పర్వతగిరి రోడ్లపై సోడియం హైపో క్లోరైడ్ కొట్టిన మంత్రి ఎర్రబెల్లి
గడప గడపకూ దయన్న సందర్శనం! ప్రతి ఒక్కరిలో నింపెను చైతన్యం
సొంతూరులో ఇంటింటికీ మాస్కుల పంపిణీ
పిల్లలకు స్వయంగా మాస్కులు కట్టిన ఎర్రబెల్లి
కరోనా నిర్మూనలకు లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి
వైరస్ వ్యాప్తి, సమూల నాశనంపై ప్రజల్లో అవగాహన, భరోసా
సిఎం కెసిఆర్ దార్శనికత వల్లే మనం దర్జాగా ఉన్నాం
సర్కార్ కు సహకరిస్తే... మనమంతా క్షేమంగా ఉంటాం
సొంతూరు ప్రజలతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు
పర్వతగిరి (వరంగల్ రూరల్ జిల్లా), ఏప్రిల్ 1: ఉన్న ఊరు కన్న తల్లి రుణం తీర్చుకోలేనిదంటారు. పుట్టిన ఊరు, కన్న తల్లితో సమానం. అందుకే తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, తన కుటుంబం తాను పుట్టిన పర్వతగిరికి ఎనలేని సేవలు చేస్తున్నారు. తానే కాదు తన కుటుంబం అంతా సేవలోనే నిమగ్నమయ్యారు. తాజాగా కరోనా వైరస్ నిర్మూలన నేపథ్యంలో లాక్ డౌన్ లో భాగంగా పర్వతగిరిలో ఉంటూ పూర్వ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ, ప్రజల్నిచైతన్యం చేస్తూ, అధికారులతో సమీక్షిస్తూ, సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రజలను, రైతాంగాన్ని ఆదుకునే పనిలో బిజీగా ఉన్నారు.
మరోవైపు ఈ ఆపత్కాలంలో ప్రజలతో కలిసి వారిలో భరోసా నింపుతున్నారు. ఇదే దశలో.. తాను పుట్టిన ఊరు పర్వతగిరిలోనే ఉంటున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కరోనా కట్టడికి ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తున్నవేళ... ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, నేనున్నానంటూ.. భరోసా నింపుతూ... వీధుల్లో కరోనాని సమూలంగా నాశనం చేసే సోడియం హైపో క్లోరైడ్ కొడుతూ, ఇంటింటికీ మాస్కులు పంపిణీ చేస్తూ ఊరంతా తిరిగారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, కరోనా నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ, కొందరికి స్వయంగా మాస్కులు కట్టారు. తనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళని పలకరిస్తూ, కరోనా కష్ట కాలంలో ఎలా ఉన్నారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం అందాయా? అంటూ ఆరా తీశారు. అలాగే, కరోనా నిర్మూలనకు సబ్బుపెట్టి చేతులు బాగా కడుక్కోవాలని, పరిశుభ్రంగా ఉండాలని, సామాజిక, భౌతిక దూరాన్ని పాటించాలని, జలుబు, దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం వంటి సమస్యలు వస్తే, వెంటనే సమీప ప్రభుత్వ దవాఖానాల్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ తప్ప వేరే దారిలేదన్నారు. వైరస్ నిర్మూలనకు ఇంకా వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదన్నారు. ప్రపంచం అంతా గజగజ వణికి పోతుంటే, బెంబేలెత్తుతుంటే, ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ప్రజలు, అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులంతా కలిసి కరోనా వ్యాప్తిని నిరోధించ గలుగుతున్నామ న్నారు. లాక్ డౌన్ తో నిశబ్ధ యుద్ధం చేస్తున్నామన్నారు. ఇదంతా కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వల్లే సాధ్యమైందన్నారు. కెసిఆర్ గారి ముందు చూపుతో ముందుగానే మేల్కొన్నామని, మరోవైపు ప్రధాని మోడీ సైతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారన్నారు. ప్రభుత్వ వినూత్న పథకాల అమలులోనే కాదు, కరోనా నిర్మూలనకు మన కెసిఆర్ గారు తీసుకున్న చర్యలను ప్రపంచమంతా కొనియాడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు వివరించారు.
ఈ విపత్కర తరుణంలో వైద్యులు, అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివన్నారు. వారంతా అద్భుతంగా పని చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ప్రశంసించారు. మరికొంతకాలం ప్రజలంతా సహకరిస్తే, లాక్ డౌన్ ని పకడ్బందీగా చేస్తే, కరోనా నిర్మూలన సాధ్యమేనని, అప్పటి దాకా ప్రజలు ఓపిక పట్టాలని అన్నారు. నిరుపేదలకు ఇబ్బందులు కలగకుండా 12కిలోల బియ్యం, రూ. 1500 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని మంత్రి వివరించారు. అలాగే, రైతాంగం పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందున రైతాంగం కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వలస కూలీలను కూడా ఆదుకుంటున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
ఈ కార్యక్రమంలో పర్వతగిరి సర్పంచ్, ఎంపీటీసీ, స్థానిక పంచాయతీ సిబ్బందీ తదితరులు పాల్గొన్నారు.