ఈ నెల 12న బీజేపీ-జనసేనల మేనిఫెస్టో!

• సత్వరమే అభ్యర్ధుల ఎంపిక

• రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ 

• ఇరు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తాం

• సమన్వయ సమావేశం అనంతరం మీడియాతో నాదెండ్ల మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన సమన్వయంతో ముందుకు వెళ్తాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సత్వరం అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేయడంతో పాటు 12వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఇరు పార్టీల ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీల సభ్యులతో  సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ జీ హాజరై ముఖ్య ఉపన్యాసం చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కలసి ముందు వెళ్లే అంశం మీద ఇరు పార్టీల నేతల మధ్య కీలక చర్చ జరిగింది.

అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. "భవిష్యత్తులో ఈ పొత్తును మరింత దృఢంగా, విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. నాయకత్వాన్ని బలపర్చుకుంటూ ఓ అవగాహనతో ఇరు పార్టీల నేతలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తాం. సమావేశంలో ఎన్నికలలో కలసి ముందుకు వెళ్లడంతోపాటు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా భవిష్యత్తులో కేంద్రం సహకారంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశం మీద ఇరు పక్షాల ఆలోచనలు పంచుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాం.

స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం. ఓ అయోమయంతో కూడిన కక్షపూరిత చర్యలతో ప్రభుత్వం సమయాన్ని, ప్రజా ధనాన్ని వృథా చేస్తున్న విషయాన్ని, ఈ తరహా పాలనవల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్న అంశాన్ని ప్రజల ముందు ఉంచుతాం. భవిష్యత్తులో కలసి ప్రజల తరఫున పోరాటాలు చేయడంతో పాటు మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రానికి మేలు చేయాలని నిర్ణయించడం జరిగింది"  అన్నారు.

• ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పికొడతాం: దగ్గుబాటి పురంధేశ్వరి

బీజేపీ ముఖ్య నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. "ప్రతిపక్షాలను దెబ్బ తీసే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని చూస్తోంది. ప్రభుత్వ ఎత్తుగడను తిప్పికొట్టే విధంగా జనసేన, బీజేపీలు సమన్వయంతో ముందుకు వెళ్తాయి.

ఇరు పార్టీలు సమన్వయంతో, అవగాహనతో ముందుకు వెళ్తాయి. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలు వేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తాం. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, కక్షపూరిత ధోరణులు మినహా వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం. బీజేపీ, జనసేన కార్యకర్తల మీద జిల్లాల్లో దాడులు చేస్తున్నారు, పోలీసుల సహాయంతో అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. జనసేన-బీజేపీలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామ స్థాయిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు వెళ్తాం. బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం" అన్నారు.

సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన నుంచి కందుల దుర్గేష్, బోనబోయిన శ్రీనివాసయాదవ్, టి.శివశంకర్, వి గంగులయ్య, సి.హెచ్ మధుసూదన్ రెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, బిజెపి నుంచి మాధవ్, సోము వీర్రాజు, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, శనక్కాయల అరుణ, శాంతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


More Press News