తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయవలసి వస్తోందని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని నిబంధనలను సడలించిందన్నారు. వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకున్న వారు వేలిముద్ర వేయకుండానే రేషన్ తీసుకునే సదుపాయం కల్పించిందని, పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారికి మాత్రం వేలిముద్రను వేసి బియ్యం తీసుకోవాలన్నారు.

రేషన్ బియ్యం తీసుకుంటేనే రూ. 500 నగదు ఇస్తారనే ప్రచారాన్నే నమ్మొద్దని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ.1500 నగదును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసిందని అన్నారు.


More Press News