కరోనా వ్యాప్తి నిరోధంలో మరింత చురుకుగా రెడ్ క్రాస్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించి, ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుండి బయటకు తీసుకురావటంలో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ కీలక భూమికను పోషించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. ప్రస్తుత పరిస్ధితుల నేపధ్యంలో రెడ్ క్రాస్ ఎటువంటి పాత్రను పోషించాలన్న దానిపై రాష్ట్ర రెడ్ క్రాస్ సొపైటీ బాధ్యులకు గవర్నర్ దిశా నిర్ధేశం చేసారు. శుక్రవారం రాజ్ భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన గవర్నర్ రెడ్ క్రాస్ సొసైటీని పూర్తి స్ధాయిలో సమాయత్తం చేయాలన్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్  ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఇప్పటికే చేపడుతున్న వివిధ కార్యక్రమాలను గురించి వివరించారు. కోవిడ్ -19 నివారణకు సంబంధించిన చేయవలసినవి, చేయకూడని వంటి వాటి గురించి అవగాహన కల్పించే ప్రక్రియలో చురుకుగా పాల్గొంటున్నామన్నారు.
       
ఈ నేపధ్యంలో గవర్నర్ పలు అదేశాలు జారీ చేస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా అనుసరించాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంపిణీ చేయాలని, నిరాశ్రయులైన ప్రజలు, బిచ్చగాళ్లకు ఆహారం, నీటి పాకెట్లు పంపిణీ చేయాలన్నారు. వాలంటీర్ల ద్వారా సాధారణ ప్రజలు, కరోనా విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ముసుగులు పంపిణీ చేస్తున్నామని, పోలీసు, ఇతర ప్రభుత్వ కార్యకర్తలతో సమన్వయంతో ప్రజలు ఇంట్లోనే ఉండటానికి అనుగుణంగా ప్రచారం చేయడం వంటి పనులతో ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా జనతా కర్ఫ్యూ రోజున రెడ్ క్రాస్ సొసైటీ చురుకుగా పాల్గొన్న విషయాన్ని అధికారులు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.  APRC టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1234 ను కూడా ప్రారంభించగా అది 24X7 పనిచేస్తుందని, ఇక్కడ అవసరమైన వ్యక్తులు సహాయం కోసం అభ్యర్థిస్తుండగా, నమోదు చేసుకుని తగిన సూచనలు అందిస్తున్నామని తెలిపారు. సహాయ చర్యల కోసం మరింత మంది వైధ్యులు, నర్సులు, వాలంటీర్ల సేవలు అవసరమని తదనుగుణంగా వారిని సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు.

ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టాలని గవర్నర్ బిశ్వ భూషణ్ రెడ్ క్రాస్ ఛైర్మన్‌ను ఆదేశించారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించిన భారీ అవగాహనా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. తద్వారా వైరస్ వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నమవుతుందని, ఫలితంగా దానిని పరిమితం చేయగలుగుతామన్నారు. లాక్ డౌన్ కాలంలో సంరక్షణ, ఆహారం, ఆశ్రయం అవసరమయ్యే బిచ్చగాళ్ళు, నిరాశ్రయులను జాగ్రత్తగా చూసుకోవడం కీలకమన్నారు. ఈ సమావేశంలో గవర్నర్  కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

More Press News