సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి తలసాని

ఎంతో ప్రసిద్ధిగాంచిన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ ను రానున్న రోజులలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం మోండా మార్కెట్ లోని కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, ఫిష్ మార్కెట్ లలో ghmc కమిషనర్ లోకేష్ కుమార్, వివిధ శాఖల అధికారులతో కలిసి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ లోని వ్యాపారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి త్రాగునీటి సౌకర్యం, లైట్స్, పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలు పరిష్కరించడంతో పాటు భవిష్యత్ లో నీడనిచ్చే మొక్కలను భారీగా మార్కెట్ లో నాటనున్నట్లు తెలిపారు. మార్కెట్ లో  అవసరమైన చోట్ల స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.

మార్కెట్ లోని వ్యాపారుల త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు దాతల సహకారంతో RO ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతనంగా 4 పవర్ బోర్లు ఏర్పాటు చేసి ట్యాంకులు నిర్మించి, నల్లాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓల్డ్ జైలు ఖానా నుండి సికింద్రాబాద్ స్టేషన్ వరకు VDCC రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ghmc కమిషనర్ లోకేష్ ను ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే విధంగా మార్కెట్ లోకి ఆవులు వస్తుండటం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు తెలిపారని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఇంటి అవసరాలకు అవసరమైన్ అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయనే ప్రత్యేక గుర్తింపు మోండా మార్కెట్ కు ఉందన్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు త్వరలోనే మార్కెట్ లోని అన్ని రకాల సమస్యలను పరిష్కరించి ఎంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్, DC ముకుంద రెడ్డి, వెటర్నరి అధికారి గోవర్ధన్ రెడ్డి, AMOH రవీందర్ గౌడ్, స్ట్రీట్ లైట్స్ EE ప్రభాకర్, DE మహేష్, వాటర్ వర్క్స్ DOP కృష్ణ, GM రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


More Press News