నష్టపోయిన రైతులకు సాధ్యమైనంత ఎక్కువ సాయం: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
చేతికొచ్చిన చేలు.. గాలీ, వడగండ్ల వాన పాలు
పాలకుర్తి నియోజకవర్గంలో భారీ నష్టం
వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట, పర్వతగిరిల్లోనూ పంటల నష్టాలు
రైతుల పొలాలు, చెలకలకు అధికారులు
అవసరమైతే ఇంటింటికీ పంట నష్టాల సర్వే
ఎకరాకు రూ.20వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు
నిన్ననే సిఎం దృష్టికి పాలకుర్తి పంట నష్టాలు
సాధ్యమైనంత ఎక్కువ సాయానికి కృషి
పాలకుర్తి, దేవరుప్పుల, జఫర్ గడ్, వర్దన్నపేట, పర్వతగిరి
'చేతికొచ్చిన చేలు వడగండ్ల పాలు అయ్యాయి. నోటికాడి బుక్క వానెత్తుకపోయినట్లయింది. ఆశలు అడియాశలయ్యాయి. అకాల వర్షం... అందునా వడగండ్లు రైతన్నలకు కడగండ్లు తెచ్చాయి. ఇది చాలా బాధాకరం...రైతులను ఆదుకోవడానికే నేను వచ్చాను. ఇప్పటికే సిఎం గారితో మాట్లాడాను. సర్వే చేయిస్తున్నాం. నివేదికలు రాగానే నష్టపోయిన రైతులకు సాధ్యమైనంత ఎక్కువ సాయం చేయడానికే కృషి చేస్తాం'. అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిన్న వీచిన గాలులు, కురిసిన వడగండ్ల వానకు తీవ్రంగా నష్టపోయిన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మాదాపురం, చౌడూరు, పాలకుర్తి మండలం శాతాపురం, తొర్రూరు, కొండాపురం గ్రామాలను మంత్రి సందర్శించారు.
అలాగే, వరంగల్ రూరల్ జిల్లా జఫర్ గడ్ మండలం ముగ్దుం తండా, వర్దన్నపేట, పర్వతగిరి తదితర మండలాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. నేరుగా పొలాలు, చెలకలకు వెళ్ళి స్వయంగా పంటలను పరిశీలించారు. స్వతహాగా రైతు అయిన మంత్రి, ఆయా పంటలను పట్టుకుని చూసి బాధ పడ్డారు. రైతులతో మాట్లాడారు. వారు వేసిన పంటలు, పెట్టిన పెట్టుబడులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టాలను ఆరా తీశారు. వెంట వచ్చిన అధికారులను అడిగి పంట నష్టాల అంచనాకు వచ్చారు. అధికారులతో మాట్లాడి నేరుగా రైతుల పంట పొలాలు, చెలకల వద్దకే వెళ్ళి పంట నష్టాల సర్వే చేయాలన్నారు. అవసరమైతే, రైతుల ఇళ్ళకు వెళ్ళి ఇంటింటి సర్వే చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పంట నష్టాల అంచనాలు ఇవ్వాలని సూచించారు. ఆయా నివేదికలను సీఎం దృష్టికి తీసుకెళ్ళి, రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. నేను స్వయంగా పంట నష్టాలను పరిశీలించాను. నష్ట తీవ్రత చాలానే ఉంది. రైతులు బావురు మంటున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.20వేల పెట్టుబడి పెట్టామని చెబుతున్నారు. నిన్నటి వడగండ్లతో దాదాపు పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు మామిడి రైతుల పరిస్థితి కూడా దీనంగానే ఉంది. మామిడి పిందెలు, ఆపై స్థాయికి చేరిన కాయంతా రాలిపోయింది. మక్క జొన్న రైతుల పరిస్థితీ అలాగే ఉంది. ఈ విషయాలను స్వయంగా చూడ్డానికే నేను వచ్చాను. నిన్ననే కరోనా వైరస్ నియంత్రణపై జరిగిన సమావేశంలోనే పాలకుర్తి, వర్దన్నపేట, పర్వతగిరిలో వడగండ్ల వానల గురించి చెప్పాను. ఇవ్వాళ్టి పరిస్థితిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళతాను. అలాగే, పంటల నష్టం అంచనా నివేదికలు వచ్చాక సిఎం గారితో మాట్లాడి, నష్టపోయిన రైతులకు సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు అధైర్య పడవద్దని సూచిస్తున్నాను. అని అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట జనగామ జిల్లా కలెక్టర్ నిఖిల, రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పంటలు నష్టపోయిన రైతులు, మహిళా రైతులు, ప్రజలు ఉన్నారు.