మహిళలకు పూర్తి రక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం: టీఎస్-ఐఐసీ చైర్మన్
- షీ టీమ్‌ల ఏర్పాటుతో దేశానికే తెలంగాణ ఆదర్శం
- మహిళా ఆర్థిక స్వావలంభన దిశగా విప్లవాత్మక పథకాలు
- స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలతోనే వేగవంతమైన అభివృద్ధి
- టీఎస్-ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు వెల్లడి
- అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా టీఎస్‌ఐఐసీ మహిళా ఉద్యోగులకు సన్మానం
ఈ సందర్భంగా బాలమల్లు మాట్లాడుతూ.. పురుషులు, మహిళలు సమ నిష్పత్తిలో కలిసికట్టుగా పనిచేసినపుడే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రపంచంలో ఈ దిశగా వెళుతున్న అనేక దేశాలు ప్రగతిపథాన దూసుకెళుతుండగా, మన దేశంలో ఇంకా మహిళలపై పురుషుల వివక్షత కొనసాగుతుందన్నారు. దేశంలో మూడొంతుల మంది మహిళలు వంటింటికే పరిమితమవడంతో వారి శక్తి, యుక్తులు వృధాగా మిగిలిపోయి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. విద్య అవకాశాలతో మహిళలలో క్రమేపీ చైతన్యం వెల్లివిరుస్తూ నేడు అన్ని రంగాలలో వారి భాగస్వామ్యం పెరుగుతుండటం శుభ సూచకమన్నారు.
ప్రభుత్వ సాధికారత కార్యక్రమాల ఫలితంగా మహిళలు ఆర్థిక స్వావలంభన సాధించడమే కాకుండా రిజర్వేషన్ల కారణంగా రాజ్యాధికారంలోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థలలో 50 శాతం పదవులను చేపట్టి సమర్థవంతంగా పరిపాలన సాగిస్తున్న మహిళలు చట్టసభలలో 33 శాతం వాటా కోసం పోరాటం చేస్తుండటం అభినందనీయమని బాలమల్లు పేర్కొన్నారు. మహిళాభ్యుదయమే నిజమైన అభివ్రద్ధి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్ముతారని, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో మహిళలు అన్నిరంగాలలో పురోగమించేలా విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను అమల్లోకి తేవడమే అందుకు నిదర్శనమన్నారు.
మహిళలను దేవతల్లాగా చూసుకోవాలన్న తపనతో ముఖ్యమంత్రి ఉన్నారని, అందుకే ఆడపిల్లలకు లైంగిక వేధింపులు, ఇతర ఆపదలు తలెత్తకుండా దేశంలో ఎక్కడాలేని విధంగా షీ టీమ్‌లను ఏర్పాటు చేసి దోషులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారని కితాబిచ్చారు. మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ వారిని అన్నిరంగాలలో ఆర్థికస్వావలంభన దిశగా ముందుకు నడిపించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని టీఎస్-ఐఐసీ చైర్మన్ బాలమల్లు తెలిపారు. టీఎస్-ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా టీఎస్-ఐఐసీలో మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయడం అభినందనీయమన్నారు.
సంస్థలో హెచ్‌వోడీలలో మహిళలే అధికంగా ఉన్నారని, జోన్లలోనూ 50 శాతం వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులో మహిళలకు 10 శాతం రిజర్వేషన్ పక్కగా అమలు జరుగుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున రాబోయే రోజుల్లో మహిళలతో కలిసి టీఎస్-ఐఐసీ ఉద్యోగులు పనిచేయాలని టీఎస్-ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్-ఐఐసీ సీఈవో మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, జీఎంలు రేవతిభాయి, డీజీఎంలు కవిత, సుధారాణి, ఆడిటర్ డోలా ఛటర్జీ, శశికళ, టీఎస్-ఐఐసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.విఠల్, ఇతర మహిళా అధికారులు పాల్గొన్నారు.